బిడ్డా, గంగుల గుర్తుపెట్టుకో.. ద‌మ్ముంటే రాజీనామా చేయ్‌..

టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల ఎపిసోడ్ కాస్తా.. గంగుల వ‌ర్సెస్ ఈట‌ల‌గా మారింది. ఆ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు.. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల వ‌ర‌కూ మేట‌ర్ ముదిరింది. క‌రీంన‌గ‌ర్‌, హుజురాబాద్ కేంద్రంగా రాజ‌కీయ ర‌చ్చ రాజుకుంది. 

"బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో.. అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్‌ను బొందల గడ్డగా మర్చినావ్. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. నువ్వు ఎన్ని టాక్స్‌లు ఎగ్గొట్టినవో తెలవదు అనుకుంటున్నావా?. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. 2023 తరువాత నువ్వు ఉండవు. నీ అధికారం ఉండదు".. అంటూ మాజీ మంత్రి ఈట‌ల.. గంగుల‌కు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ద‌మ్ముంటే త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లు నిరూపించాల‌ని.. అసైన్డ్ భూములు ప్ర‌భుత్వానికి స్వాధీనం చేయాలని.. ఆత్మ‌గౌర‌వ‌ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ గంగుల సైతం అదే రేంజ్‌లో ఈట‌ల‌కు ప్ర‌తిస‌వాల్ విస‌ర‌డంతో టీఆర్ఎస్‌లో ఈట‌ల ఎపిసోడ్ మ‌రింత‌ కాక రేపుతోంది.  

ఈటల రాజేందర్‌పై భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్ప‌టి నుంచీ ఆయ‌న్ను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వారిలో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అంద‌రిక‌న్నా ముందున్నారు. హుజురాబాద్ టీఆర్ఎస్ కేడ‌ర్‌ను ఈట‌ల నుంచి వేరు చేసే బాధ్య‌త‌ను ఆయ‌నే తీసుకున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తూ.. గులాబీ కేడ‌ర్‌ ఈట‌ల వైపు నిల‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. దీంతో.. రాజేంద‌ర్ రోషం వ‌చ్చింది. గంగుల‌పై ఫుల్ గుస్సా అయ్యారు. ‘చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రావని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరు కొనలేరు. ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తాను’ అంటూ ఈట‌ల గంగుల‌పై మండిప‌డ్డారు. 

ఈట‌ల వార్నింగ్‌కు మంత్రి గంగుల సైతం కౌంట‌ర్ ఇచ్చారు. ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల.. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసినా పదవి పట్టుకుని ఊగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ఆత్మ గౌరవమా? ఆత్మ వంచనా? అని ప్ర‌శ్నించారు. ప్రజలంతా ఈట‌ల‌ వెంటే ఉన్నపుడు రాజీనామా ఎందుకు చేయడం లేదని నిలదీశారు గంగుల‌. తాను క‌రీంన‌గ‌ర్‌ను బొంద‌ల గ‌డ్డ‌గా మారుస్తుంటే.. నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావ‌ని ప్ర‌శ్నించారు. ట్యాక్సులు క‌ట్ట‌కుండా మైనింగ్ వ్యాపారం చేస్తున్నాన‌నే ఆరోప‌ణ‌ను నిరూపించాలంటూ ఈట‌లకు ప్ర‌తిస‌వాల్ విసిరారు గంగుల‌.