2023లో మీ ప‌ని ప‌డ‌తా.. ఈట‌ల వార్నింగ్ వెనుక వ్యూహ‌మేంటి?

ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ఎస్‌. హుజురాబాద్ కేంద్రంగా రాజ‌కీయం ముదురుతోంది. రాజేంద‌ర్‌ను రౌండ‌ప్ చేసేందుకు గులాబీ నేత‌లు ఫుల్‌గా ఫోక‌స్ పెట్టారు. ఈట‌ల వ‌ర్గం అనే ముద్ర ఉన్న ప్ర‌తీ ఒక్క ప్ర‌జాప్ర‌తినిధిని పార్టీ లైన్‌లోకి తీసుకొస్తున్నారు. న‌యానో, భ‌యానో వారంద‌రి చేత‌.. టీఆర్ఎస్‌కు జై కొట్టిస్తున్నారు. కేసీఆరే త‌మ బాస్ అని చెప్పిస్తున్నారు. స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీ, ఎంపీపీల‌ను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్వ‌యంగా డీల్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క‌రినీ త‌న‌కు దూరం చేస్తుండ‌టంపై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డుతున్నారు. త‌న వ‌ర్గాన్ని వేధించే ప‌నులు మానుకోవాలంటూ హెచ్చ‌రించారు. ప‌నిలో ప‌నిగా టీఆర్ఎస్ పార్టీకీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

"అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అలా అనుకుంటే భ్రమల్లో ఉన్నట్లే. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు పనికిరావు. 2023 తర్వాత టీఆర్ఎస్‌కు అధికారం ఉండదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో.. ఆ తర్వాత మేమూ ఆ పని తప్పకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా. మర్యాదగా నడుచుకోండి. ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. దాదాగిరి పద్ధతి, హెచ్చరికలను ఆపుకోకపోతే కరీంనగర్‌ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి ఉంటుంది’’  అంటూ టీఆర్ఎస్‌కు ఖత‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు ఈట‌ల‌.     

అక్క‌డితో ఆగ‌లేదు ఈట‌ల‌. మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్టు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని గులాబీ నేతలకు హెచ్చ‌రిక జారీ చేశారు. తన బొందిలో ప్రాణమున్నంత వరకూ హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానన్నారు. స్థానిక నేతలను బ్లాక్‌ మెయిల్‌ చేసే పద్ధతి మానుకోవాలని.. ఆత్మగౌరవ బావుటా ఎగురవేయడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

‘‘నాపై కక్షపూరితంగా వ్యవహరించొచ్చు.. కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులుగా వస్తున్నవారు ఏనాడైనా ఆపదలో ఆదుకున్నారా? సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీల గెలుపులో తోడ్పాటు అందించారా? స్కూళ్లు ఉన్న వాళ్లతో పాటు కాంట్రాక్ట్‌లు, సర్పంచ్‌లను బిల్లులు రావని బెదిరిస్తున్నారు. గ్రామాలకు రూ.50లక్షలు, రూ.కోటి నిధులు రావాలంటే తమతో ఉండాలని చెబుతున్నారు. స్థానిక నేతలపై ఒత్తిడితో రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని హుజూరాబాద్‌, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత అన్యాయం.. అక్రమమా? ఇదేం రాజకీయమని అసహ్యించుకుంటున్నారు.   

మా ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెళ్లో పెట్టుకున్నారు. తల్లిని బిడ్డను వేరు చేసే ప్రయత్నం చెల్లదు. స్థానిక నేతలను ప్రలోభపెడితే తాత్కాలికంగా మీకు జై కొట్టొచ్చు.. కానీ వారి హృదయాలు ఘోషిస్తున్నాయి. హుజూరాబాద్‌ ప్రజల్ని ఎవరూ కొనలేరు. ఇక్కడి ప్రజలు అనామకులు కాదు అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. 

ఇన్నాళ్లూ కాస్త మౌనంగా క‌నిపించిన ఈట‌ల‌.. ఇలా ఒక్క‌సారిగా టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డ‌టంతో గులాబా పార్టీ రాజ‌కీయం రంజుగా మారింది. ఈట‌ల పార్టీలోనే ఉంటూ ఇలానే చిట‌ప‌ట పేలుతూ ఉంటారా?  ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. మ‌ళ్లీ ప్రజాతీర్పు కోరుతారా?  సొంత పార్టీ పెడ‌తారా?  కాంగ్రెస్ కానీ, బీజేపీలో కానీ చేరుతారా? ఇలా ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. 2023 త‌ర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండ‌దు.. అప్పుడు మీ ప‌ని ప‌డ‌తా.. అంటూ హెచ్చ‌రించ‌డం వెనుక ఈట‌ల రాజ‌కీయ వ్యూహం ఏమై ఉంటుందనే చ‌ర్చ జ‌రుగుతోంది.