“గుండె జారి గల్లంతయిందే” నితిన్ ఫిల్మ్ రివ్యూ

 

ఇష్క్ సినిమా తరువాత మళ్ళీ నితిన్, నిత్య మీనన్ కలిసి నటించిన ‘గుండె జారి గల్లంతయిందే’ సినిమా ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా విడుదల అయ్యింది. బహుశః ఈ సినిమా టాక్ గురించి నితిన్ కొంచెం టెన్షన్ పడే ఉండవచ్చును. ఎందుకంటే, చాలా రోజుల తరువాత అతని ఖాతాలో ఇష్క్ సినిమాతో తొలి హిట్ నమోదయింది. ఆ తరువాత విడుదలవుతున్న ఈ సినిమా హిట్ అవకపోతే నితిన్ పరిస్థితి మళ్ళీ మొదటికి రావచ్చును. కానీ, అదృష్టవశాత్తు ఈ సినిమా ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల దగ్గర నుండి కూడా మంచి మార్కులు సంపాదించుకొంది.

 

రాంగ్ నంబర్కి కనెక్ట్ అవడం అనే చాలా చిన్న పాయింటుతో సినిమా తీయడానికి చాలా దైర్యమే ఉండాలి. కానీ, ఆ పాయింటుని ఆధారం చేసుకొని ఇంత చక్కటి రొమాంటిక్ సినిమా తీయవచ్చునని దర్శకుడు విజయ్ కుమార్ తన తొలి ప్రయత్నంలోనే నిరూపించడం విశేషం.

 

కధ:

ముందే చెప్పుకోన్నట్లు కధ చాలా చిన్న పాయింట్ మీద మొదలవుతుంది. కార్తీక్ (నితిన్) స్వతంత్ర భావాలు గల యువకుడు. తన స్నేహితుడు పండు (ఆలీ) పెళ్ళిలో శ్రుతి (ఇషా తల్వార్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. పండూ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ సంపాదిస్తాడు, కానీ పొరపాటున తప్పు నెంబరు నోట్ చేసుకొని కాల్ చేస్తాడు. కానీ ఆ నెంబరు శ్రావణిది (నిత్య మీనన్). గొప్పింటి బిడ్డయిన ఆమె తన డబ్బును కాక తనను మాత్రమే నిజాయితీగా ప్రేమించేవాడినే, ప్రేమించాలను కొంటుంది. కార్తిక్ మాటతీరు, పద్ధతి చూసి ఆకర్షితురాలయిన శ్రావణి క్రమంగా అతనితో ఫోన్లోనే ప్రేమలో పడుతుంది. ఆమె తను చూసిన శ్రుతే అనుకొంటున్న కార్తిక్ కూడా ఆమె తన ప్రేమ అంగీకరించినందుకు సంతోషపడతాడు.

 

అయితే వారిరువురు కలిసినపుడు ఆమె తన శృతి కాదని తెలిసి కార్తిక్ ఏవిధంగా స్పందిస్తాడు? అతను తనను వేరే అమ్మాయిగా భావించి ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు శ్రావణి ఏవిధంగా స్పందిస్తుంది? అనేది తెర మీద చూడవలసిన విషయం.

 

ఇష్క్ ఇచ్చిన విజయంతో నితిన్ ఈ సినిమాలో పూర్తి ఆత్మవిశ్వాసంతో తనదయిన శైలిలో దూసుకుపోయాడు. ఇక నిత్యా మీనన్ తను తప్ప మరెవరు ఆ పాత్రకి సరిపోరన్నంత బాగా నటించింది. కమర్షియల్ సినిమాలకి విరుద్ధంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరూ పోటాపోటీగా నటించి, సినిమా బాధ్యతను ఇద్దరూ సమానంగా స్వీకరించారు. వారిరువురు మద్య వచ్చే సున్నితమయిన ప్రేమ సన్నివేశాలు, మృదుమదురమయిన సంభాషణలు సినిమా చూస్తున్న యువత గుండెల్లో తీయని గుబులు పుట్టిస్తాయి. ఇక నిత్యామీనన్ కళ్ళతోనే పలికించే భావాలు చూస్తే యువకులు ఫ్లాట్ అయిపోవలసిందే. ప్రేమంటే ఇలాగే ఉండాలని, తమ ప్రేమికుడు, ప్రేమికురాలు ఇలాగే ఉండాలనే భావన యువతలో కలిగించేవిధంగా సాగిపోతుంది వారిరువురి ప్రేమ కధ. ఎంతో సహజంగా సాగి యువతను ఆకట్టుకొంటున్నఈ ప్రేమ కధ, పాసిటివ్ టాక్ రాబట్టుకోవడం కూడా చాలా సహజమే.

 

ఆలీకి సరయిన పాత్ర దొరికితే హాస్యం ఎంత బాగా పండిస్తాడో ఈ సినిమా మరోమారు రుజువు చేసింది. మిగిలిన వారందరూ కూడా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. అయితే, మొట్ట మొదటిసారిగా ఐటెంసాంగుతో వెండితెరపైకొచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలాగుత్తా ‘ఐటెం’ సంగతి దేవుడెరుగు ముందు కనీసం సరిగ్గా కాళ్ళు చేతులు కూడా కదపలేక, కేవలం తన వంపు సొంపుల ప్రదర్శనకు మాత్రమే వచ్చినట్లుంది. గమ్మతేమిటంటే ఆమెకే ప్రత్యేకమయిన ఆ ఐటెంసాంగులో ఆమె తప్ప మిగిలినవారందరూ బాగా చేశారు.

 

ఇక, దర్శకుడు విజయ్ కుమార్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ, (చాలా చిన్నపాయింటుతో) చాలా చక్కగా సినిమా తీసి తన ప్రతిభ నిరూపించుకొన్నాడు. పవన్ కళ్యాన్ ఇమేజ్ తో ఆయన స్వంత సినిమాలలే కాకుండా, ఈవిధంగా వేరే సినిమాలు కూడా చాలా చక్కగా ఆడించుకోవచ్చునని దర్శకుడు విజయ్ మరియు నితిన్ నిరూపించారు. నితిన్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో వారిద్దరు కలిసి అతని ఇమేజ్ ను పూర్తిగా వాడేసుకొని లాభపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలి ప్రేమ’ సినిమాలో ‘ఏమయింది ఈవేళ...’అనే రీమిక్స్ పాటను చాలా అద్భుతం గా చేసారు.

 

ఇక, ఈ సినిమాకి అనుప్ రూబెన్స్అందించిన సంగీతం, ఆండ్రూ చక్కటి కెమెరా పనితనం సినిమాలో ప్రేమానుభూతిని మరింత చక్కగా పండించాయి. హర్ష వర్ధన్ వ్రాసిన డైలాగులు కూడా చాలా బాగున్నాయి, కానీ ఆక్కడక్కడ ద్వందార్ధలతో పంట్లో రాయిలా ఇబ్బందిపెట్టాయి. అయితే, నేడు యువతీయువకులు ఇటువంటి వాటిని కూడా బాగా ఇష్టపడుతుండటంతో అవి కూడా సినిమాకు ఆకర్షణగా మారాయి.

 

ఇక సినిమా ఎడిటింగ్ వీటన్నికి మరింత వన్నెలద్దింది. పెద్ద సినిమాల నడుమ విడుదలయిన ఈ చిన్న సినిమాకి ఇక డోకా లేదని చెప్పవచ్చును. సినిమా మొత్తంగా చూసినట్లయితే, చిన్నచిన్నపొరపాట్లను, లోపాలను పట్టించుకోనవసరం లేదనే చెప్పవచ్చును. మండు వేసవిలో విడుదలయిన ఈ ప్రేమ కధా చిత్రం యువత గుండెలు జారి గల్లంతయ్యే ప్రమాదం నిజంగానే తెచ్చిపెట్టేట్లుంది.