మహా సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం రేపు?

మహా రాజకీయం రసకందాయంలో పడింది. కమల వ్యూహం ఫలించింది.  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రణాళికలు అనుకున్నవి అనుకున్నట్లుగా అమలు చేయగలిగింది. దీంతో మహాలో మళ్లీ కమలం జెండా ఎగరనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది.

ఇందు కోసం తమ మాజీ మిత్ర పక్షం శివసేనను నిట్టనిలువుగా చీల్చడంలో కమలనాథులు విజయం సాధించారు. శాసన సభలో బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇక లాంఛనమేనని పరిశీలకులు చెబుతున్నారు. ఉద్ధవ్ థక్రే రాజీనామా చేసిన వెంటనే బీజేపీ మహా చీఫ్ చంద్రకాంత్పాటిల్, మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యులు భేటీ అయ్యారు.

భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహా అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్నపార్టీ బీజేపీయే. అందుకే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నది. గురువారం (జూన్ 30) ఏక్షణంలోనైనా ఫడ్నవీస్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశంఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉందని అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫడ్నవీస్ శుక్రవారం నాడే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.