జగనన్న దొంగ దెబ్బ.. భగ్గుమంటున్న ఉద్యోగులు..

అనుకున్నదే జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల నెత్తిన నిప్పులు కుమ్మరించింది. పీఆర్సీ విషయంలో నెలల తరబడి దాగుడు మూతలు ఆడుతూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒక్కసారిగా పిడుగులాంటి వార్తతో ఉద్యోగులను షాక్’కు గురిచేసింది. ఓవంక పీఆర్సీ ఖరారు విషయంగా ఉద్యోగ సంఘాలతో  చర్చలు జరుపుతూనే ప్రభుత్వం రాత్రికి రాత్రి, ఉద్యోగులకు విద్యుత్ షాకులు ఇచ్చింది. వేతన సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి అద్దె సహా ఏ ఒక్క విషయంలోనూ ఉద్యోగులకు కాసింత ఊరట ఇచ్చే అంశమేదీ  లేకుండా, ఉద్యోగుల చిరు ఆశలను కూడా చిదిమేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని,  దొంగ దెబ్బ తీసిందని  ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు.

అంతే కాదు, గొర్రె కసాయిని నమ్మినట్లు, ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయారనే మాట కూడా ఉద్యోగ వర్గాల్లో వినవస్తోంది. నిజానికి, పీఆర్సీ ద్వారా ఉద్యోగుల జీతాలు అంతో ఇంతో పెరుగుతాయి, కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం అర్థరాత్రి విడుదల చేసిన కొత్త పీఆర్సీ ఉత్తర్వులను గమనిస్తే,వాస్తవంలో ఉద్యోగులజీతాలు పెరగక పోగా, తగ్గాయని, ఉద్యోగులు లెక్కలు చెపుతున్నారు.  ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన డీఏలు ఇప్పుడు ఇవ్వడం వల్ల కొంతమేర మొత్తం వేతనంలో పెరుగుదల కనిపిస్తుందని, అదే డీఏలన్నీ ముందే ఇస్తే ఈ పీఆర్సీలో జీతాలు తగ్గిన విషయం అందరికీ స్పష్టంగా తెలిసేదని చెబుతున్నారు. 

ఇంటి అద్దె భత్యం విషయంలో అయినా ప్రభుత్వం ఎంతో కొంత సానుకూల నిర్ణయం ఉంటుందని ఆశించిన ఉద్యోగులు అందులోనూ కోత విధించిడంతో ప్రభుత్వం తడి గిద్డతో గొంతు కోసిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. ఇంటి అద్దె భత్యం విషయంలో    ఉద్యోగసంఘాల డిమాండును ప్రభుత్వం పట్టించుకోలేదు.అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పక్కాకు నెట్టేసింది. సీఎస్ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు జారీ చేసి  సీసీఏ రద్దు చేసింది. మధ్యంతర భృతి చెల్లింపుల్లోనూ కోత విధించి...డీఏ బకాయిల్లో సర్దుబాటుకు నిర్ణయం తీసుకున్నారు.అంటే, పీఆర్సీ పుణ్యాన ఉద్యోగులే ప్రభుత్వనికి తిరిగి చెల్లించవలసి వస్తోంది. ఈ మొత్తాన్ని డీఏ బకాయిలోంచి ప్రభుత్వం వసూలు చేసుకుంటోంది. అందుకే ప్రస్తుతం కొత్త పీఆర్సీ అమలు వల్ల తమకు వేతనాలు పెరగకపోగా.. తగ్గిపోతున్నట్లే లెక్క అని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. 

అదలాఉంటే, ఓటు బ్యాంక్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  సంక్షేమ పధకాల అమలు కోసం  ఉద్యోగులను దూరం చేసుకుంటున్నారని, ఇందుకు ఆయన మూల్యం చెల్లించక తప్పదని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అంతేకాకుండా,  ఇప్పటికే ఆందోళనలో ఉన్న ఉద్యోగుల ఆగ్రహం భగ్గుమనే ప్రమాదం లేక పోలేదని హెచ్చరిస్తున్నారు.