డోలో 650.. ఎందుకింత ఫేమ‌సో తెలుసా..!

దేశ‌మంతా క‌రోనా ఫీవ‌ర్‌. జ‌న‌మంతా డోలో ఫ్యాన్స్‌. జ్వ‌ర‌మొస్తే.. డోలో 650. పొద్దున‌, మ‌ధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. రోజులు నాలుగు ట్యాబ్లెట్లు గ‌డ‌గ‌డా మింగేస్తున్నారు. జ్వ‌రం రాబోతోంద‌ని అనిపిస్తే చాలు.. డోలో వేసేస్తున్నారు. దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లో డోలో షీట్లు స్టాక్ ఉంటున్నాయి. అందుకే.. ఇటీవ‌ల డోలో ట్యాబ్లెట్ల వాడ‌కంపై సోష‌ల్ మీడియాలో తెగ మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. ర‌జ‌నీకాంత్ నోట్లో సిగ‌రేట్ వేసుకునే వీడియోకు.. డోలో 650 ట్యాబ్లెట్‌ను లింక్ చేసిన వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ.. డోలో లో అంత‌లా ఏముంది? ఇది కూడా జ‌స్ట్ పారాసిట‌మాల్ ట్యాబ్లెటే క‌దా? అలాంటి పారాసిట‌మాల్ మందుగోలీలు మార్కెట్లో ఇంకా చాలానే ఉన్నాయిగా? మ‌రి, డోలో మాత్ర‌మే ఎందుకింత ఫేమ‌స్ అయింది? అందులో అంత‌లా ఏముంది? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

‘డోలో 650’ అనేది బ్రాండు పేరు. ట్యాబ్లెట్‌లో ఉండే మందు పారాసెట్మాల్‌. 650 ఎంజీ అనేది డోసు. బెంగుళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌ అనే ఫార్మా కంపెనీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. మార్కెట్లో ఇంకెన్నో బ్రాండ్లు ఉన్నా.. జ్వరం అనగానే పారాసెట్మాల్‌ వాడాలని అనటానికి బదులు, ‘డోలో 650’ వేసుకోవాల‌నే అంటున్నారు. 

ఒక‌ప్పుడు పారాసెట్మాల్‌ 500 ఎంజీ డోసు మాత్రమే అందుబాటులో ఉండేది. 1993లో ‘డోలో’ పేరుతో 650 ఎంజీ డోసు పారాసెట్మాల్‌ ట్యాబ్లెట్‌ను మైక్రో ల్యాబ్స్‌ తీసుకొచ్చింది. దీని విజయానికి ఈ డోసే మెయిన్ రీజ‌న్‌. పారాసెట్మాల్‌ మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు.. జ్వరాన్ని అదుపు చేయటానికి 500 ఎంజీ డోసు సరిపోవటం లేదని, కొంత అధిక డోసు అయితే బెట‌ర్‌ అనే అభిప్రాయం వైద్యుల నుంచి వ‌చ్చింది. అయితే, 650 ఎంజీ డోసులో పారాసెట్మాల్ ఉత్పత్తి చేయటం కొంత కష్టమైనప్పటికీ, సొంత రీసెర్చ్‌తో డోలో 650ని డెవ‌ల‌ప్ చేసింది మైక్రో ల్యాబ్స్‌. అప్ప‌టి నుంచి పాపుల‌ర్ బ్రాండ్‌గా చెలామ‌ని అవుతోంది. ఇక కొవిడ్ ఎంట్రీతో ఆ కంపెనీ త‌ల‌రాతే మారిపోయింది. 

దేశంలో కొవిడ్ కేసులు మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఇప్పటి వరకూ 350 కోట్లకు పైగా డోలో 650 ట్యాబ్లెట్స్‌ అమ్ముడయ్యాయి. ఇక్వియా సంస్థ లెక్క‌ల ప్రకారం.. 2021లో రూ.307 కోట్ల బిజినెస్ జ‌రిగింది. 2021 డిసెంబరు నెలలోనే రూ.30 కోట్ల అమ్మకాలు జ‌రిగాయి. డోలో 650 త‌ర్వాత ‘కాల్‌పాల్’ ట్యాబ్లెట్ రూ.28 కోట్ల బిజినెస్ చేసింది. 

డోలో 650 ట్యాబ్లెట్ త‌యారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ ప్రస్తుతం రూ.2,700 కోట్ల వార్షిక టర్నోవర్‌ నమోదు చేస్తోంది. ఇందులో రూ.900 కోట్లకు పైగా ఎగుమతుల ఆదాయం ఉంటుంది. త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, డోలో 650కి ఇంతటి ప్రజాదరణ వ‌స్తుందని మేం కూడా అంచనా వేయలేదంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు మైక్రో ల్యాబ్స్‌ సీఎండీ దిలీప్‌ సురానా.