Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అభివృద్ధి, తాయిలాలు అన్నీ పట్టణాలకు, ఉన్నవారికే పరిమితమా??
posted on: Jul 22, 2014 12:08PM
.jpg)
ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వాలు కేవలం ధర్మకర్తలలాగ వ్యవహరించాలి తప్ప వాటికి హక్కుదారులుగా వ్యవహరించరాదని మహాత్మ గాంధీజీ ఎన్నడో చెప్పారు. కానీ ఆయన చెప్పిన ఆ మంచి మాటలను చెవికెక్కించుకొన్న ప్రభుత్వం ఒక్కటీ లేదు. కోట్లాది ప్రజలు అర్ధాకలితో మాడుతుంటే వారి ఆకలి తీర్చే మార్గం ఆలోచించకుండా, పాలకులు తమకు నచ్చిన వ్యక్తులకు, ప్రాజెక్టులకు కోట్లు ధారపోస్తుంటారు. గ్రామాలలో, పట్టణాలలో వేలాదిమంది పసిపిల్లలు, యువకులు, వృద్ధులు, మహిళలు వైద్యం చేయించుకొనే ఆర్ధిక స్తోమతలేక అత్యంత దయనీయ పరిస్థితుల్లో చావుకోసం రోజులు లెక్కబెడుతూ ఎదురు చూస్తుంటే, మానవతా దృక్పధంతో అటువంటి వారిని ఆదుకోవలసిన ప్రభుత్వాలు, ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నులను కోటీశ్వరులయిన పారిశ్రామిక వేత్తలకు, క్రీడాకారులకు, కళాకారులకు ఉదారంగా దానం చేస్తుంటాయి.
మనకి స్వాతంత్ర్యం వచ్చి 67 సం.లు తరువాత కూడా నేటికీ అనేక గ్రామాలు ఆకలి, దరిద్రం, అనారోగ్యం, పారిశుధ్యలోపం, స్కూళ్ళు, ప్రాధమిక వైద్య సౌకర్యాలలేమి, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా కరువు కాటకాలు వంటి అనేక సమస్యలతో విలవిలలాడుతున్నాయి. వీటన్నిటినీ అత్యవసరంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ఇతర వ్యాపకాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నాయి. అందుకే నేటికీ మన గ్రామీణ భారతం ఈ దుస్థితిలో ఉండిపోయింది. ఏ ప్రభుత్వాలయినా పరిశ్రమలను, క్రీడలను, కళలు ఇత్యాదులను తప్పక ప్రోత్సహించవలసిందే. కానీ, ఈసమస్యలన్నిటినీ విస్మరించి వాటికే ప్రాధాన్యం ఇస్తూ అపాత్రాదానం చేయడం సబబు కాదు.
దేశ, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలయినా చేప్పట్టవచ్చును. ఎంతయినా ఖర్చు చేయవచ్చును. కానీ తద్వారా దేశ ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు కడుపు మాడ్చుకొని రేయింబవళ్ళు మారుమూల గ్రామాలలో శ్రమిస్తున్న అన్నదాతలు కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితులు కలగాలి. పల్లెల్లో, పట్టణాలలో బ్రతుకు భారంగా జీవిస్తున్న నిరుపేదలు, అభాగ్యుల జీవన ప్రమాణాలు పెరగాలి. కానీ అలాకాక ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అనే పద్ధతి మంచిది కాదు.
కోట్లకు పడగలెత్తిన ఒక క్రీడాకారుడికో, క్రీడాకారిణికో ఒక కప్పు గెలుచుకు రావడానికి కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం కంటే, ఆ సొమ్మును గ్రామాలలో ఈ సమస్యలను పరిష్కరించడానికీ, మట్టిలో మాణిక్యాల వంటి క్రీడాకారులను, ప్రతిభావంతులయిన విద్యార్ధులను వెలికి తీసేందుకు వినియోగిస్తే అందరూ హర్షిస్తారు. ఒక విద్యార్ధి లేదా క్రీడాకారుడు లేదా రైతు ఎవరయినా అష్టకష్టాలుపడి, అందరి కాళ్ళు పట్టుకొని పట్టుదలతో విజయం సాధించిన తరువాత ప్రభుత్వాలు వారిని సన్మానించడం, బహుమతులు ప్రకటించడం కంటే, వారు ఒంటరిపోరాటం చేస్తున్నప్పుడే వారికి అండగా నిలబడితే మనదేశంలో ఆణిముత్యాల వంటి యువత, మేధావులు, క్రీడాకారులు వేలు, లక్షల కొద్దీ తయారవుతారు. కానీ గ్రామీణ ప్రతిభను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం పట్టణాలలో పలుకుబడి ఉన్న కొందరికే ఉదారంగా తాయిలాలు పంచిపెట్టడం సబబు కాదు. కేంద్రమయినా, రాష్ట్రాలయినా అభివృద్ధిని, దాని ఫలాలను మారు మూల కుగ్రామాలకు సైతం సమానంగా దక్కేలా చేసినప్పుడే ప్రజలకు పూర్తి న్యాయం చేసినట్లవుతుంది.






