గోవాలో ఇక మందు కొట్టలేరు..!

ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు గోవా..సరదాగా ఎంజాయ్ చేయడానికి..రెండు పెగ్‌లు వేసి సరదాగా తిరగాలన్నా డెస్టినేషన్ గోవానే. అందుకే సెలవులొస్తే చాలా మంది చలో గోవా అంటారు. అయితే ఇలాంటి వారికి చేదువార్తను చెప్పారు గోవా సీఎం మనోహర్ పారికర్. అయితే అందుకు కారణం లేకపోలేదు..బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన కొంతమంది యువకులు తరచూ పర్యాటకులపై దాడులకు పాల్పడుతుండటంతో కఠినచర్యలకు సిద్ధమయ్యారు సీఎం.

 

దీనిలో భాగంగా ఎవరైనా రోడ్ల మీద మద్యం తాగితే జరిమానాలు విధిస్తామని, మద్యం షాపుల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని పారికర్ ప్రకటించారు. తాగినవాళ్లు తమ మానాన తాము పోకుండా మహిళా టూరిస్ట్‌లతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటం..బాటిళ్లను పగలకొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే గత ఏడాది నుంచే కొన్ని ప్రదేశాలను నో ఆల్కాహాల్ జోన్‌గా ప్రకటించారు. అయితే సీఎం నిర్ణయంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. గోవా టూరిస్టుల ఫస్ట్ ఛాయిస్ అవ్వడానికి కారణం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, బార్లు, పబ్‌లు, మద్యం దుకాణాలు. వీటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున యాత్రికులు గోవా ట్రిప్‌ ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారీగా ఖజనాకి గండి పడే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి మరోసారి పునరాలోచించుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.