అమెరికాలో కూడా గుండెలు గల్లంతే

 

నితిన్ నిత్యా మీనన్ నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా ‘గుండె జారి గల్లంతయిందే’ రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలో సైతం పంపిణీ దారులకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు అమెరికా హక్కులు పొందిన గ్లోబల్ సినిమా మరియు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థవారు సినిమా విడుదలయిన మొదటి రోజునుండే చాలారోజుల వరకు అడ్వాన్స్ బుకింగులు అయిపోయాయని తెలిపారు. 23 కేంద్రాలలో విడుదల అయిన ఈ సినిమాకి వస్తున్న అపూర్వ ఆదరణ చూసిన తరువాత, త్వరలోనే లాస్ ఏంజల్స్ మరియు డెట్రాయిట్ నగరాలలో మరిన్ని ధియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు వారు ప్రకటించారు. సినిమా విడుదల అయిన మొదటి రోజు అంటే శుక్రవారం నాడు 23 ధియేటర్లలో33,337 డాలర్లు కలెక్షన్స్ రాగా, మరునాడు (శనివారం) అది రెట్టింపు అయ్యి మొత్తం 69, 678 డాలర్లు వసూలయ్యాయని వారు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ధియేటర్లలో విడుదల చేయనున్నందున ఇక తమ డాలర్ల పంట పండినట్లేనని పంపిణీ దారులు మురిసిపోతున్నారు. ఇంత మంచి ఆదరణ వస్తుందని తాము కలలో కూడా ఊహించలేదని, అందుకు తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెల్పుకొంటున్నామని వారు అన్నారు. ఈ అవకాశం కల్పించిన సినిమా నిర్మాతలకు, సినిమాను ఇంత చక్కగా మలిచిన దర్శకుడు విజయ్ కుమార్ కు, హీరో హీరోయిన్లకు మరియు నటీ నటులకు వారు పేరుపేరునా కృతజ్ఞతలు తెల్పుకొన్నారు.