తెలంగాణ బీజేపీకి సీఈసీ షాక్.. సాలుదొర సెలవు దొర ప్రచారానికి బ్రేక్

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు మీద ఉన్న బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రచారంపై అభ్యంతరం తెలిపింది.

కేసీఆర్ ఫొటోలతో ఆయన వ్యతిరేక ప్రచారం చేయడం చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. విశేషమేమిటంటే ఈ ప్రచారంపై టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు.అయితే  కేంద్ర ఎన్నికల సంఘమే అటువంటి ప్రచారం చట్ట వ్యతిరేకమని పేర్కొంది. కేసీఆర్ ఫొటోలతో పోస్టర్లు ముద్రించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం  తెలంగాణ బీజేపీని విస్పష్టంగా ఆదేశించింది.

గత నెలలో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా  టీఆర్ఎస్  మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా బీజేపీ కూడా చాలు దొర.. సెలవు దొర అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇప్పడు అదే నినాదంతో అంటే సాలు దొర.. సెలవు దొర అంటూ ప్రచారం చేసుకోవడానికి ఈసీ అనుమతి కోరింది. అయితే ఈసీ నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, రాతలతో ప్రచారం కూడదని స్పష్టం చేసింది.  దీంతో ఇక బీజేపీ టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతిని హైలైట్ చేస్తూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది.