Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోడీకి ఏమైంది? విపక్షాలకు భయపడుతున్నారా?
posted on: Aug 21, 2024 12:54PM
కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతోంది. గత పదేళ్లుగా భాగస్వామ్య పక్షాలనే కాదు, విపక్షాలను కూడా లెక్క చేయకుండా వ్యవహరించిన మోడీ తీరులో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేంద్రం విపక్షాల డిమాండ్ల పట్ల స్పందిస్తోంది. కీలక అంశాల విషయంలో విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుంటోంది. వారితో మాట్లాడుతోంది. విపక్షాలకు గౌరవం ఇస్తోంది. అవి ఇచ్చిన సలహాలూ సూచనలను వింటోది. చాలా వరకూ పాటిస్తోంది కూడా. విపక్షాల డిమాండ్లను తరచూ వింటున్నారు. అమలు చేస్తున్నారు కూడా. ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన మోడీ సర్కార్ లో కనిపిస్తున్న మార్పు బీజేపీ నేతలనే కాదు, ప్రతిపక్షాలను కూడా విస్మయపరుస్తోంది.
లేటరల్ ఎంట్రీ విషయంలో మోడీ సర్కార్ వెనక్కు తగ్గింది. లేటరల్ ఎంట్రీ పేరుతో… కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ను కేంద్రం ఆదేశాల మేరకు యూపీఎస్సీ వెనక్కు తీసుకుంది. లేటరల్ ఎంట్రీ పేరుతో భర్తీ చేయాలనుకున్న కొలువులు నిపుణులకు సంబంధించినవి కావడం… అలాగే అవి పర్మినెంట్ ఉద్యోగాలు కాకపోవడంతో రిజర్వేషన్లు ఉండకపోవడం వంటి కీలక అంశాల విషయంలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. లేటరల్ ఎంట్రీ పేరుతో ఐఏఎస్ లకు ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకువచ్చేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందనీ, ఐఏఎస్ ల స్థానంలో తీసుకునే ఈ ఉద్యోగుల విషయంలో రిజర్వేషన్లకు అవకాశం లేకపోవడాన్ని తప్పుపట్టాయి.
దీంతో మోదీ వెంటనే లేటరల్ ఎంట్రీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ న ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి లేటరల్ ఎంట్రీ విధానాన్ని గతంలో యూపీఏ సర్కార్ తీసుకు వచ్చింది. అయితే ఇప్పుడు అదే విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. అయినా కూడా మోడీ ఈ విషయంలో వెనక్కు తగ్గడం పట్ల బీజేపీ వర్గాలలో విస్మయం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఇప్పుడు మోడీ రిమోట్ విపక్షాల చేతుల్లోకి వెళ్లిపోయిందా అంటూ సొంత పార్టీ నుంచే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే ఇటీవల వక్ఫ్ బోర్డు బిల్లుపై భిన్నాభిప్రాయాలు వస్తే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. ఇది గతంలో మోడీ వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నం. మోడీ 1.0, మోడీ 2.0లో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ఓపిగ్గా బదులిచ్చారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ప్రధాని మోడీకి తత్వం బోధపడినట్లు ఉందని సామాజిక మాధ్యమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే బలం లేకపోయినా మోడీ విపక్షాల మాటకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారని తాము ఊహించలేదని బీజేపీ నాయకులే అంటున్నారు. భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపేసే అవకాశం ఉందనీ, ప్రభుత్వం పతనమౌతుందన్న భయంతో విపక్షాల డిమాండ్లకు తానా తందానా అన్నట్లుగా వ్యవహరించడం తప్పుడు సంకేతాలను పంపుతోందని బీజేపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అయితే పరిశీలకులు మాత్రం మోడీలో వచ్చిన ఈ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిదేనని విశ్లేషిస్తున్నాయి.



.webp)


