ఎయిర్‌పోర్టుపై డ్రోన్ అటాక్‌.. ఇద్దరు మృతి.. హై అల‌ర్ట్‌..

అది అబుదాబి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ప్రాంతం. అలాంటి చోట స‌డెన్‌గా డ్రోన్ దాడి జరిగింది. అంతే.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌- యూఏఈ రాజధాని అబుదాబి ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. 

డ్రోన్‌ దాడిలో మూడు ఆయిల్‌ ట్యాంకర్లు పేలాయి. భారీ శ‌బ్దంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అటాక్‌లో ముగ్గురు చ‌నిపోయారు. ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉండగా.. ఇంకొక‌రు పాకిస్తాన్‌కు చెందిన వారు. 

అబుదాబి విమానాశ్రయంపై దాడులు తమ పనేనంటూ హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. జరిగిన పేలుడు చిన్నదేనని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న భాగంలో ఈ దాడులు జరిగినట్టు వెల్లడించారు. 

యెమెన్‌లో ఇరాన్‌ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో 2015 నుంచి సౌదీ నేతృత్వంలో యూఏఈ యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా హౌతీ తిరుగుబాటుదారుల సంస్థ లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఆ దాడుల ప‌రంప‌ర‌లో భాగంగానే ఇప్పుడు అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ అటాక్ జ‌రిగింద‌ని అంటున్నారు. జ‌రిగిన దాడిని ప్ర‌పంచ దేశాలు ఖండించాయి.