స్నేహమంటే ఇదేరా.. సెల్యూట్ కొట్టాల్సిందే..

ప్రపంచ స్నేహితుల దినోత్సవాన ఓ అపురూపమైన సందర్భం తారసిల్లింది. తమ మిత్రుడి కుటుంబంలో తండ్రి లేని బాధ్యతల లోటును కొంతవరకైనా తీర్చాలని ఓ మిత్రబృందం సంకల్పించింది. అనుకున్నదే తడవు.. అంతా ఒక్కటిగా ఆలోచించి... అక్షరాలా లక్షా ఆరువేల రూపాయలు అప్పటికప్పుడే జమ చేసి తమ మిత్రుడి ఇంటికి వెళ్లి ఆయన భార్యాపిల్లలకు, బట్టలు పెట్టి, ఆ మొత్తాన్ని భార్యకు అప్పజెప్పి.. తామంతా మీ కుటుంబానికి వెన్నంటి ఉన్నామని ధైర్యం చెప్పారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఉంటున్న కోటా దాసు ఓ ఆటో డ్రైవర్. రెండు నెలల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన దాసు.. దాన్నుంచి కోలుకోలేక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చేసేది కూలీ పనిలాంటిదే కాబట్టి అప్పటికే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఇంటి యజమాని కూడా కాలం చేయడంతో దాసు భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. అయితే దాసు స్నేహితులు మాత్రం కుటుంబానికి అండగా ఉండాలని భావించి తమ ఔదార్యం చాటుకున్నారు. బతికి ఉన్నప్పుడు భావాలు పంచుకొని, భారం దించుకున్న స్నేహితులు.. ఆయన లేని సమయంలో మరింత బాధ్యతగా ఉండాలని సంకల్పించుకోవడమే విశేషం. సరిగ్గా ఫ్రెండ్షిప్ డే నాడు కుటుంబ సభ్యులకు  నూతన వస్త్రాలు సహా లక్షా ఆరు వేల రూపాయలు మిత్రుడి భార్యకు అందించారు. వీరంతా 1990-95 లో కలిసి ఎస్సెస్సీ చదువుకున్నారు. 

అందుకే మిత్రుత్వం గురించి ఓ ఆంగ్లకవి ఇలా తన భావాన్ని ఆవిష్కరించాడు. ఇది దానికి స్వేచ్ఛానువాదం

మిత్రమా.. నన్ను పిలువు

ఏదైనా ఒకరోజు నీకు గట్టిగా ఏడవాలనిపిస్తే
మిత్రమా.. నన్ను పిలువు
నిన్ను నవ్విస్తానని చెప్పలేను గానీ
నీకు తోడుగా నేనూ ఏడుస్తా

ఏదైనా ఒకరోజు నీకు ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తే
మిత్రమా.. నన్ను పిలువు
నిన్ను ఆగిపొమ్మని చెప్పలేను గానీ
నీకు తోడుగా నేనూ పరుగెడతా

ఏదైనా ఒకరోజు నీకు ఎవరిమాటా వినకూడదనిపిస్తే
మిత్రమా.. నన్ను పిలువు
నీకు నేను ఏమీ చెప్పను గానీ
నీకోసం మౌనంగా ఉంటాను

కానీ మిత్రమా.. ఎప్పుడైనా నాతో మాట్లాడాలి అనుకుంటే
అప్పుడు నా నుండి జవాబు రాకుంటే
వేగంగా నా దగ్గరికి రా
బహుశా.. నీ అవసరం ఉందేమో..