ఫ్యామిలీ ఫైటింగ్స్ ఇదిగో పరిష్కారం!! 

గొడవలు అన్ని చోట్లా ఉంటాయి. వృత్తుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, బయట ఎన్నో చోట్ల, ముఖ్యంగా పోటీ ప్రపంచంలో అయితే వాటిన్నింటికంటే భిన్నమైన గొడవలు ఏమిటంటే ఫామిలీ గొడవలు. భార్య, భర్త, పిల్లలు ఇట్లక్ వీళ్ళ మధ్య సాగే గొడవల వల్ల ఆ కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒకరు ఒకటి చెబితే ఇంకొకరు ఇంకొకటి చెబుతారు. తద్వారా భిన్న దృవాల్లా తయారవుతారు. చిన్న చిన్న గొడవలు కూడా చిలికి చిలికి గాలి వానా అయినట్టు అవుతుంటాయి. ఇలాంటి సమస్యలకు అన్నిటికి పరిష్కారం కావాలంటే ఇదే సరైన సమయం మరి. 

విషయం!!

చాలా కుటుంబాల్లో విషయం ఇదీ అనే కారణం లేకుండా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. నిజానికి గొడవ పడకపోతే వాళ్లకు తోచదేమో అనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్లకు. కానీ ఆ అసంతృప్తులు ఎక్కడి నుండి వచ్చాయి అన్నది ఆయా కుటుంబాల్లో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు నువ్వు అది చేసావు, ఇది చేసావు అలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు, అది లేదు, ఇది లేదు ఇలాంటి వాటిని గురించే ఇంట్లో మాట్లాడుతూ ఉంటే అది ఆలోచించాల్సిన విషయమేనని గుర్తుపెట్టుకోండి.ఎందుకంటే ప్రతి కుటుంబంలో మనుషుల సంపాదన, ఖర్చులు, బాధ్యతలు, ప్రాముఖ్యతలు వంటివి అన్ని ఆ కుటుంబంలో వాళ్లకు తెలిసే జరుగుతాయి అలాంటప్పుడు అనవసర వాదనలు ఎందుకు అవసరం. 

పోలికల తంటా!!

శుభలగ్నం సినిమాలో పాట ఉంటుంది. పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు అని. అది మహిళల గోల అయితే అది  మాత్రమే కాకుండా కుటుంబంలో అందరూ తమకు ఇష్టమైన విషయాలను ఇట్లా పోలికలు చూపెడుతూ ఇంట్లో అందరిని పరస్పరం ఎత్తి చూపుకుంటూ ఉండటం వల్ల ఒరిగేది ఏముంటుంది అని ఆలోచిస్తే కలసికట్టుగా ఉండాల్సిన కుటుంబం తమలో తాము శత్రువులను వెతుక్కున్నట్టే అనిపిస్తుంది కదా!!

నాలుగ్గోడలు దాటితే నవ్వులాట!!

నిజమే కదా!! చాలామంది అనుకుంటూ వుంటారు. చేసే పనులు అలాంటివి మళ్లీ బయటకు తెలిస్తే ఏమి. నిజమే చెబుతున్నాం కదా!! నిజమే మాట్లాడుతున్నాం కదా అని. కానీ కుటుంబం మీది అయినప్పుడు మీ కుటుంబాన్ని అందులో లోటు పాట్లను మీరే  నలుగురికి తెలిసేలా చేసి నలుగురికి ఎంటర్టైన్మెంట్ అయ్యి, నలుగురిలో ఫలానా కుటుంబం ఫూల్ అనుకునేలా చేయడం ఒకటే ఫైనల్ ఔట్ ఫుట్ అవుతుంది. కాబట్టి విషయం ఏదైనా మెల్లిగా చర్చించుకుని మెల్లిగానే పరిష్కరించుకుంటే ఎంత బాగుంటుంది. పిండి కొద్ది రొట్టె తృప్తి కొద్దీ జీవితం లేని దాన్ని ఆలోచిస్తే కలిగేది అసంతృప్తి. అందుకే ఉన్నదానీతో తృప్తి పడాలని పెద్దలు చెబుతారు.  ఆశ పడటం తప్పు కాదు కానీ దాని కోసం కష్టపడాలి అంతే కానీ ఇంట్లో వాళ్ళను సాధించడం మంచి పని కాదు. 

ముఖ్యంగా కుటుంబ విషయాలను కుటుంబసభ్యులు మాట్లాడుకుని వాళ్లే అన్నిటినీ చక్కబెట్టుకోవడం మంచిది. బయట వ్యక్తుల ప్రమేయం ఎప్పటికీ మంచిది కాదు. మన కుటుంబం అనే భావన ఎప్పుడూ మనసులో పెట్టుకుని ఉండాలి. కుటుంబం బరువు కాదు బాధ్యత అని అనుకోవాలి. అందరూ ఒకరికోసం ఒకరు అన్నట్టు ఉండాలి. అలా ఉంటే దేవులపల్లి గారు చెప్పినట్టు మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అని అందంగా పాడుకోవచ్చు. పాడుకుంటారు కూడా.


◆ వెంకటేష్ పువ్వాడ