గోల్ఫ్ ఆడితే జీవితకాలం పెరుగుతుంది


గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక-

 

 

గోల్ఫ్ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌

World Golf Foundation అనే సంస్థ గోల్ఫ్‌ ఆటకీ ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు ఈ గోల్ఫ్‌ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్టుని ఆరంభించింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు... గోల్ఫ్‌ మీద ఇప్పటివరకూ జరిగిన ఐదేవేల పరిశోధనలను సమీక్షించారు. గోల్ఫ్‌ ఆడే సమయంలో వారిలో ఎన్ని కేలొరిలు ఖర్చవుతున్నాయి, వారు సగటున ఎంత దూరం నడవాల్సి వస్తోంది, వారి ఆరోగ్యం మీద ఆట ప్రభావం ఏమిటి... తదితర విషయాలను పరిశీలించారు.

 

 

జీవతకాలమే మెరుగుపడింది.

పరిశోధకుల సమీక్షలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి. గుండెపోటు, పక్షవాతం, డయాబెటీస్‌, పేగు క్యాన్సర్ వంటి 40 రకాల తీవ్రమైన రోగాలను గోల్ఫ్‌ నివారించగలుగుతోందని తేలింది. ఒక పరిశోధనలో అయితే గోల్ఫ్‌ అడేవారి జీవితకాలం ఏకంగా ఐదేళ్లపాటు మెరుగుపడినట్లు బయటపడింది. ఇంతేకాదు! వయసుతో పాటు వచ్చే నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు... గోల్ఫ్‌ ఆటలో మాయమవుతున్నాయట. గోల్ఫ్‌ ఆటతో శరీరమే కాదు మనసు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంతో పాటుగా... ఆందోళన, మతిమరపు, క్రుంగుబాటు వంటి వ్యాధుల నుంచి దూరం కావడం జరిగిందట.

 

 

కారణం!

గోల్ఫ్ ఆటలో ఆటగాళ్లు కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాలి. వారి బలమంతా ఉపయోగించి బంతిని కొట్టాల్సి ఉంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లలో గుట్టలని దాటుతూ, మైదానాలలో నడుస్తూ ఈ ఆటని ఆడాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు దాదాపు 6 నుంచి 13 కిలోమీటర్ల వరకూ నడుస్తారనీ, 500కి పైగా కేలొరీలను ఖర్చు చేస్తారని తేలింది. పైగా గోల్ఫ్‌ ఆటని వయసుతో సంబంధం లేకుండా ఏ వయసువారైనా ఆడవచ్చు. తమ ఓపికను బట్టి ఆటలో మార్పులు చేసుకోవచ్చు. ఈ కారణాలన్నింటి వలనా గోల్ఫ్‌ గొప్ప ఆరోగ్యాన్ని అందించే ఆటగా మారిపోయిందని పరిశోధకులు సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఐదుకోట్ల మందికి పైగా ఈ ఆటని ఆడుతున్నారనీ, భవిష్యత్తులో మరింత మంది ఈ ఆట పట్ల ఆసక్తి చూపుతారనీ భావిస్తున్నారు.

- నిర్జర.