రాజకీయాల్లో డీఎల్ మళ్లీ యాక్టివ్.. జగన్ రెడ్డే టార్గెట్టా? 

డీఎల్ రవీంద్రారెడ్డి... కడప జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. మైదుకూరు నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో  ఓ వెలుగు వెలిగారు. కడప జిల్లాకు చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. వైఎస్సార్ తో విభేదాలున్నా కడప జిల్లాలో తనదైన పట్టు సాధించారు.  వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ను ఎదుర్కోవడంలో డీఎల్ నుంచి ముందుంచి అప్పటి కాంగ్రెస్ హైకమాండ్. 

రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న డీఎల్.. రాష్ట్ర విభజన తర్వాత యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. జిల్లా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే సడెన్ గా యాక్టివ్ అయ్యారు డీఎల్ రవీంద్రారెడ్డి. తాను 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో చెబుతానన్నారు. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరుతారా లేక టీడీపీ నుంచి పోటీ చేస్తారా.. లేక ఆదినారాయణ రెడ్డి లాగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జై కొడతారా... జనసేనతో కలిసి పోతారా అన్నది చర్చగా మారింది. 

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో DL Ravindra reddy వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఆయన వైఎస్ జగన్ ను కూడ కలిశారు.ఆ ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో ఆయన ycpకి కూడా దూరంగా ఉంటున్నారు. తాజా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన డీఎల్.. ఏపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు.  రైతును పట్టించుకునే వారే లేరన్నారు. తన సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు.పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా  పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎల్ వ్యాఖ్యలను బట్టి ఆయన వైసీపీలో చేరడం కుదరదని తెలుస్తోంది. ఏపీలో దురదృష్ణకరమైన పాలన సాగుతుందని చెప్పారంటే.. ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు డీఎల్ రవీంద్రారెడ్డి. మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి రవీంద్రా రెడ్డి ఆసక్తిని చూపారు. కానీ ఈ స్థానంలో సుధాకర్ యాదవ్ ను టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపింది.  కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేసే విషయమై టీడీపీ తేల్చలేదు.ఈ స్థానం నుండి పోటీకి ఆయన దూరంగా ఉన్నారు.తాజాగా ఆయన మళ్లీ యాక్టివ్ కావడం, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో టీడీపీ వైపు మొగ్గు చూపవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.