Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేపాల్‌లో యువకుడికి ప్రజలు పట్టం...ఎవరు ఈ బాలేంద్ర షా?
posted on: Mar 9, 2026 4:17PM
.webp)
నేపాల్ రాజకీయాల్లో భారీ మార్పుకు నాంది పలికేలా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ర్యాపర్, కాఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ఘన విజయం సాధించింది. ఏండ్లుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న సంప్రదాయ పార్టీలను వెనక్కి నెట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో ఇప్పటికే 117 స్థానాల్లో ఆర్‌ఎస్‌పీ విజయం సాధించగా, మరో 8 స్థానాల్లో ముందంజలో ఉందని ఎన్నికల సంఘం తెలిపింది.
కాఠ్మాండు వ్యాలీలోని మూడు జిల్లాల్లో ఉన్న మొత్తం 15 నియోజకవర్గాలను ఆర్‌ఎస్‌పీ క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి, బంధుప్రీతిపై విసిగిపోయిన నేపాల్ యువత మార్పు కోసం ఆర్‌ఎస్‌పీకి భారీగా మద్దతు ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన భారీ నిరసనల తర్వాత ఓలీ ప్రభుత్వం కూలిపోవడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో బాలెన్ నేతృత్వంలోని పార్టీకి ప్రజలు పట్టం కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి భారీ షాక్ తగిలింది. జపా-5 నియోజకవర్గంలో బాలేంద్ర షా ఆయనపై సుమారు 50 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బాలెన్‌కు 68,348 ఓట్లు రాగా, ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓలీ పార్టీ సీపీఎన్-యూఎంఎల్ కేవలం 7 స్థానాలకు పరిమితమైంది. మరోవైపు నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఇక నేపాలీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న గగన్ థాపా కూడా ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి అమరేశ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. సీపీఎన్-యూఎంఎల్ ప్రధాన కార్యదర్శి శంకర్ పోఖ్రేల్ సహా పది మంది కీలక నేతలు ఎన్నికల్లో పరాజయం చెందారు. ఈ ఫలితాలతో నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘన విజయంతో బాలెన్ షా నేపాల్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఇదిలా ఉండగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రజలకు మరియు ఆర్‌ఎస్‌పీ పార్టీకి అభినందనలు తెలిపారు. సన్నిహిత మిత్రదేశమైన నేపాల్‌తో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
1990 ఏప్రిల్ 27న కాఠ్మాండు నారాదేవిలో బాలేంద్ర షా జన్మించారు. ఆయనను బాలెన్ షా అని పిలుస్తారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. మాధేశ్ ప్రాంతం నుంచి వారి కుటుంబం కాఠ్మాండూకు వచ్చి స్థిరపడింది. కర్ణాటకలోని ఒక విశ్వవిద్యాలయం నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఎప్పుడూ నలుపు కళ్లజోడుతో కనిపించే బాలెన్ షా ర్యాపర్‌గా కూడా ప్రసిద్ధి చెందారు.
నేపాలీ హిప్-హాప్ సంగీతంలో పేరుపొందిన ఆయన, దేశంలోని రాజకీయ అస్థిరత మరియు అవినీతిని విమర్శిస్తూ పాడిన పాటలు, కవితల ద్వారా యువతలో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో యూత్ ఐకాన్‌గా ఎదిగిన బాలెన్, 2022లో కాఠ్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇప్పుడు అదే ప్రజాదరణతో దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు.



.webp)


