వైసీపేలో .. స్వరాలు మారుతున్నాయి.. అసమ్మతి రగులుతోంది!

ఇంతవకు ఒక లెక్క .. ఇక పై ఇంకో లెక్క.. ఇదేదో విన్న డైలాగులా ఉంది కదూ.. నిజమే  ఈ మధ్య  కాలంలో రాజకీయ వర్గాల్లో, రాజకీయ చర్చల్లో, ముఖ్యంగా ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ డైలాగు బాగా వినిపిస్తోంది. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి పోతున్న నేపధ్యంలో పార్టీ నాయకుల స్వరాలు మారుతున్నాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిందే వేదంగా తల ఉపుతూ వచ్చిన ఎమ్మెల్యేలు, నాయకులు, ఇంతవకు ఒక లెక్క .. ఇక పై ఇంకో లెక్క.. అంటూ జగన్ రెడ్డికి. క్షేత్ర స్థాయి పరిస్థితిని చెప్పేందుకు సిద్డమవుతున్నారు. అంతే కాదు, వింటే విన్నట్లు లేదంటే తమ దారి తాము చూసు కునేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. 

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మంత్రులు, పార్టీ సమన్వయ కర్తలు ఇతర ముఖ్య నాయకులతో వర్క్ షాప్  నిర్వహించారు. అ సందర్భంగా ఒకరిద్దరు మాజీ మంత్రులు, ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వం పనితీరు విషయంగా, పథకాల అమలుకు సంబంధించి ఒకటో రెండో ఫిర్యాదులు చేశారు. నిజానికి, అవి  ఫిర్యాదులు అనేందుకు కూడా వీలు లేదు, ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు... అయితే అదేమిటో కానీ, ముఖ్యమంత్రి , వారి మీద కస్సున లేచారు.  
మాజీమంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రావు అమ్మఒడి ప‌థ‌కం అమ‌లు విష‌యంలో అసంతృప్తిని వ్య‌క్తం చేశారు ప్ర‌కాశం జిల్లా ల‌బ్దిదారుల్లో అంత‌కుముందు వున్న‌వారిని కూడా తొలిగించడం ఏమిటని ప్రశ్నించారు.

అసలే ఇవ్వక పొతే అదో పద్దతి, కానీ, ఒక సారి  ఇచ్చి  రెండవ సారికి లేదంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. అలాగే, కందుకూరు ఎమ్మెల్యే మ‌హీధ‌ర్ రెడ్డి గ్రామాల్లో విద్యుత్ స‌మస్యతో పాటు ఇసుక స‌మ‌స్య గురించి ప్రస్తావించారు. ఇలా సమస్యలు ఏకరువు పెట్టడం ముఖ్యమంత్రికి నచ్చలేదు.అలాగే వదిలేస్తే, ఒక్కొక్క  ఎమ్మెల్యే కొండవీటి చాంతాడంత చిట్టా విప్పుతారని భయపడ్డారో ఏమో కానే ఆగ్రహంగా ఆ డిస్కషన్ అక్కడితో కట్ చేశారు. 

డిస్కషన్ అయితే కట్ చేశారు కానీ, పార్టీ నాయకుల్లో అంటుకున్న అసమ్మతిని అయితే చల్లార్చలేక పోయారు. ఒకరి తర్వాత ఒకరు అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. అందుకే ప్రతి జిల్లాలోనూ సొంత పార్టీ నాయకుల మధ్యనే, వివాదాలు రాసుకుంటున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరిపై ఒకరు విమర్శలు దాటి, వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా, ఒక మహిళ ఆయనపై చేసిన ఆరోపణల నేపధ్యంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న మాజే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సొంత పార్టీ నేతలే తనపై కక్షకట్టి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక అ మహిళ ఆధారాలతో మాజీ  మంత్రి పై  సంచలన విమర్శలు చేసినప్పుడు, విపక్షాలు ఆయన్ని కార్నర్ చేయడం సహజం. అయితే, అలాంటి సమయంలో తనకు అండగా ఉండవలసిన సొంత పార్టీ నాయకులు ప్రతిపక్షాల కంటే ఎక్కువగా తనను టార్గెట్ చేస్తున్నాయని, బాలినేని వాపోతున్నారు.

సొంత పార్టీ వారే కుట్ర పన్నుతున్నారనే, వరకు వెళ్లారు.  మరో వంక, బాలినేని గొంతుకు మరో గొంతు తోడైంది, బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు. జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.  అదలా ఉంటే, బయటకు వస్తున్న అసమ్మతి స్వరాలల కంటే, బయట పడకుండా కుతకుత ఉడుకుతున్న అసమ్మతి నేతలు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటారని, పార్టీ నాయకులే అంటున్నారు. వైసీపీలో  అసమ్మతి కట్టలు తెంచుకునే రోజు ఇంకేతో దూరంలో లేదని, ముఖ్యంగా, మాజీ మంత్రులు, మంత్రి పదవులు ఆశించి భంగ పడిన సేనియర్లు అసమ్మతితో రగిలి పోతున్నారని అంటున్నారు.

అదే విధంగా,  నియోజక వర్గాలో ఎమ్మెల్యేలుగా తమకు గుర్తింపు, గౌరవం ఉండడం లేదని, అన్నీ ముఖ్యమంత్రి పేరునే జరగడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా నేరుగా, ముఖ్యమంత్రి మీట నొక్కి విడుదల చేయడంతో ప్రజలు అసలు ఎమ్మెల్యేలను గుర్తించడం లేదని, ఇక స్థానిక నాయకులను అయితే, దేఖే వాడే లేదని అంటున్నారు. మరో వంక  గుంతల రోడ్లు, విద్యుత్ కోతలు, ఇతర సమస్యల విషయంలో ప్రజలు తమను తప్పు పడుతున్నారని, ఎమ్మెల్యేలు  వాపోతున్నారు. ముఖ్యమంత్రి ముందు సమస్యలు ప్రస్తావించినా, ఆయన, ప్రజలు, నాకు మంచి మార్కులే  వేస్తున్నారు. మీకే మార్కులు పడడం లేదు అంటూ తప్పు తమపైకి  నేట్టేస్తున్నారని అంటున్నారు. అలాగే, అన్ని నియోజక వర్గాల్లో ఆయనే పోటీ చేస్తారా? అటూ ప్రశ్నిస్తున్నారు. అద్దాల మేడలో  కుర్చుని అంతా బాగుంది అనుకుంటే, చివరకు, అంతా బ్రాంతియేనా... అని కోరస్ గా  పాడుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.