టీటీడీ బోర్డు స‌భ్య‌త్వాల్లో గోల్‌మాల్‌.. కేంద్ర‌మంత్రి లేఖ‌తో క‌ల‌క‌లం..

లీల‌లు చాటే శ్రీవారికే.. లీల‌లు చూపించారు ఘ‌నులు. టీటీడీ జంబో బోర్డు స‌భ్య‌త్వాల నియామ‌కాల్లో గోల్‌మాల్ య‌వ్వారం జ‌రిగిన‌ట్టు తేలుతోంది. ఈ విష‌యం స్వ‌యంగా కేంద్ర‌మంత్రే వెల్ల‌డించ‌డంతో ఒక్క‌సారిగా అటెన్ష‌న్ పెరిగింది. ఇప్ప‌టికే టీటీడీ జంబో బోర్డు నియామ‌కంపై పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గా.. తాజాగా ఏకంగా కేంద్ర‌మంత్రి పేరును వాడుకొని అక్ర‌మ మార్గంలో స‌భ్య‌త్వాన్ని క‌ట్ట‌బెట్టార‌ని తెలిసి అంతా ఉలిక్కిప‌డుతున్నారు. ఇంకా ఇలాంటి ఘ‌న‌కార్యాలు ఇంకెన్ని చేశారోన‌ని.. ఈ త‌తంగం వెనుక ఎన్ని కోట్ల సొమ్ము చేతులు మారాయోన‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌లియుగ దైవం వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య బోర్డునూ ఇలా వివాదాల‌కు, అక్ర‌మాల‌కు కేంద్రంగా మార్చ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

టీటీడీ జంబో బోర్డు ఏర్పాటుపై మొదలైన రాజకీయ దుమారం కొత్త మలుపు తిరిగింది. తాజాగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి రాసిన‌ లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు వై.రవిప్రసాద్‌ పేరును తాను సిఫారసు చేయలేదని లేఖ‌లో కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా కానీ, పర్యాటకశాఖ తరఫున గానీ.. తాను ఎవరినీ సూచించలేదని చెప్పారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని జగన్‌కు సూచించారు. 

కేంద్ర‌మంత్రి కిషన్‌రెడ్డి లేఖతో టీటీడీలో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. లేఖ‌ను బ‌ట్టి వై.ర‌విప్ర‌సాద్ అనే వ్య‌క్తిని కిష‌న్‌రెడ్డి రిక‌మెండేష‌న్ పేరుతో బోర్డులో ఆయ‌న పేరును జొప్పించిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇంత‌కీ ఈ ర‌విప్ర‌సాద్ ఎవ‌రు?  కిష‌న్‌రెడ్డి పేరు చెప్పి ఆయ‌న్ను ప్ర‌త్యేక ఆహ్వానితునిగా చేర్చింది ఎవ‌రు?  తెర‌వెనుక ఈ కుట్ర చేసింది ఇంకెవ‌రు? అంత ఈజీగా ఈ ప‌ని ఎలా చేయ‌గ‌లిగారు?  టీటీడీ పెద్ద‌ల హ‌స్తం ఉందా? లేక‌, రాష్ట్ర పాల‌కుల క‌నుస‌న్న‌ల్లోనే ఈ య‌వ్వారం సాగిందా? ఏపీ బీజేపీ కీల‌క నాయ‌కులే కిష‌న్‌రెడ్డి పేరు చెప్పి ఈ ప‌ని కానిచ్చేశారా? ప్ర‌తిఫ‌లంగా చేతులు మారిన మొత్తం ఎంత‌? ఆ సొమ్ము ఎవ‌రికి ముట్టింది? డ‌బ్బులా లేక మ‌రేదైనా క్విడ్‌ప్రోకో న‌డిచిందా? ఇలా అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇందులో వైసీపీతో పాటు ఏపీ బీజేపీ నేతల పాత్ర కూడా ఉన్నట్టు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందిన‌ట్టు తెలుస్తోంది.