తూ.గో.జిల్లాలో మహిళలే మహారాణులు
posted on Mar 13, 2014 6:38AM
.jpg)
మహిళా రిజర్వేషన్ల పుణ్యమాని కౌన్సిలర్ల భార్యలకు మంచి రోజులు వచ్చాయి. ఇన్నాళ్లూ ఇంటిపట్టున్న ఉన్న వాళ్లంతా ఇప్పుడు బరిలోకి దిగుతున్నారు. రిజర్వేషన్లవల్ల ఈసారి తూర్పుగోదావరి జిల్లా ‘పుర’పోరులో 700 మంది మహిళలు రంగంలోకి దిగుతారని అంచనా. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 153 మంది మహిళలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ఎన్నిక కానున్నారు. అమలాపురంలో రెండుసార్లు కౌన్సిలర్ గా పనిచేసి, వైస్ చైర్మన్ పదవి కూడా వహించిన వైఎస్సార్ సీపీ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు తానుపోటీ చేయాలనుకున్న 17వ వార్డు మహిళలకు రిజర్వు కావడంతో తన భార్య శ్రీదేవిని పోటీకి నిలిపారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన టీడీపీ నాయకుడు తిక్కిరెడ్డి నేతాజీ గతంలో తాను పనిచేసిన 7వ వార్డులో రిజర్వేషన్ కారణంగా తన భార్య ఆదిలక్ష్మిని పోటీకి నిలబెట్టారు. మరో మాజీ కౌన్సిలర్ జంగాఅబ్బాయి వెంకన్న (టీడీపీ) మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో తన భార్య స్వర్ణ కనకదుర్గను పోటీకి దింపుతున్నారు.
మాజీ కౌన్సిలర్ గంపల నాగలక్ష్మి ఈ దఫా 27వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్ కేశవబోయిన సత్యనారాయణ ఈసారి తన భార్య లక్ష్మిని పోటీకి నిలబెడుతున్నారు. ఇదే మున్సిపాలిటీ నుంచి మాజీ కౌన్సిలర్ బోను లక్ష్మారావు 50 శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చిన అవకాశంతో తన కోడలిని పోటీకి దింపుతున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ తాళాబత్తుల సాయి ఈసారి తన భార్యతో పోటీ చేయిస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్లు తమ భార్యలను బరిలో దించుతున్నారు.