కేసీఆర్ వ్యూహానికి ఈటల చెక్? 

తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ తనను అవమానించారన్న రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమయ్యారు. తన సత్తా ఏంటో చూపించాలనే కసితో ఉన్న రాజేందర్... అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ లాంటి ఉద్దండున్ని ఎదుర్కొవాలంటే అంత ఈజీ రాదని తెలుసు కాబట్టే.. రాజేందర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే కారు గుర్తుపై గెలిచిన తనకు ఆ పదవి అవసరం లేదని చెప్పిన ఈటల. ఇంకా రాజీనామా చేయకపోవడం ప్రశ్నగా మారింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చేయరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

టీఆర్ఎస్‌కు దూరమైన మాజీమంత్రి ఈటల రాజేందర్.. ఇప్పుడు కాకపోయినా మరికొన్ని నెలలకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఆయన అనచురులు చెబుతున్నారు. ఉప ఎన్నిక జరిగితే హుజురాబాద్‌ను టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. తన సీటును ఎలాగైనా మళ్లీ తానే గెలుచుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఫిక్స్ అయిన టీఆర్ఎస్.. హుజూరాబాద్‌లో ఆయనను ఓడించేందుకు వ్యూహాలు కూడా రచిస్తోంది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చేజారిపోకుండా చూసుకుంటోంది. కేసీఆర్ కు ఆ అవకాశం ఇవ్వదొన్న ఆలోచనలో రాజేందర్..కేసీఆర్ వ్యూహాలను కౌంటర్ ప్లాన్ వేశారని అంటున్నారు. హుజూరాబాద్‌లో  తాను కచ్చితంగా గెలిచేలా ఈటల వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది.  
 
హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే.. పోటీ తనకు టీఆర్ఎస్ మధ్య అన్నట్టుగా ఉండాలనే రాజేందర్ భావిస్తున్నారట. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీ చేయకుంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందన్నది ఆయన ఆలోచన. అందుకే ఆ రెండు పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా చేయాలని యోచిస్తున్నారు రాజేందర్. ఇందులో భాగంగానే ఆయన విపక్ష నేతలతో సమావేశం అవుతున్నారని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన మల్లు భట్టి విక్రమార్కతో మంగళవారం చర్చించారు రాజేదంర్. బుదవారం ఎంపీ డి.శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు.  

కాంగ్రెస్, బీజేపీలు హుజురాబాద్‌లో పోటీ చేయకుండా తనకు మద్దతు ఇచ్చేలా ఈటల ఇలా  ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకునే ఈటల రాజేందర్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ముందుకొస్తాయా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.  మొత్తానికి ఉప ఎన్నికలు జరిగితే హుజురాబాద్‌ను టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. తన సీటును ఎలాగైనా మళ్లీ తానే గెలుచుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. దీంతో హుజూరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.