రైతు భరోసా పేరుతో అన్నదాతకు కుచ్చుటోపీ.. బస్తాకు 200 దోపిడీ

అవి రైతు భరోసా కేంద్రాలు కావు రైతు దగా కేంద్రాలు అన్న విమర్శలు తొలి నుంచీ ఉన్నా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ చేయించాలన్న సంచలన వ్యాఖ్యలతో తేనెతుట్టె మరోసారి కాదిలింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కోససీమలో రైతులు దోపిడీకి గురౌతున్నారనే అన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థతి నెలకొందంటూ మరో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల దోపిడీ అన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మాటలు అక్షర సత్యాలని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

దీనిపై సీఐడీ విచారణ కాదనీ, సీబీఐ లేదా జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ అన్నారు. ఈ దోపిడీలో మిల్లర్లు, వైసీపీ నేతలకూ ప్రమేయం ఉందని బాంబు పేల్చారు. ఒక్కో ధాన్యం బస్తాపైనా తక్కువలో తక్కువ రెండు వందల రూపాయల వరకూ రైతు దోపిడీకి గురౌతున్నారన్న ఆరోపణలు విపక్షాల నుంచే కాదు, వైసీపీ వర్గాల నుంచీ వెల్లువెత్తుతున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ రైతుల దోపిడీపై సంచలన ఆరోపణలు చేసి ఆ తరువాత కారణాలేమైతేనేం సైలెంటైపోయారు.  

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి పిల్లి ఆరోపణలు కుంభకోణం అని కాదనీ, జాప్యంపై మాత్రమేనని కవరింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే నిజాల నిప్పు నివురును చీల్చుకుని బయటకు వచ్చేసింది. రైతు భరోసా కేంద్రాల దోపిడీపై విపక్షాల నుంచే కాదు రైతుల నుంచీ విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఒక అడుగు ముందుకు వేసి ఈ దోపిడీ వెనుక, ఈ దగా వెనుక ఎవరున్నారన్నది వెల్లడించేశారు. వైసీపీలో జగన్ ఆజ్ణ లేనిదే  ఏమీ జరగదనీ, ఇది అందరికీ తెలిసిందేననీ, రైతుభరోసా కేంద్రాలలో ఇంతపెద్ద ఎత్తున జరిగే దోపిడీ జగన్ కు తెలియకుండా ఉండే అవకాశమే లేదని రఘురామకృష్ణంరాజు కుండ బద్దలు కొట్టేశారు.  

తనకు వ్యతిరేకంగా రాసే పత్రికల వార్తలన్నీ అబద్ధాలే అని వాటికి ఎల్లో మీడియా అన్న ముద్ర తగిలించిన జగన్ సొంత  పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపణలను ఏమంటారని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లు, అధికారులు, వైసీపీ నేతలు ఎక్కడికక్కడ  కుమ్మక్కై  రైతుల ఆధార్ ను అనుసంధానం చేయకుండా, ఒక వేళ చేసినా అనుసంధాన ప్రక్రియను వారికి తెలియకుండా రైతు భరోసా కేంద్రానికి ధాన్యం చేరకముందే అవినీతికి పాల్పడుతున్నారన్న విషయం రఘురామకృష్ణం రాజు చాలా కాలం నుంచీ ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు ఇదే విషయాన్ని వైసీపీ రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా చెప్పడంతో  వైసీపీ  ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతుంటే ముఖ్య మంత్రికి తెలియకుండా ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పుకోవాలో తెలియక జుట్టు పీక్కుంటోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ ను సైలంట్ చేసేసి, అధికారులూ, మంత్రుల చేత ఖండనలు ఇప్పించినా వైసీపీ రైతు కేంద్రాల దోపిడీపై జనంలో ఏర్పడిన నమ్మకాన్ని పారద్రోలలేకపోయింది. రైతు భరోసా కేంద్రాలలో రైతును నిలువునా దోచేస్తున్నారన్నఆరోపణలను సామాన్య జనం సైతం నమ్ముతున్నారనడానికి సోమిరెడ్డి, రఘురామకృష్ణం రాజుల ట్వీట్లకు వచ్చిన రెస్పాన్సే తార్కానం.