అందరూ మిమ్మల్ని గౌరవించాలంటే ఈ 5 నియమాలు పాటించాల్సిందే..!
posted on Nov 12, 2025 9:30AM
.webp)
ప్రతి వ్యక్తి గౌరవంగా ఉండాలని అనుకంటాడు. తను ఎక్కడ ఉంటే అక్కడ తనకు గౌరవం లభిస్తుంది అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఉన్నట్టే లెక్క. కానీ చాలా మంది వ్యక్తిత్వ పరంగా సరిగా లేకుండా.. నలుగురు గౌరవం ఇవ్వడం లేదని వాపోతుంటారు. అయితే అందరూ గౌరవం ఇవ్వాలంటే ప్రతి వ్యక్తి కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తే అందరూ ఆటోమేటిక్ గా గౌరవం ఇస్తారు. నలుగురిలో ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూ వ్యక్తిని హుందాగా ఉంచే ఆ 5 నియమాలు ఏంటో తెలుసుకుంటే..
పిలుపు..
ఎవరిని అయినా, దేనికైనా పిలవడం లేదా పలకరించడం చాలా కామన్. ఏదేనా పని కోసం కావచ్చు, సహాయం కోసం కావచ్చు. ఎవరిని అయినా సరే.. రెండు కంటే ఎక్కువ సార్లు పిలవకూడదు. పదే పదే ఎక్కువ సార్లు పిలవడం వల్ల వ్యక్తుల దృష్టిలో చిన్నతనంగా మారతాము. దీని వల్ల వ్యక్తిత్వం కూడా పలుచబడుతుంది. సమయం కేటాయించగలిగే వారు లేదా తోడుగా ఉండగలం అనుకునేవారు అయితే ఎక్కువ సార్లు అడిగించుకోకుండానే వచ్చేస్తారు. కానీ రాలేదంటే.. వారు ఏదైనా సమస్యలో ఉండాలి, లేదంటే వారికి వచ్చే ఉద్దేశం లేక రాకపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ దేనికోసం ఎక్కువసార్లు పిలవకూడదు.
సలహాలు, సూచనలు..
కొందరికి అత్యుత్సాహం ఉంటుంది. పక్కన ఉన్నవారు అయినా తెలిసిన వారు అయినా స్నేహితులు అయినా, కుటుంబ సభ్యులు అయినా.. ఇలా ఎవరైనా సరే.. వారు ఏదైనా ఇబ్బంది లేదా సమస్యలో ఉన్నట్టు కనిపిస్తే ఊరికే ఉండలేరు. తమ తెలివి తేటలు ఉపయోగించి ఏదో ఒక సలహా లేదా సూచన ఇస్తూనే ఉంటారు. ఎదుటివారు తాము చెప్పింది యాక్సెప్ట్ చేసేవరకు ఏదో ఒకటి చెప్పడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఎదుటివారి దృష్టిలో గౌరవం ఉండదు. అందుకే ఎదుటివారు తమకు తాము అడిగేవరకు ఎవరికీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు.
వినడం..
ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు వినాలంటే చాలామంది చాలా బోర్ ఫీలవుతారు. అదొక టైం వేస్ట్ పని అన్నట్టు ఫీలయ్యేవారు, ఎదుటివారు చెప్పింది వినడం పెద్ద తలనొప్పి అనుకునేవారు ఎక్కువ. కానీ ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు శ్రద్దగా వెంటే వారు చెప్పే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల వారికి తిరిగి సమాధానం చెప్పాలంటే ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
ప్లానింగ్స్..
ఏదైనా పని చేయడానికి ప్లానింగ్ గా ఉండటం చాలామంది కామన్ గా చేసేపని. అయితే ప్లానింగ్ అనుకోగానే దాన్ని అందరికీ వివరించి చెప్పడం, ఆ పని తర్వాత ఏం జరుగుతుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి.. మొదలైన విషయాలన్నీ చాలామంది పూస గుచ్చినట్టు వివరించి చెప్పేస్తుంటారు. దీనివల్ల అనుకున్న పనులు జరగకపోయినా, అసలు పనులు మొదలు పెట్టలేకపోయినా చాలా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చేయబోయే పనుల గురించి ఎవరికీ చెప్పకూడదు. పనులు పూర్తయ్యే దాక ఎవరికీ చెప్పకూడదు.
సంతోషం..
సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారు కూడా ఉంటారు. అందుకే చాలామంది తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండటం కోసం చాలా సతమతం అవుతుంటారు. ఈ క్రమంలో తమ ప్రాధాన్యతలు కోల్పోవడం, తమ పనులు మానుకోవడం వంటివి కూడా చేస్తారు. కానీ అందరినీ సంతోషంగా ఉంచడం అసాధ్యం అనే విషయాన్ని గ్రహించాలి. అందరినీ సంతోషంగా ఉంచడం ఒక్కరి పనే కాదని, ఎవరి సంతోషాన్ని వారు నిలబెట్టుకోవాలని తెలుసుకోవాలి. ఇలా ఉంటే అందరూ గౌరవిస్తారు.
*రూపశ్రీ.