Top Stories

పయ్యావులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా?

అసెంబ్లీలో డ్రాపౌట్.. మండలిలో వాకౌట్.. వైసీపీపై పయ్యావుల సెటైర్లు ఆర్థిక మంత్రి పయ్యావులను  వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా? పయ్యావుల ప్రశ్నలకు.. పయ్యావుల విమర్శలకు మండలిలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సభ్యులు దీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారా? పయ్యావుల సమాధానం ఇస్తున్న సమయంలో సభలో ఉండొద్దని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారా? జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసన మండలిలో పయ్యావుల రిప్లై ఇవ్వడం మొదలుపెట్టగానే.. మాజీ మంత్రి బొత్స నేతృత్వంలో సభ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పయ్యవులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందనేదే  ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిదే అంశం మీద అసెంబ్లీ  లాబీల్లో చర్చ నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలోనూ.. బడ్జెట్టుపై సమాధానం ఇచ్చే ప్రసంగాల్లోనూ గత పాలకులను తూర్పారబట్టారు. సంచలన కామెంట్లే చేశారు. సమాజానికి వైసీపీ హనికరం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలన్నారు. ఇప్పటి వరకు వీటికి ప్రతిపక్షం నుంచి కౌంటరే లేకుండా పోయింది. తమ ప్రత్యర్థి తెలుగుదేశం కానీ.. ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు కానీ తమ మీద.. తమ పార్టీ మీద కామెంట్లు చేస్తే సహించే వారు కారు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా.. ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం  వైపు నుంచి వస్తోన్న కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. కానీ పయ్యావుల చేసిన విమర్శలు, వ్యాఖ్యలకు మాత్రం ఇప్పటికీ వైసీపీ నుంచి సౌండ్ లేదు.   ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మంత్రి పయ్యావులకు గట్టిగా రిప్లై ఇస్తారని అంతా భావించారు.  కానీ జగన్ ఆ ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత తెలిసిన విషయమేమిటంటే.. పయ్యావుల కేశవ్ సభలో చేసిన కామెంట్ల గురించి ఎవ్వరూ ప్రస్తావించ వద్దని.. తనను ఆ ప్రశ్నలు వేయకుండా మీడియా ప్రతినిధులకూ సూచించాలని జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మీడియా విభాగం వారికి ఆదేశాలు జారీ చేశారట. దీంతో ఆ పార్టీ మీడియా విభాగం రిక్వెస్ట్ మేరకు మీడియా ప్రతినిధులు కూడా పయ్యావుల ప్రశ్నలను జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రెస్ మీట్లో ప్రస్తావించ లేదట. ఈ చర్చ రెండు రోజుల నుంచీ జరుగుతూనే ఉంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందోననేది క్లారిటీ రాలేదు. కానీ ఇవాళ శాసన మండలిలో జరిగిన పరిణామంతో ఈ విషయంపై  క్లారిటీ వచ్చేసిందనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది. శాసన మండలిలో ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల బడ్జెట్ పై జరిగిన చర్చకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే పయ్యావులప్రసంగం ఆరంభించడానికి  కొద్దిసేపటి ముందే సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు.  ఇప్పటి వరకు అన్ని అంశాల మీద చర్చలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్సీలు.. సరిగ్గా మంత్రి పయ్యావుల బడ్జెట్ పై చర్చకు సమాధానం ఇస్తుంటే వాకౌట్ చేసి ఎందుకు వెళ్లిపోయారోననే చర్చ జరిగింది. తీరా తెలిసిన విషయమేమిటంటే.. పయ్యావుల సమాధానం ఇచ్చే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎవ్వరూ సభలో ఉండకూడదని తాడేపల్లి ప్యాలెస్ నుంచి   జగన్ మోహన్ రెడ్డి ముందుగానే ఆదేశాలు జారీ చేశారట. పయ్యావుల సమాధానం ఇస్తున్న సమయంలో సభలో ఉంటే.. పయ్యావులకు దీటుగా బదిలివ్వలేక   ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భావనతో సభ నుంచి జంప్ అవ్వాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఆ పార్టీ ఎమ్మెల్సీలే గుసగుసలాడుకుంటున్నారని అశెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. మొత్తానికి సభ్యుల్లేని అసెంబ్లీలో తాను చెప్పాల్సింది చెప్పేశాను.. కనీసం మండలిలోనైనా ప్రతిపక్ష సభ్యులు ఉంటారు కాబట్టి.. వారేమైనా సలహాలో.. సూచనలో చేస్తే.. వాటిని విందామని అనుకుంటే.. శాసన మండలిలో కూడా తనకు ఆ అవకాశం లేకుండా చేశారని మంత్రి పయ్యావుల శాసన మండలి సభ్యులతో అన్నారు. అసెంబ్లీలో డ్రాప్ అవుట్.. కౌన్సిల్లో వాకౌట్ అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ మంత్రి పయ్యావుల చురకలూ అంటింటారు.
పయ్యావులను వైసీపీ ఫేస్ చేయలేకపోతోందా? Publish Date: Mar 7, 2025 3:54PM

360 డిగ్రీస్ లో రాటుతేలుతున్న లోకేష్!

మంత్రి నారా లోకేష్. అన్ని రకాలుగా రాటుతేలుతున్నట్టే కన్పిస్తోంది. నెమ్మదిగా విషయాలను అవగాహన చేసుకోవడంతోపాటు.. సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. రాజకీయంగా దూరదృష్టితో ఆలోచిస్తున్నట్టే కన్పిస్తోంది. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా వ్యవహరించిన లోకేషుకు.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి లోకేషుకు చాలా వ్యత్యాసం, పరిణితి కన్పించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లోకేషులో అంతకు మించిన పరిణితి కన్పిస్తోంది. పార్టీ కార్యకర్తలతో వ్యవహరించే తీరు.. అసెంబ్లీలో ప్రతిపక్షంతో వ్యవహరిస్తోన్న తీరు.. లీడర్లను కంట్రోల్లో పెడుతున్న తీరుతో పాటు.. మిత్రపక్షాలతో ఎలా మెలగాలి అనే అంశం మీద కూడా లోకేష్ చాలా మెచ్యూర్డుగా ఆలోచన చేస్తున్నారు. వివిధ వేదికల మీద.. వివిధ సందర్భాల్లో నారా లోకేష్ వ్యవహరించిన తీరే.. ఆయనలో వచ్చిన పరిణితిని కనబడేలా చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే.. లోకేష్ పరిణితి ఏ స్థాయిలో సాధించాడో అర్థమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తర్వాత టీడీపీ కార్యాలయంలో ప్రజా విజయం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన అభ్యర్థి ఆలపాటి రాజా ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు లేచి నినాదాలు చేస్తున్నారు. దీంతో రాజా సీరియస్ అయ్యారు. కూర్చొ అంటూ సదురు కార్యకర్తను కొంచెం దురుసుగానే మాట్లాడారు. దీంతో సభకు హాజరైన వారికి కానీ.. టీవీల్లో చూస్తున్న వారికి కానీ కొంచెం తేడాగా అనిపించేలా ఉంది. గెలిచిన తర్వాత ఆలపాటి రాజాలో అహంకారం కన్పిస్తోందనే తీరులో ఆలపాటి రాజా హవాభావాలు ఉన్నాయి. దీన్ని వేదిక మీదే కూర్చొన్న లోకేష్ పసిగట్టారు. వెంటనే ఆయన తన సీట్లో నుంచి లేచి రాజా దగ్గరకు వచ్చారు.. కూర్చొమంటే కూర్చుంటామా..? తగ్గేదేలే.. అంటూ వాతావరణాన్ని చల్లబర్చారు.. అంతే కాకుండా.. హెడ్మాస్టరులా చెబితే వింటామా..? అంటూ నవ్వుతూనే ఆలపాటి రాజాకూ చురక వేశారు. ఇక సభలో శాసన మండలిలో ప్రతిపక్షం మీద చాలా ఎగ్రెసివ్ గా వెళ్తున్నారు. ప్రతిపక్ష వైసీపీని సభలో ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచించడమే కాకుండా.. తన తోటి సభ్యులకు స్పూర్తినిచ్చేలా వ్యవహరిస్తున్నారు. బొత్స లాంటి సీనియర్ పొలిటిషీయన్ను వివిధ సందర్భాల్లో కార్నర్ చేస్తున్నారు లోకేష్. అలాగే తన వాళ్ల బాగోగులను చూసుకుంటున్నారు. నిమ్మల రామానాయుడు అనారోగ్యంతోనే సభకు వచ్చేశారు. సభకు రావద్దు.. వెళ్లి రెస్ట్ తీసుకోండంటూ.. లాబీల్లో మంత్రి నిమ్మలకు సూచించడమే కాకుండా.. సభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి.. మంత్రి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. మంత్రి నిమ్మల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారో చూడండనే విషయాన్ని ఇతర మంత్రులకు.. సభ్యులకు అర్థమయ్యేలా చేశారు లోకేష్. ఓ మంత్రి ఆరోగ్యం గురించి ఈ తరహాలో సభలో ప్రస్తావన రావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి అనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరుగుతోంది. ఇంతే కాదు.. మిత్రపక్షాలతో వ్యవహరించాల్సిన తీరు విషయంలో లోకేష్ విపరీతమైన మెచ్యూర్డ్ ప్రదర్శిస్తున్నారు. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేస్తే.. జనసేన నేతలకంటే ముందుగా స్పందించి.. కౌంటర్ ఇచ్చింది లోకేషే. డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిక కూడా చేశారు పవన్. చంద్రబాబుకు.. పవనుకు ఎలాంటి గ్యాప్ లేదు.. కానీ పవనుకు, లోకేషుకు మధ్య గ్యాప్ వస్తుందేమోననే చర్చ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. అలాంటి అనుమానాలు అవసరం లేదనే రీతిలో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే.. అందరికంటే ముందుగా లోకేష్ స్పందించిన తీరు కూటమి వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా వివిధ సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తూ.. చాలా తక్కువ సమయంలో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరును లోకేష్ తెచ్చుకుంటున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
360 డిగ్రీస్ లో రాటుతేలుతున్న లోకేష్! Publish Date: Mar 7, 2025 3:38PM

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగబాబు నామినేషన్

ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు శుక్రవారం (మార్చి 28) నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిణి వనితా రాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో జనసేన  సీనియర్ నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ , ఆ పార్టీ  ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్వయంగా ఈ బాధ్యతను తీసుకొన్నారు.   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌లకు మార్చి 10 చివరి గడువు.   మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ల పరిశీలన, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.     
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగబాబు నామినేషన్ Publish Date: Mar 7, 2025 3:23PM

పోసానికి బెయిలు.. కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ డిస్మిస్

పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజురు చేసింది. కూటమినేతలు  పవన్ కళ్యాణ్  పై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో ఓబులావారి పల్లి పోలీసులు  పోసానిని గత నెలలో  హైద్రాబాద్ లో అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. నరసరావు పేట  పోలీసులు పీటీ వారెంట్ తో పోసానికి అక్కడ అదుపులోనికి తీసుకుని అక్కడ్నుంచి  గుంటూరు జైలుకు తరలించారు.  కర్నూలు జిల్లా ఆదోని పట్టటణంలోని  ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసానిపై  నమోదైన కేసులో పీటీ వారంట్ తో అదుపులోనికి తీసుకుని పోలీసులు గుంటూరు నుంచి కర్నూలు తరలించారు. వీటిలో ఓబులాపురంలో నమోదైన కేసులో కడప కోర్టు పోసానికి బెయిలు మంజూరు చేసింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.   
పోసానికి బెయిలు.. కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ డిస్మిస్ Publish Date: Mar 7, 2025 2:54PM

 తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్ 

తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు  ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  ఉద్యోగులకు డిఎ 2.5 శాతం  రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.   దీనివల్ల సంస్థకు 3.6 కోట్ల భారం అదనంగా పడనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.  ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మహలక్ష్మి పథకం ద్వారా  5వేల కోట్ల ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా పొందారు.  మహిళా సమైక్య సంఘాల చేత  మహిళలు ఆర్టీసి బస్సులు కొనుగోలు చేసి అద్దెకు నడిపే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.  రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క  చేతుల మీదుగా ఈ పథకం క్రింద 150 బస్సులను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.  ప్రతీ మండలానికి ఒక బస్సు నడుపనున్నట్టు అధికారులు తెలిపారు.   పాత ఉమ్మడి  కరీంనగర్, ఖమ్మం, వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాలలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.  
 తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్  Publish Date: Mar 7, 2025 2:47PM

హాలు ఏదైనా టికెట్ రూ.200.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం

కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో  సినిమా ప్రమోషన్స్‌కు కీలక కేటాయింపులు చేశారు. ఆ రంగాన్ని ప్రోత్సహించడం కోసం సినిమా టికెట్‌ ధరలను రూ.200గా నిర్ణయించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని సీఎం తెలిపారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కన్నడ సినిమాలను ప్రమోట్‌ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్‌లో ఒక ఫిల్మ్‌సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని నిర్మాణానికి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
హాలు ఏదైనా టికెట్ రూ.200.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం Publish Date: Mar 7, 2025 2:20PM