వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి నోటీసులు 

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్  జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరఫున  న్యాయవాది సిద్దార్ధలూథ్రా వాదనలు వినిపించారు. , ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఒక ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని సునీత న్యాయవాది సిద్దార్ధలూథ్రా పేర్కొన్నారు.  జైలు నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్‌ చైతన్య వెళ్లారని, డా.చైతన్య రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుడు కాదని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసులో డాక్టర్‌ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టుకు సిద్ధార్థలూథ్రా విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్‌ రెడ్డి ఉన్నారు. కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి  అవినాశ్ రెడ్డి అని లూథ్రా వాదించారు. దీంతో  అవినాశ్ రెడ్డిని  ప్రతివాదిగా చేర్చడానికి  ధర్మాసనం అంగీకరించింది.  మార్చి 3వ తేదీకి విచారణ వాయిదా పడింది.  
Publish Date: Nov 19, 2024 6:04PM

 తెలంగాణ  బిజెపీ  సారథిగా ఎన్ రామ్ చందర్ రావు ?

తెలంగాణ బిజెపి  అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ పదవికి ఈటెల రాజేందర్ పేరు వినిపించినప్పటికీ ఆయన మల్కాజ్ గిరి లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో కేంద్రమంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. అయితే ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించలేదు. బండి సంజయ్ కు ఈ పదవి వరించడంతో ఈటెల తీవ్ర నిరాశ చెందారు. ఇదే సమయంలో బిజెపి నూతన సారథి ఈటెల అని ప్రచారం జరిగింది. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాంచందర్ రావు బిజెపీలో సీనియర్ నేత. పార్టీలో ఆయనకు మంచి పేరు ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎంపీగా  రెండు సార్లు బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. ఈటెలకు బదులు డికె అరుణ, రఘునందన్ రావు పేర్లు కూడా వినిపించాయి.  సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రాంచందర్ రావు నల్గొండ జిల్లా వాస్తవ్యుడు. చట్టాలపై మంచి అవగాహన ఉన్న రాంచందర్ రావు పార్టీకి విధేయుడిగా పేరు ఉంది. ఆయన గత లోకసభ ఎన్నికలలో మల్కాజ్ గిరిస్థానం నుంచి పోటీచేయాలనుకున్నారు. ఈటెల పేరు ఖరారు కావడంతో డ్రాప్ అయ్యారు
Publish Date: Nov 19, 2024 4:52PM

కేసీఆర్, హరీష్, కేటీఆర్ ల అరెస్టుకు ముహూర్తం ఫిక్సయ్యిందా?

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్  ఈ నెలాఖరులో  మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21 న మరోసారి హైదరాబాద్ రానుంది. వచ్చే నెల అంటే డిసెంబర్  5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించనుంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ అధికారుల విచారణకే పరిమితమైన కమిషన్ ఇక ముందు రాజకీయ నేతల నిర్వాకం పై దృష్టి సారించి వారినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలపై గురిపెట్టింది. అందులో భాగంగానే అధికారంలో ఉండగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేసింది.  కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకలకు కేసీఆర్, హరీష్ రావులను, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలకు కేటీఆర్ ను బాధ్యులుగా చట్టం ముందుక నిలబెట్టే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది.  కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమీషన్‌ ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్‌ మొదటి వారంలో మాజీ నీటిపారుదల, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు అని తెలుస్తోంది.  అంతే కాకుండా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ గతంలోనే  మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో మదన్ బి లోకూర్ కమిషన్ కు విచారణ అర్హతే లేదంటూ కేసీఆర్ లేఖ రాశారు. ఆ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టుకు  కూడా వెళ్లారు. అయితే సుప్రీం కోర్టు కేసీఆర్ పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పుడు ఇక కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ నోటీసులకు కేసీఆర్ స్పందించి విచారణకు హాజరౌతారా అన్నది తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక   ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం ఖాయమని ముఖ్యమంత్రి, మంత్రులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ అగ్రనేతలు ముగ్గురికీ ఏక కాలంలోనే చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Nov 19, 2024 4:39PM

విశాఖలో న్యాయ విద్యార్థిపై గ్యాంగ్ రేప్ 

విశాఖపట్నంలో న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగింది.  నలుగురు  యువకులు సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు.  విశాఖ పట్నం రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి న్యాయవిద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.  ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి న్యాయవిద్యార్థిని ఆ యువకులు కొన్ని నెలలుగా  బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం. గత రాత్రి కూడా అవే ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది.  రాత్రంతా నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ జరపడంతో ఆ యువతి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఘటనపై  రాష్ట్ర హోం మంత్రి   అనిత  సీరియస్ అయ్యారు. విశాఖ పోలీస్ కమిషనర్ పై అగ్రహం వ్యక్తం చేసారు.  ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని హోం మంత్రి హెచ్చరించారు. న్యాయ విద్యార్థితో సన్నిహితంగా ఉన్న యువకుడే ఈ గ్యాంగ్ రేప్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందరూ మేజర్లేనని అన్నారు. 
Publish Date: Nov 19, 2024 4:09PM

తెలంగాణ దిశ దశ మార్చేందుకు వస్తున్నాను

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వెళ్లారు.  ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరినట్టు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.   ‘‘తెలంగాణ చైతన్యపు రాజధాని... కాళోజీ నుంచి పివి వరకు.. మహానీయులను తీర్చిదిద్దిన నేల.. స్వరాష్ట్ర సిద్దాంతకర్త జయశంకర్ సార్ కు జన్మనిచ్చిన గడ్డ... హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్కక్క సారలమ్మలు నడయాడిన ప్రాంతం.. దోపిడికి  వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ద క్షేత్రం వరంగల్.  వీరందరి స్పూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దిశ దశ మార్చేందుకు నేడు వస్తున్నాను’’ అని రేవంత్ పేర్కొన్నారు. 
Publish Date: Nov 19, 2024 1:59PM