మంత్రి పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు

పాలేరు ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ ఈ ఉదయం నుంచీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు మొత్తం 16 బృందాలుగా విడిపోయి 15 చోట్ల ఏకకాలంటో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత, మనీలిండరింగ్ కేసుల విషయంలో ఈ దాడులు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, ఈడీ మాత్రం ఖరారు చేయలేదు.

అయినా పొంగులేటి నివాసాలపై దాడులు జరగడం ఇదే మొదటి సారి కాదు. గత అసెబ్లీ ఎన్నికలకు ముందు అంటే గత ఏడాది నవంబర్ లో  కూడా ఈడీ పొంగులేటి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకుడు, పాలేరు ఎమ్మెల్యే అయిన పొంగులేని గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా దక్కకుండా కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ముందుగానే ప్రకటించారు. ఆయన చెప్పిన  విధంగానే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జీరో అయిపోయింది. ఎన్నికలలో ఒక స్థానం గెలుచుకున్నప్పటికీ ఆ తరువాత బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా కాంగ్రరెస్ గూటికి చేరిపోయారు.  

ఇలా ఉండగా జూబ్లీ హిల్స్ లోని పొంగులేటి నివాసం, హిమాయత్ సాగర్ లోని ఆయనకు చెందిన ఫామ్ హౌస్, అలాగే పొంగులేటికి చెందిన ఇన్ ఫ్రా కార్యాలయాలు, ఆయన బంధువుల నివాసంలో ఏకకాలంలో ఈడీ సోదాలు సాగుతున్నాయి. ప్రస్తుతం పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని ఈడీ అధికారులు దాడులు పూర్తయిన తరువాత వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు