మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో పెద్దిరెడ్డి పీఏ, అనుచరుడు అరెస్ట్

posted on: Mar 18, 2026 2:55PM

రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఫైల్స్ దహనం కేసులో దర్యాప్తు సంస్థలు కీలక ముందడుగు వేశాయి. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పీఏ మునితుకారం,   ప్రధాన అనుచరుడు వి. మాధవరెడ్డిని సిఐడి పోలీసులు బుధవారం (మార్చి 18) అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ అరెస్టులతో కేసు విచారణ మరో మలుపు తిరిగింది. గత కొంత కాలంగా వీరిరువురూ కూడా పరారీలో ఉన్నారు. కాగా   చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం టోల్ ప్లాజా వద్ద నిందితులు ఉన్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  సిఐడి బృందాలు అక్కడ మెరుపు దాడి నిర్వహించాయి.  కొందరు రాజకీయ నేతలతో కలిసి కాఫీ తాగేందుకు వచ్చిన ఈ ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం తిరుపతిలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.

మదనపల్లెలోని ఆర్డీవో  గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో వేల సంఖ్యలో కీలక భూ దస్త్రాలు కాలిబూడిదైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదనీ, భూ అక్రమాలను కప్పిపుచ్చేందుకు కావాలనే ఫైళ్లను అగ్నిప్రమాదం జరిగినట్లుగా సృష్టించి దగ్ధం చేశారనీ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  

ఈ పెళ్ల దగ్ధం వెనుక రాజకీయ కోణం ఉందన్న కోణంలో విచారణ సాగిస్తున్న అధికారులకు..  పెద్దిరెడ్డి పీఏ మునితుకారం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పాత్రపై పక్కా ఆధారాలు లభించడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అయితే నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్చలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరిరువురి అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అరెస్టులతో మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో అసలు సూత్రధారులు ఎవరనేది బయటపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...