Top Stories

 తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు...బిజెపి అభ్యర్థులు వీరే...

తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ  ఎన్నికలకు సంబంధించి  బిజెపి అభ్యర్థులను ప్రకటించింది.  రెండు ఉపాధ్యాయ  ఒక పట్టభధ్ర ఎన్నికకు సంబంధించి  అభ్యర్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నల్గొండ -వరంగల్ -ఖమ్మం ఉపాద్యాయ  ఎంఎల్ సి స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి , కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్   ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  స్థానానికి  అభ్యర్థిగా   మల్కా కొమరయ్యను ఎంపిక చేశారు.   కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి    సి అంజిరెడ్డిని ఎంపిక చేశారు. 
Publish Date: Jan 10, 2025 4:17PM

అంబటి రాంబాబు పదవి పీకేసిన జగన్.. సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి

అంబటి రాంబాబును వైసీపీ వదిల్చేసుకుంటోందా? ఆయన సొంత నియోజకవర్గం సత్తెన పల్లి ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి అంబటిని తప్పించడం ద్వారా ఆయనకు తన స్థానం ఏమిటో చూపిందా? అంటే వైసీపీ శ్రేణులే ఔనని అంటున్నాయి. అయినదానికీ కాని దానికీ ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో, అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు ఇక  సత్తెన పల్లి నియోజకవర్గ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత విస్పష్టంగా చెప్పేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఉరుములేని పిడుగులా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సత్తెన పల్లి నియోజకవర్గ  సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించినట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని  ఆ ఉత్తర్తులలో పార్టీ  కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ ఉత్తర్వుల ద్వారా అంబటికి ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో పని లేనట్టేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. కంటి తుడుపు చర్యగా ఆయనకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తే ఇవ్వచ్చు కానీ, చెప్పా పెట్టకుండా నియోజకవర్గ సమన్వయకర్త పోస్టు పీకేయడం అంటే అంబటికి అవమానమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ అవమానాన్ని దిగమింగుకుని అంబటి పార్టీ తరఫున విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తన నోటి దూల తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోవచ్చు. ఆయన మాట్లాడకపోయినా పార్టీ పట్టించుకోదు.  
Publish Date: Jan 10, 2025 3:27PM

చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పోక్సో కేసును క్వాష్ చేయాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం (జనవరి 10)  తొసిపుచ్చింది. ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి  సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.  దీనిని కొట్టివేయాలంటూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా  హైకోర్టు ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14)   తనపై దుండగులు దాడి చేశారని తల్లిదండ్రులకు చెప్పింది. స్కూలు నుంచి తిరిగి వస్తుంటే ముసుగు ధరించిన కొంతమంది వ్యక్తులు తనను అడ్డుకుని, మత్తుమందు తాగించారని తెలిపింది. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సదరు బాలిక చదివే స్కూలుకు వెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా బాలికపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై  స్పందించిన పోలీసులు ఆ బాలికకు వైద్య పరీక్షలు జరిపించారు. అయితే, బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.  కాగా హైకోర్టు  చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చడంతో  పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించాలని చెవిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.  
Publish Date: Jan 10, 2025 2:52PM

ఉత్తరాంధ్రలో దిక్కూమెక్కూలేని వైసీపీ

కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిన వైసీపీకి ఇప్పుడు రాజకీయంగా అత్యంత సంక్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కోసం పని చేయడానికి సీనియర్లెవరూ పెద్దగా సుముఖత చూపడం లేదు. కొత్తవారెవరూ కనీసం పార్టీ వైపు దృష్టి పెట్టడం లేదు. ఆ పార్టీ కార్యక్రమాలన్నీ పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోయిన పరిస్థితి ఉంది.  అధికారంలో ఉన్నంత కాలం అంతా మేమే అన్నట్లుగా బోర విరుచుకు తిరిగిన వైసీపీయులెవరూ ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైపీపీకి ఇప్పుడు దిక్కూమొక్కూ లేని పరిస్థితి నెలకొంది. ఇంత కాలం ఆ పార్టీలో సీనియర్ లుగా చెలామణి అయిన నేతలెవరూ కూడా పార్టీ కార్యాలయం వైపు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. పలు నియోజకవర్గాలలో పార్టీకి అసలు కోఆర్డినేటరే లేని పరిస్థితి ఉంది. ఎవరినైనా నియమించాలన్నా దొరకని పరిస్థితి.  ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ జిల్లాల పర్యటన వాయిదా పడటంతో సరిపోయింది కానీ, లేకుంటే ఆ పార్టీ దయనీయ స్థితి మరింతగా ప్రస్ఫుటమై ఉండేది. ఇక ఎలాంటి మార్గదర్శనం, దిశా నిర్దేశం లేకపోవడంతో ఉత్తరాంధ్రలో పార్టీ క్యాడర్ కూడా నిస్తేజంగా మారిపోయింది. ఆ పార్టీ ఇటీవల విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమం అట్లర్ ప్లాప్ కావడానికి కార్యకర్తలెవరూ ముందుకు రాకపోవడమే కారణం. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత ఏడాది జరిగిన ఎన్నికలలో విజయవాడ ఈస్ట్ నుంచి పరాజయం పాలైన తరువాత నుంచీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. నియోజకవర్గ కోఆర్డినేటర్ అయి ఉండి కూడా పార్టీకి ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో కోఆర్డినేటర్ ను నియమించాలని పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు కోరుతున్నారు. కాగా వైసీపీ నాయకురాలు, జీవీఎంసీ మేయర్ గోలాగని హరి వెంకట కుమారి, మరో నేత మొల్లి అప్పారావులు నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవిపై కన్నేసినప్పటికీ, పార్టీ అగ్రనాయకత్వం వారి పట్ల సానుకూలంగా లేని పరిస్థితి ఉంది.  ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ అధినేత జగన్ ఆదేశించినా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తి చూపడం లేదు, తనను పెందుర్తి నియోజకవర్గ సమన్వయ కర్తగా  నియమించాలని కోరుతున్నారు. పెందుర్తి కాకుంటే అనకాపల్లి అయినా ఫరవాలేదని చెబుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. విజయనగరం జిల్లా పరిస్థితి కూడా అలాగే ఉంది.  జడ్పీ చైర్మన్ S చిన్న శ్రీను ఎస్ కోట, లేదా ఎచ్చెర్ల నియోజకవర్గానిక కోఆర్డినేటర్ గా ఉండాలని ఆశపడుతుంటే.. పార్టీ అధిష్ఠానం ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజవకర్గాలకు సమన్వయకర్తలుగా పని చేయడానికి పార్టీ సీనియర్లెవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో అనివార్యంగా ఆ బాధ్యతలను అప్పగించడానికి పార్టీ హైకమాండ్ కొత్త ముఖాలను అన్వేషిస్తున్నది.   
Publish Date: Jan 10, 2025 2:35PM

టీటీడీ ఈవో శ్యామలరావుపై,జేఈవో వెంకయ్య చౌదరిపై బదిలీ వేటు?

తప్పొప్పులకు బాధ్యత ఎవరిది అన్న విషయాన్ని పక్కన పెడితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఎంత కాదనుకున్నా ప్రభుత్వ ప్రతిష్ఠను ఒకింత మసకబార్చింది. కూటమి పార్టీలలో కూడా తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎవరి వాదన వారిదన్నట్లుగా కనిపిస్తోంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు ఒకే రోజు తిరుపతిలో పర్యటించిన తెలుగుదేశం, అధినేత ముఖ్యమంత్రి, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు తమదైన శైలిలో ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునే విషయంలో అధికారుల కంటే ప్రత్యక్ష సాక్షులు, ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సంఘటనకు బాధ్యులు ఫలానా వారని చెప్పకుండానే.. మీడియా సమక్షంలోనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం ఎందుకొచ్చిందని నిలదీశారు. ఎస్పీపై అయితే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పద్ధతి మార్చుకోరా? ఏం తమాషాగా ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  మరో వైపు పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాటకు బేషరతు క్షమాపణలు చెప్పారు. బాధితులను ఆదుకుంటామనీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనీ చెబుతూనే.. టీటీడీలో వీఐపీ యాటిట్యూడ్ మారాలని కుండబద్దలు కొట్టారు. ఈ ఘటనకు ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిల మధ్య సమన్వయ లోపమే కారణమని ఎత్తి చూపారు. అలాగే పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కొందరు పోలీసులు బాధ్యతగా వ్యవహరించినా, కొందరు మాత్రం తొక్కిసలాట సమయంలో ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు.  ఇక పోతే తిరుపతి తొక్కిసలాటకు ఎవరు కాదన్నా, ఔనన్నా బాధ్యత వహించాల్సింది మాత్రం తిరుమల తిరుపతి దేవస్ధానమే.  టీటీడీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సంగతి సీఎం సమీక్షలోనే ప్రస్ఫుటంగా బయటపడింది.  ఆ సమీక్షలో ఏకంగా సీఎం ముందే టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావులు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.  ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈవోపై చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు.  దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ మందలించారు.   టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావుల మధ్య సమన్వయం లేదన్న వార్తలు గత కొంత కాలంగా బలంగా వినిపిస్తున్నాయి. పాలకమండలి సభ్యులే ప్రైవేటు సంభాషణల్లో పలు మార్లు ఈ విషయంపై చర్చించుకున్నారు.  ఆ కారణంగానే వైకుంఠ ద్వార దర్శనం టోకోన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టోకెన్ల జారీ కేంద్రం తలుపులు ఎప్పుడు తెరవాలి, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను ఎలా నియంత్రించాలి అన్న దానిపై ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేయడంతో, ఈ విషయంలో పనుల పరిశీలన, సమీక్షల్లో కూడా ఎవరి దారి వారిదే, ఎవరిగోల వారిదే అన్నట్లుగా సాగడంతో కింది స్థాయి అధికారులలో గందరగోళం ఏర్పడిందంటున్నారు.   తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేయీవో గౌతమిలపై ప్రభుత్వంబదిలీ వేటు పడింది.  టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి  శ్రీధర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించానే కారణంతో ఆయననూ బదిలీ చేశారు. ఇక ప్రాథమిక నివేదికలో తొక్కిసలాటకు కారణం డీఎస్పీ రమణ బాబు అన్న కలెక్టర్ నివేదికతో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరింత మందిపై చర్యలు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ లో సమన్వయం లేకుండా వ్యవహరించిన ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిలపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, భద్రత కంటే తమ సొంత ఇగో శాటిస్ ఫ్యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న భావన టీటీడీ పాలకమండలి సభ్యుల నుంచి బలంగా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిరువురిపై కూడా బదలీ వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. 
Publish Date: Jan 10, 2025 1:15PM

నిన్న అరవింద్ కుమార్... నేడు బిఎల్ ఎన్ రెడ్డి...ఎసిబి విచారణ కంటిన్యూ

ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం గంటగంటకు మారుతుంది. నిన్న దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ ను    ఎసిబి విచారణ చేసింది. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎసిబి విచారించింది. మాజీమంత్రి కెటీఆర్ ఆదేశం మేరకు  విదేశీ సంస్థకు తాను నిధులు మళ్లించినట్టు ఆయన ఒప్పుకున్నారు. మళ్లీ మేమే అధికారంలో వస్తాం. అనుమతులు అవసరం లేదని కెటీఆర్ తనతో అన్నట్టు అరవింద్ కుమార్ వెల్లడించారు. తాజాగా శుక్రవారం ఈ కేసులో ఎ 3 గా ఉన్న చీప్ ఇంజినీర్ బిఎల్ ఎన్ రెడ్డి  ఎసిబి విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ , కెటీఆర్ స్టేట్ మెంట్ ఆధారంగా బిఎల్ ఎన్ రెడ్డి ని విచారిస్తున్నారు. ఎసిబి  అధికారుల ప్రశ్నలకు బిఎల్ ఎన్ రెడ్డి సహకరించడం లేదని తెలుస్తోంది. 
Publish Date: Jan 10, 2025 11:52AM