Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీఆర్ఎస్.. కిందపడ్డా పైచేయి మాదేనంటే ఎలా?
posted on: Feb 16, 2026 1:09PM

బీఆర్ఎస్ కింద పడ్డా పై ‘చేయి’ మాదేనంటోంది. ‘హస్త’ వాసి బాగాలేదంటోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి మునిసిపోల్స్ ఫలితాలే నిదర్శనమని బల్లగుద్ది మరీ చెబుతోంది. పురపోరులో ఈ స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుని కూడా ఓటింగ్ శాతం చూడండి.. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందనీ, కాంగ్రెస్ కు తగ్గిందనీ చెబుతూ సొంత భుజాలను చరిచేసుకుంటోంది. అయితే.. బీఆర్ఎస్ ఓట్ల శాతం భాష్యంపై జనంలో పెద్దగా స్పందన రావడం లేదు. పైపెచ్చు పార్టీ శ్రేణుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యల పట్ల ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సాధారణంగా ఒక పరాజయం తరువాత ఏ పార్టీ అయినా, లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడుతుంది. అలాంటిది వరుస పెట్టి పరాజయాలు ఎదురౌతున్నా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతర్మథనం వైపు దృష్టి సారించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆదరణ పొందడానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించలేదు.
2023 అసెంబ్లీ ఎన్నికల లగాయతు.. బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూతీసికట్టు అన్నచందంగా కనిపిస్తోంది. 2023లో పార్టీ పరాజయం తరువాత.. ఆ పార్టీ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. శాసన సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకోవడానికో, అనర్హత వేటు భయంతోనో.. కారణమేమైతేనేం.. సాంకేతికంగా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనిన చెబుతున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయంగా లేరన్నది తేటతెల్లమైపోయింది. ఇక కీలకమైన కేకే వంటి నాయకులు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన కేసీఆర్.. పార్ట్ టైం పార్టీ కార్యక్రమాలకే పరిమితమై.. ఫామ్ హౌస్ దాటి అడుగుబయటపెట్టేది లేదని చాటుతున్నారు. ఇక కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించాల్సిన కేటీఆర్ సామాజిక మాధ్యమం వేదికగా అధికారపార్టీపై విమర్శల పేరుతో దూషణలకు పరిమితమౌతున్నారు.
పంచాయతీ పోరులో పరాజయం తరువాత మునిసిపోల్స్ లో జెండా పాతడం ఖాయమని ఘనంనగా ప్రకటించారు కేటీఆర్. అయితే ఫలితాలలో ఎన్నికలు జరిగిన 115 మునిసిపాలిటల్లో బీఆర్ఎస్ గెలుచుకున్నవి కేవలం 16 మునిసిపాలిటీలే. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్క వార్డులో కూడా గెలుపొందని మునిసిపాలిటీలు 13కు పైగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమే. కానీ.. తన అంచనాలలోని సంఖ్యకు కనీసం దరిదాపులకు కూడా రాకుండా మునిసిపల్ పోరు ఫలితాలు ఉన్నా.. ఎక్కడ తేడా కొడుతోందన్న ఆత్మ విమర్శ చేసుకునేందుకు మాత్రం కేసీఆర్, కేటీఆర్ అండ్ కో రెడీగా లేరు. పంచాయతి, పుర పోరు కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం మా విజయం ఖాయం అంటూ కేటీఆర్ చాటడం చూస్తుంటే.. కింద పడిన ప్రతిసారీ పైచేయి మాదేనని చాటేందుకు చేస్తున్న ప్రయత్నంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే తరహాలో కేటీఆర్ గమనం ఉంటే భవిష్యత్ లో మరిన్ని ఘోర పరాభవాలకు బీఆర్ఎస్ సిద్ధపడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.


.webp)
.webp)


