60 ఏళ్ల తర్వాత ఆత్మకూరులో తొలి ఉప ఎన్నిక

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక జరిగింది. తొలిసారి 1955లో జరిగిన ఉప ఎన్నిక కంటే ఈసారి ఉప ఎన్నిక భిన్నంగా జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో సాధారణం ఎన్నికల్లో కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేస్తే.. ఈ దఫా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. నాటి సాధారణ ఎన్నికల్లో పోలైన ఓట్ల కన్నా ఉప ఎన్నికల్లో 11 వేలకు పైగా ఓట్లు పెరిగితే.. తాజా ఉప ఎన్నికలో 35 వేలకు పైగా తగ్గడం గమనార్హం.

1955లో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో 35 వేల 959 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడేళ్ల తర్వాత అంటే 1958లో బెజవాడ గోపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా వెళ్లారు. దాంతో ఆయన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలా అనివార్యమైన ఉప ఎన్నికలో 46 వేల 976 మంది ఓటు వేశారు. అంటే ఆ ఉప ఎన్నికలో సాధారణం కన్నా 11 వేల 17 మంది అదనంగా ఓటు వేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో లక్షా 72 వేల 288 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో   గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో లక్షా 37 వేల 81 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే.. 2019 కంటే.. ఇప్పుడు 35 వేల 207 ఓట్లు తగ్గాయన్నమాట.

ఆత్మకూరు నియోజకవర్గంలో 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 8 వేల 990 ఉంది. ఈసారి ఉప ఎన్నికల సందర్భంగా ఆ సంఖ్య 2 లక్షల 13 వేల 338కి చేరింది. అంటే 4 వేల 348 మంది ఓట్లరు పెరిగారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఓటు వేసిన 35 వేల 207 మంది ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు రాకుండా ముఖం చాటేశారని స్పష్టమవుతోంది.