ఏపీ-తెలంగాణ‌లో డెల్టా ప్లస్ కేసులు.. అప్ర‌మ‌త్తం చేసిన కేంద్ర స‌ర్కారు..

సెకండ్ వేవ్ చూసాంగా.. ఏ రేంజ్‌లో అడుకుందో. పొంచి ఉన్న థ‌ర్డ్ వేవ్‌కు అదొక శాంపిల్ మాత్ర‌మే అంటున్నారు. మూడో ముప్పు మామూలుగా ఉండ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌కు డెల్టా వేరియంటే కార‌ణం. డెల్టానే ఇలా ఉంటే.. ఇక మ‌రింత రాటుదేలిన‌ డెల్టా ప్ల‌స్ వేరియంట్ ఇంకెంత డేంజ‌ర్‌గా ఉండాలి? అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా ప్ల‌స్ వైర‌స్ ర‌కం తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూడ‌టం ఆందోళ‌న క‌లిగించే ప‌రిణామం. ప్ర‌స్తుతం బ‌య‌ట‌ప‌డింది రెండు కేసులే అయినా.. చాప‌కింద నీరులా ఆ వేరియంట్ ఎలా వ్యాపిస్తుందోన‌నే టెన్ష‌న్ వైద్య నిపుణుల‌ను, ప్ర‌భుత్వాల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. 

తెలంగాణ, ఏపీలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నెల 23 వరకు దేశ వ్యాప్తంగా ఈ రకం కేసులు 70 వెలుగుచూడగా.. తెలంగాణలో 2, ఏపీలో 2 చొప్పున నమోదైనట్టు తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల్లో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ లోక్‌సభకు చెప్పారు. 

నమూనాల్లో 4,172 ఆల్ఫా వేరియంట్‌, 217 బీటా, ఒకటి గామా వేరియంట్‌ ఉన్నట్టు చెప్పారు. జులై 23 వరకు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 70 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 23 కేసులు రాగా.. మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10, చండీగఢ్‌లో 4, కేరళ, కర్ణాటకలలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో రెండేసి కేసులు చొప్పున నమోదు కాగా.. ఉత్తరాఖండ్‌, హరియాణా, జమ్మూ, రాజస్థాన్‌, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒక్కో కేసు నమోదయ్యాయని మంత్రి జితేంద్ర‌సింగ్ లోక్‌స‌భ‌కు తెలిపారు. 

SARS-CoV2కు చెందిన 58,240 నమూనాలను సీక్వెన్సింగ్‌ చేసి.. 46,124 శాంపిల్స్‌ను విశ్లేషించినట్టు వివరించారు. ఈ శాంపిల్స్‌లో అత్యధికంగా 17,169 డెల్టా వేరియంట్‌ కేసులే ఉన్నట్టు తెలిపారు. లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు.