క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్‌.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ..

టీడీపీ జోరు మామూలుగా లేదు. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా.. ఇటీవ‌ల టీడీపీలోకి భారీగా వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. వైసీపీ ప్రజావ్య‌తిరేక విధానాల‌తో ప్ర‌జ‌లు, నాయ‌కులు విసిగి వేసారిపోతున్నారు. అన్ని వ‌ర్గాల్లో అసంతృప్తి పెరిగిపోవ‌డంతో ముందుచూపున్న నేత‌లంతా ఇప్ప‌టి నుంచే స‌రైన‌ రాజ‌కీయ వేదిక‌లో చేరిపోతున్నారు. అలాంటి వారంద‌రికీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ టీడీపీనే బెస్ట్ ఆప్ష‌న్‌గా మారుతోంది. నారా లోకేశ్ యువ‌నాయ‌క‌త్వంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం దూకుడు పెంచ‌డం మ‌రింత క‌లిసొస్తోంది. అందుకే, ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేకున్నా.. టీడీపీలోకి వ‌ల‌స‌లు పెర‌గుతుండ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలో కీల‌క నేత‌లు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంది. మాజీ ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భూపేశ్‌రెడ్డి ఈ నెల 20న టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ప‌సుపు కండువా క‌ప్పుకోనున్నారు. జమ్మలమడుగులో బ‌ల‌మైన నాయ‌కుడైన నారాయ‌ణ‌రెడ్డి చేరిక‌తో టీడీపీకి మ‌ళ్లీ పూర్వవైభవం ఖాయ‌మంటున్నారు. ఇక‌, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నారాయ‌ణ‌రెడ్డి త‌న‌యుడు దేవగుడి భూపేశ్‌రెడ్డి పేరును చంద్ర‌బాబు ఖరారు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 

జ‌మ్మ‌లమ‌డుగు నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సుదీర్ఘకాలంగా ఫ్యాక్షన్ రాజ‌కీయం న‌డుస్తోంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా.. దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో ఉంది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు.

రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీని చేసి విప్‌ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా.. రామసుబ్బారెడ్డి వైసీపీలోకి జంప్ అయ్యారు. టీడీపీ నుంచి ప్రధాన వర్గాలు రెండూ బయటకు వెళ్లిపోవడంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో పార్టీ పరిస్థితి సందిగ్థంలో ప‌డింది. ఆ రాజ‌కీయ శూన్య‌త‌ను భ‌ర్తీ చేసేలా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు మారిపోతున్నాయి. 

దేవగుడి వర్గంలో చీలిక వచ్చి.. ప్రధాన నేత అయిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఈ నెల 20న పార్టీలో చేర‌బోతున్నారు. ఇప్ప‌టికే జిల్లా నేతలతో చ‌ర్చించిన చంద్ర‌బాబు.. నారాయ‌ణరెడ్డి కుమారుడు భూపేశ్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగులో బ‌ల‌మైన నేత‌లు టీడీపీలో చేర‌డంతో.. ముఖ్య‌మంత్రి సొంత‌జిల్లాలో జ‌గ‌న్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఝ‌ల‌క్ త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.