వెంకయ్యను డబుల్ ఇంజిన్ బుల్ డోజ్ చేసిందా?

ఎంతటి గొప్పవారినైనా అట్టడుగుకు నెట్టేయడం, ఎంతటి అనామకులైనా అమాంతం అందలం ఎక్కించడంలో డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయానిది అందెవేసిన చేయి. దేశంలో బీజేపీని బతికి బట్టకట్టించేందుకు కాలికి బలపం కట్టుకుని మరీ రథయాత్ర చేసిన ఆ పార్టీ ఒకప్పటి అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీని, ఆ పార్టీ కోసమే తమ సర్వ శక్తియుక్తులను ధార పోసిన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, దివంగత సుష్మా స్వరాజ్ లాంటి వారికి ఈ డబుల్ ఇంజిన్ ఏమాత్రం ప్రాధాన్యం కల్పించలేదనేది జగమెరిగిన సత్యం. వీరి కోవలోకే తాజాగా పదహారణాల మన తెలుగుబిడ్డ,  తాజా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వస్తారు.

 ఇంత కాలం అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం ప్రకారం అయితే.. వెంకయ్య నాయుడిని దేశ ప్రథమ పౌరుడిని చేయాల్సి వస్తుంది. లేదంటే జాకీర్ హుస్సేన్ కు అవకాశం ఇచ్చినట్లు రెండోసారైనా వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగించి ఉండాల్సిందనే అభిప్రాయం ప్రతి తెలుగువాడిలోనూ ఉంది. విద్యార్థి దశ నుంచీ ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని, ఆనక బీజేపీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన వెంకయ్య నాయుడికి బలవంతపు విశ్రాంతి ఇవ్వడంతో మోడీ- షా ద్వయం రాజనీతి  ఔచిత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు పోషించిన పాత్ర మరిచిపోలేనిది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడికి వాజ్ పేయి కేబినెట్ లో సమాచార ప్రసారశాఖ, రవాణా శాఖ లాంటివి ఇస్తానంటే అవి వద్దని, తనకు వ్యవసాయశాఖ కావాలని అడగగలిగిన మనిషి వెంకయ్య నాయుడు. మోడీ హయాంలో పట్టణాభివృద్ధిశాఖ అప్పగించినప్పుడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తనకు పట్టణాభివృద్ధి గురించి ఏం తెలుసునని అనగలిగిన వ్యక్తిత్వం వెంకయ్య నాయుడు. అయినప్పటికీ ఆయనకు పట్టణాభివృద్ధి శాఖనే మోడీ కేటాయించడం ప్రధాని మోడీ వ్యక్తిత్వం. అలా తనకు ఇష్టమైన శాఖ కాకుండా వేరే శాఖ ఇచ్చినప్పటికీ అత్యంత చాకచక్యంతో దాన్ని నిర్వహించి మెప్పించిన వ్యక్తి మన వెంకయ్య నాయుడు.

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత వెంకయ్య నాయుడు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు.. ఆయనలో ఏ మూలనో దాగి ఉన్న అసంతృప్తిని వెల్లడించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడు ఆ అసంతృప్తిని ఇసుమంతైనా బైట పడనివ్వని తీరు ఆయన హుందాతనానికి నిదర్శనం.  కనుక అసంతృప్తిని ఏ మాత్రం బహిర్గతం కానివ్వని తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఆకట్టుకుంటోంది. ప్రధాని, లేదా రాష్ట్రపతి పదవికి పూర్తి అర్హతలున్న ఎల్కే అద్వానీ కూడా ఇలాగే పెద్దమనిషిలా వ్యవహరించారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంకయ్య నాయుడు తనదైన శైలిలో చాకచక్యంగా పరిష్కరిస్తారనే పేరు ఉంది. అలాంటి వెంకయ్య నాయుడు మీడియా చిట్ చాట్ లో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడుదేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.

మళ్లీ తాను రాజకీయాల్లోకి రానని విస్పష్టంగా చెప్పిన వెంకయ్య, క్రియాశీలకంగా ఉండడం మాత్రం మానుకోనని  స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటానన్నారు. తన దృష్టికి వచ్చే అంశాలను ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగానే వెంకయ్య నాయుడు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ‘పుస్తకం రాస్తే.. వాస్తవాలు రాయాలి.. బతికున్నవారి గురించి యథార్థాలు రాస్తే.. అనర్థాలు వస్తాయి’ అని ఆయన చమత్కారంగా అన్నా ఆ మాటల వెనుక నర్మగర్భంగా, నిగూఢంగా ఒకరిపై వేసిన చురకలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ గా చివరిరోజు వెంకయ్య నాయుడి కళ్లు చెమ్మగిల్లడం దేశం యావత్తు గమనించింది. కొన్ని సందర్భాల్లో ఆయన కర్ఛీఫ్ తో కళ్లు తుడుచుకున్న దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారం అయ్యాయి.

మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయాననే బాధ ఏ మాత్రం లేదని చెప్పడం గమనార్హం. తాను ఏదీ కోరుకోకపోయినా.. దేవుడి దయ, పెద్దల అభిమానం వల్ల అన్నీ లభించాయని చెప్పడంలో వెంకయ్య నాయుడిలోని పెద్దమనిషి తత్వం స్పష్టం అవుతోందంటున్నారు. అపూర్వ శక్తి గలిగి, రోజుకు 14 గంటలు పనిచేసే మోడీకి కూడా ‘అప్పడప్పుడూ నవ్వుతూ ఉండాల’ని, ‘అవసరమైనంత నిద్రపోవాల’ని సూచించగల చనువున్న వ్యక్తి వెంకయ్యనాయుడు. అలాంటి వెంకయ్యనాయుడిని మోడీ- షా ద్వయం ఎందుకు ఇలా దారుణంగా పక్కన పెట్టేసిందని మిలియన్ డాలర్ల ప్రశ్నగా వస్తోంది.