మళ్లీ గోదావరి ఉగ్ర రూపం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

వరద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం (ఆగస్టు 9) రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

గత నెలలో భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రాంతాల ప్రజలు మళ్లీ ముంపు భయంతో బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరద ఉధృతమౌతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. 

ఇక మంగళవారం (అగస్టు 9) రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 7.74 లక్షల క్యూసెక్కులకు చేరిందని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు.