ఈటల దెబ్బకు టీఆర్ఎస్ విలవిల! కరీంనగర్ మంత్రి ఆడియో లీక్ రచ్చ.. 

హుజురాబాద్ ఉప ఎన్నికలో అద్బుత విజయం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ ఓటమిని సీఎం కేసీఆర్ ఇంకా మరిచిపోకముందే మరో దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా కేసీఆర్ చెప్పుకునే కరీంనగర్ నుంచే మరో షాక్ ఇచ్చేందుకు ఈటల రాజేందర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈటల ఎత్తులతో గులాబీ పార్టీ ఆగమాగమవుతోందని తెలుస్తోంది. 

రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు ఏకగ్రీవం కాగా... మిగితా ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. ఇందులో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు జరగనున్న ఎన్నిక రసవత్తరంగా మారింది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గులాబీ పార్టీకి హ్యాండిచ్చి... ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ డైరెక్షన్ లో రవీందర్ సింగ్ బరిలో నిలిచారు. హుజురాబాద్ తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు ఈటల వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార పార్టీకే ఎక్కువగా ఉన్నా రవీందర్ సింగ్ గెలుపు కోసం తనదైన శైలిలో  పావులు కదుపుతున్నారు ఈటల రాజేందర్.

రవీందర్ సింగ్ కూడా కాంగ్రెస్ మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి మద్దతు కోరారు. ఈటల కూడా రవీందర్ సింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు రోజుకు రవీందర్ సింగ్ కు బలం పెరుగుతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ తమ సభ్యులను క్యాంపులకు తరలించినా.. ఆ పార్టీలో భయం కనిపిస్తోంది. క్యాంపులో ఉన్న సభ్యులు కూడా లోపాయకారిగా ఈటలతో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలు హడలిపోతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తేడా జరిగితే కేసీఆర్ ఆగ్రహిస్తారనే భయంతో పార్టీ సభ్యులను కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఎంపీటీసీతో ఫోన్ లో మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. 

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు ఫోన్‌ చేసిన మంత్రి కొప్పుల ‘‘ ఏం వెంకటేశ్‌! అందర్ని జమ చేస్తున్నవట! అవతలి వాళ్లిచ్చే రూ. 50 వేలే కావాల్నా? మేమిచ్చేది అవసరం లేదా?’’ అంటూ ప్రశ్నించారు. తాను ఎవరినీ జమ చేయలేదని, తన వద్దకు వస్తే తీసుకోలేదని వెంకటేశ్వర్లు చెప్పగా, ‘‘అందరూ నీ పేరే చెప్తున్నరు. ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడు. వాళ్ల పేరు, వీళ్ల పేరు ఎందుకు చెప్పుతవ్‌? పైసలు కావాలంటే ఇప్పించేది మనమే. ఏం చేయాలన్నా చేసేది మనమే. వేరేటోడికి మంది ఉన్నరా? మనకు 900 మంది ఉన్నరు’’ అని మంత్రి కొప్పుల అన్నారు.

అయితే తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి వద్దకూ వెళ్లలేదని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. దీంతో, ‘‘కొందరు పి.. కుంట్లోళ్లు ఉన్నరు. వాళ్లు పోతే పోనియ్యి. రఘువీర్‌సింగ్‌ అనేటోడు పి.. కుంట్లోడు. ఉంటే ఉంటడు.. పీకితే పీ కుతడు. పుట్ట మధు వాళ్లు ఈటల రాజేందర్‌తో పోతరు. నువ్వు కూడా పోతవా?’’ అని మంత్రి ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదని వెంకటేశ్‌ చెప్పగా.. ఎవరన్నా వస్తే తన వద్దకు తీసుకురావాలని మంత్రి అన్నారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.