వైఎస్ అభీష్ఠం మేరకే ఆస్తుల పంపిణీ.. ఎన్సీఎల్టీకి విజయమ్మ వివరణ

posted on: Mar 18, 2026 3:35PM

వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల పంపిణీ వివాదం మరింతగా ముదిరింది.  తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ తల్లి విజయమ్మ తాజాగా ఎన్సీఎల్టీకి  లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించారు.  

తాను షర్మిలకు బినామీగా వ్యవహరిస్తున్నానన్న ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని ఆమె విస్పష్టంగా ఆ సమాధానంలో పేర్కొన్నారు.  గతంలో గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు బదిలీ అయిన షేర్లను షర్మిలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారని జగన్, భారతి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని విజయమ్మ కుండబద్దలు కొట్టారు.   కుటుంబ సభ్యురాలిగా, తల్లిగా తనకు ఎవరిపైనా ప్రత్యేక  అభిమానం, ఆపేక్ష  లేదని పేర్కొన్న విజయమ్మ.. తన భర్త, దివంగత నేత   వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు, కుటుంబ ఆస్తులను ధర్మబద్ధంగా పంచడమే తన ఉద్దేశమన్నారు. 

కుటుంబ వ్యవహారాలను, ముఖ్యంగా గిఫ్ట్ డీడ్లను కంపెనీ వ్యవహారాలతో ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. గతంలో జగన్ స్వయంగా అంగీకరించి ఇచ్చిన షేర్ల విషయంలో ఇప్పుడు మాట మార్చడం తగదన్నారు. ఎన్సీఎల్టీకి సమర్పించిన ఈ  సమాధానం ద్వారా తాను కుటుంబ ఆస్తుల వ్యవహారంలో సాగుతున్న న్యాయపోరాటంలో పూర్తిగా షర్మిల వైపే ఉన్నానని విస్పష్టంగా తెలిపోయినట్లైంది.  

సొంత కుమారుడే తల్లిని, సోదరిని కోర్టుకు ఈడ్చడంపై ఇప్పటికే సర్వత్రా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయమ్మ ఈ విషయంలో తన స్టాండ్ ఏమిటన్నది విస్పష్టంగా తేల్చేయడంతో  జగన్  తల్లి, చెల్లికి అన్యాయం చేశారన్న చర్చ ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. రానున్న రోజులలో వైవఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగన్ వేసిన పిటిషన్‌పై విజయమ్మ ఇచ్చిన వివరణ తర్వాత కోర్టు  తీర్పు ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదలా ఉంటే విజయమ్మ వివరణతో జగన్ కు రాజకీయంగా ఇబ్బంది కలగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...