దువ్వాడ శ్రీనివాస్ హీరోగా మూవీ.. రివ్యూ!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించగా, మాధురి.. కాదు కాదు.. ‘మధురాజ్’ నిర్మించిన ‘వాలంటీర్’ మూవీ ఘనంగా విడుదలైంది. ఈ మూవీ ఏ థియేటర్లో విడుదలైందో చెప్పండి.. పనులన్నీ మానుకుని వెళ్దామని అనుకుంటున్నారా? మీరెవరూ థియేటర్లకి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా డైరెక్ట్‌గా మీ దగ్గరకే వస్తుంది. ఆ మూవీ ఇప్పుడు మీ జేబులోనో, చేతిలోనో వుండి వుంటుంది. అదేనండీ.. మీ ఫోన్లో! ఈ ‘వాలంటీర్’ మూవీ యూట్యూబ్‌లో విడుదలైంది. ఏ ఛానల్లో విడుదలైంది అని మాత్రం అడక్కండి.. మీకు నిజంగా దువ్వాడ శ్రీనివాస్ మీద ప్రేమ, అభిమానం, గౌరవం వుంటే, మీరే సెర్చ్ చేసి వెతుక్కోండి. అమృతం ఎక్కడుందో చెప్పడం వరకే మా పనిగానీ, అమృతాన్ని తెచ్చి మీ గొంతులో పోసే పని మాత్రం మాది కాదు. అ అమృతాన్ని తాగేముందు శాంపిల్ రివ్యూ మీ కోసం...

‘వాలంటీర్’ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. వాలంటీర్ పాత్రని ఒక కుర్రాడెవరో ధరించాడు. కానీ ఆ కుర్రాడు హీరో కాదు. అదీ వెరైటీ. ఆ కుర్రాడు, ఆ కుర్రాడి ఫ్యామిలీ నిరంతరం ‘శీనన్నా.. శీనన్నా’ అని కలవరిస్తూ వుంటారు. ఆ శీనన్నే మన కథానాయకుడు, దర్శకుడు దువ్వాడ శ్రీనివాస్. ఈయన తన దర్శకత్వ ప్రతిభతో సినిమా టైటిల్ ఆ కుర్రాడికి ఇచ్చారు. హీరోయిజం మాత్రం తన సొంతం చేసుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, ఉద్యమాలు చేసి, జగనన్న ప్రభుత్వం రావాలని కలలు కని, ఆ కలలు నిజం చేసుకున్న శీనన్న అనే వీరుడి కథ ఈ సినిమా. ఈ సినిమా చివర్లో ‘జగనన్న 30 ఏళ్ళపాటు ఈ రాష్ట్రాన్ని ఏలతాడు’ అని దువ్వాడ శ్రీనివాస్ ఆవేశంగా చెబుతారు. అయితే బ్యాడ్‌లక్ ఏంటంటే, జగన్ అధికారంలో వుండగా ప్రారంభమైన ఈ సినిమా జగన్ అధికారం ఊడిపోయిన తర్వాత రిలీజైంది. ఇప్పుడు ఈ సినిమాలో సదరు డైలాగ్ వచ్చినప్పుడు ఎంత కామెడీగా అనిపించిందో మాటల్లో చెప్పలేం.

ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ తన ఒరిజినల్ కేరెక్టర్ ధరించినట్టే లెక్క. సినిమా షూటింగ్ కూడా తన టెక్కలిలోనే జరిగింది. సినిమాలో శీనన్న పాత్రధారి కుటుంబ విలువల గురించి, భార్య గొప్పతనం గురించి చెబుతుంటే, చూసేవాళ్ళ మనసు పులకరించిపోతుంది. ఈ సినిమాలో శీనయ్య ఒక దానకర్ణుడు. ఎవరైనా వచ్చి కష్టాలు చెప్పుకుంటూ ఇంట్లో వాళ్ళకి కనుసైగ చేస్తాడు. అంతే, ఇంట్లోవాళ్ళు అర్థం చేసుకుని నోట్ల కట్ట తెచ్చి ఇస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న శీనన్న మీద కొంతమంది దాడి చేస్తారు. అతని భార్యని చంపేస్తారు. శీనన్నని కూడా తీవ్రంగా గాయపడతాడు. బోలెడన్ని కత్తిపోట్లు తగిలినప్పటికీ కోలుకుంటాడు. జగనన్నకి సపోర్టుగా నిలుస్తాడు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ ప్రభుత్వాన్ని ఊరి మధ్యలో నిల్చుని వ్యతిరేకిస్తూ వుంటాడు. అప్పుడు శీనన్న ఎంటరవుతాడు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల చిట్టాని చదువుతాడు. దాంతో ఆ ప్రతిపక్ష పార్టీ కార్తకర్త మారుమనసు పొంది, జగనన్నకి జై అంటాడు. దాంతో సినిమా అయిపోతుంది.

కథ, నిర్మాణ విలువలు, దర్శకత్వ ప్రతిభ గురించి అలా వుంచితే, దువ్వాడ శ్రీనివాస్ నటన గురించి మాత్రం చెప్పుకుని ముగిద్దాం. ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్ డైలాగ్ డెలివరీ చూస్తుంటే, పెద్దాయన ఎన్టీఆర్ బతికి వున్నప్పుడే దువ్వాడ శ్రీనివాస్ పుట్టాడు కాబట్టి సరిపోయిందిగానీ, లేకపోతే... చనిపోయిన ఎన్టీఆర్ దువ్వాడ శ్రీనివాస్ రూపంలో మళ్ళీ పుట్టారని మనం ఫిక్సయిపోయేవాళ్ళమే. దువ్వాడ శ్రీనివాస్‌ ఒక్కడి నటనలోనే టాలీవుడ్ హీరోల్లో చాలామంది స్టైల్ చూసి తరించే అవకాశం దక్కుతుంది. డైలాగులు కూడా వెరైటీగా వున్నాయి. ‘‘చెప్పింది అర్థం చేసుకో. అర్థమయ్యాక నీకే అర్థమవుతుంది’’ అనే డైలాగ్ అయితే సూపర్. మేం చెప్పాల్సింది చెప్పాం. ఇక మీ ఇష్టం.