Top Stories

సెభాష్ లోకేష్!

తెలుగుదేశం జాతీయ ప్రధాన  కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రత్యర్థి పార్టీల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, అడ్మినిస్ట్రేటర్ గా, పాలనా పరంగా సత్తా చాటుతున్న మంత్రిగా నారా లోకేష్ కు అన్ని వర్గాల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తున్నది. 2019 ఎన్నికలలో కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు పడిపోయిన తెలుగుదేశం పార్టీ.. 2024 ఎన్నికలలో అనూహ్య రీతిలో 135 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాలలో విజయం సాధించడం వెనుక లోకేష్ కీలక పాత్ర పోషించారనడంలో అతిశయోక్తి లేదు.  జగన్ అరాచక, కక్షసాధింపు రాజకీయాల కారణంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు.. తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు అంటే చాలు జైళ్లు నోళ్లు తెరిచేవి. లాఠీలు స్వైర విహారం చేసేవి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు చాలా మంది రాజకీయాలకు దూరంగా కేవలం ఇంటికే పరిమితమైపోయిన పరిస్థితి నెలకొంది. పార్టీలో కూడా ఒక విధమైన స్దబ్ధత నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఆ స్తబ్ధతను బద్దలు కొట్టారు. పార్టీ నేతల్లో క్యాడర్ లో కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చారు. స్వయంగా తాను ముందు నిలబడి వైసీపీ నియంతృత్వ పోకడలను ఎదుర్కొన్నారు. దాంతో తెలుగుదేశం నేతలకు తమ భయాలకు చెల్లు చీటీ పాడేసి బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.  రాష్ట్రంలో జగన్ అరాచకపాలనకు చెల్లు చీటీ పాడి.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం వెనుక లోకేష్ పాత్ర విస్మరించజాలనిది. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కూడా లోకేష్ చాలా కీలకంగా మారారు. యువగళం  పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చడమే కాకుండా, ప్రజా  దర్బార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ చూపుతున్న చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయాలలో, పాలనలో తన సమర్ధతను రుజువు చేసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేష్ ను అన్ని వర్గాల వారూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందులో వైసీపీ నేతలకూ మినహాయింపు లేదు. ఒకప్పుడు ఆయనను విమర్శించిన వారూ, రాజకీయంగా తొలి అడుగులు పడకముందే వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారూ కూడా ఇప్పుడు లోకేష్ అంటే ప్రజా నాయకుడు అని అంగీకరిస్తున్నారు. తాజాగా అటువంటి  ప్రశంసే లోకేష్ కు లభించింది. అదీ వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమేహన్ రెడ్డి సెభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి మెచ్చుకున్నారు.  మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి వివాహం నెల్లూరులో ఆదివారం (ఫిబ్రవరి 16) జరిగింది. ఆ వివాహానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఆ సందర్భంగా  ఆ వివాహ వేడుకకు హాజరైన పలువురు నేతలను పలకరిస్తూన్న లోకేష్ అందులో భాగంగానే మేకపాటి రాజమోహన్ రెడ్డినీ పలకరించారు. లోకేష్ ను చూసీ చూడగానే చటుక్కున కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడిన మేకపాటి సెభాష్ లోకేష్ అంటూ భుజం తట్టి ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. లోకేష్ లో పరిణితి చెందిన నాయకుడే కాదు, పరిపాలనా దక్షత ఉన్న లీడర్ కూడా ఉన్నాడంటూ మేకపాటి రాజమేహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు   ప్రశంసలు కురిపించడమే లోకేష్ సత్తా, సామర్ధ్యం, నాయకుడిగా ఎంత ఎత్తుకు  ఎదిగారో తేటతెల్లం చేస్తోందనడంలో సందేహం లేదు.  
Publish Date: Feb 18, 2025 4:08PM

అప్పుడు బూతుల గని.. ఇప్పుడు మౌన ముని

మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి పూర్తిగా జ్ణానోదయం అయ్యింది. తన మౌనానికి కారణమేంటో ఆయన తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో మీడియాకు వివరించారు. అధికారంలో ఉన్నంత కాలం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై అనుచిత భాషతో ఇష్టారీతిగా రెచ్చిపోయి, పచ్చి బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని.. ఓటమి తరువాత నోరెత్తడమే గగనం అన్నట్లుగా మారిపోయారు. మీడియాకు కనిపించడమే మానేశారు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారా అన్నట్లుగా కొడాలి నాని మారిపోయారు. నోటి వెంట బూతుల సంగతి పక్కన పెడితే.. అసలు మాటే రావడం లేదు.  అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చి, మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ వెంట కొడాలి నాని కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తరువాత తన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని పార్టీ అధినేత కోసం అనివార్యంగా బయటకు వచ్చారు. జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడిన సమయంలో కొడాలి నాని కూడా పక్కనే ఉన్నారు. దీంతో మీడియా ఆయనతో కూడా మాట్లాడించింది. ఆ సందర్బంగా కొడాలి నాని తన మౌనానికి కారణం చెప్పేశారు. జనం తన ఉద్యోగం ఊడగొట్టేశారనీ, నోరెత్తద్దని ఓటు ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారనీ కొడాలి నాని అన్నారు. అందుకే మాట్లాడటం లేదనీ చెప్పారు. అంతే తప్ప అరెస్టులకు భయపడననీ, మూడు కాదు ముఫ్ఫై కేసులు పెట్టుకున్నా లేక్క చేయననీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అధినేత పక్కనుండటంతో ఆ మాత్రం డాబు ప్రదర్శించారు కానీ, వాస్తవానికి వంశీ అరెస్టుతో కొడాలి నాని జావగారిపోయారనీ, ఏ క్షణంలో కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనన్న భయంతో ఉన్నారనీ ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తం మీద జగన్  మాటలు విని బూతులతో రెచ్చిపోయిన తనను జనం ఛీకొట్టారని అంగీకరించిన కొడాలి నాని.. ఇకపై జగన్ చెప్పినా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శించే ధైర్యం చేసే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత పక్కనుండగా, జనం ఛీకొట్టారనీ, నోరెత్తొద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారనీ అంగీకరించడమే.. కొడాలి నాని చేతులెత్తేసి, చేసిన తప్పులకు చెంపలేసుకుంటున్నారని అర్ధమని విశదీకరిస్తున్నారు. 
Publish Date: Feb 18, 2025 3:33PM

జనంలో  జంకుతున్న జగన్ .. జైల్లో  నిందితుల పరామర్శలకు శ్రీకారం 

గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైకాపా అధినేత వైఎస్ జగన్  ప్రజల చీత్కారాలతో 11 సీట్లకే పరిమితమయ్యారు. జనంలో రావడానికి భయపడుతున్నజగన్ జైలు యాత్రలకు  మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా శ్రీకారం చుట్టారు. అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని  జగన్ ఠంఛనుగా పరామర్శిస్తున్నారు.   ఎన్నికల ఫలితాల   తర్వాత ఆయన షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది తాజాగా విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైకాపా అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. దళితుడైన  సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన వల్లభనేని వంశీని హైద్రాబాద్ రాయదుర్గంలో ఆయన నివాసంలోనే  ఎపి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే .   గతంలో  రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించారు. తనను గెలిపించిన టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన అరాచకాలు ఆగలేదు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి చేసిన  కేసులో వంశీ   నిందితుడు. దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని  మంగళవారం (ఫిబ్రవరి 18)ములాఖత్ లో పరామర్శించడానికి జగన్ విజయవాడ సబ్ జైలుకు మందీ మార్బలంతో వచ్చారు. జగన్ వెంట వైకాపా నేతలు  కొడాలినాని, పేర్ని నాని  కూడా ఉన్నారు. జైలులో వీరిరువురు రావడానికి అధికారులు నిరాకరించారు. భద్రతాకారణాల రీత్యా నిరాకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది.  అనేక కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ  నందిగం సురేశ్ ను కూడా గతంలో జగన్  జైలులోనే పరామర్శించారు.  జగన్ విదేశీ పర్యటన ముగిసిన వెంటనే నేరుగా సబ్ జైలులో  రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేశ్ ను పరామర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. జగన్ హాయంలో అరాచకాలు చేసిన నేతలను  రెడ్ బుక్ లో  పెట్టడంతో నందిగం సురేశ్  సత్తెనపల్లి కోర్టులో  లొంగిపోయారు. అమరావతి రాజధాని చేయాలన్న   మహిళలను దూషించిన కేసులో  సురేశ్ లొంగిపోయిన సంగతి తెలిసిందే.   మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి  ఈవీఎంల ధ్వంసం కేసులో జైలులో ఉన్నప్పుడు జగన్ పరామర్శించారు. జగన్ పాలనలో అక్రమాలు , అరాచకాలు జరిపిన నేతలు జైలు జీవితం గడుపుతుంటే జగన్ మాత్రం జైలు యాత్రలు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. తండ్రి వైఎస్ రాజశేశరరెడ్డి చనిపోగానే అధికారంకోసం జగన్ శవ యాత్రలు చేశారు.  వైకాపా పాలనలో అరాచకాలు పెట్రేగిపోవడంతో  వరుసగా వైకాపా నేతలు  అరెస్ట్ అవుతున్నారు.  ప్రజా సమస్యల మీద పోరాడుతా అని  మూడుసార్లు తేదీలతో సహా ప్రకటించిన జగన్ జనంలో వెళ్లడానికి  మాత్రం జంకుతున్నారు. గత ఐదేళ్లలో  అనేక నేరాల్లో నిందితులైన వైకాపా నేతలను  జైలులో పరామర్శించడం విమర్శలకు దారి తీసింది. 
Publish Date: Feb 18, 2025 3:12PM

కొడాలి నానిలా మారిపోతున్న జగన్మోహన్ రెడ్డి

జగన్ సంయమనం కోల్పోయారు. ఆయన నోటి నుంచి ఏం మాట వస్తోందో కూడా ఆయనకు అర్ధం కావడం లేదు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయి ముందువెనుకలాలోచించకుండా, పర్యవసానం ఎలా ఉంటుందన్న ఎరుక లేకుండా నోరు పారేసుకుంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆయన కేబినెట్ సహచరులలో ఎక్కువ మంది నోటి వెంట బూతులు వినా మరో మాట వచ్చేది కాదు. జగన్ అటువంటి వారిని ప్రోత్సహించి, అందలం ఎక్కించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత జగన్ తరఫున ప్రత్యర్థులపై నోరు పారేసుకుని బూతుల పంచాగంతో విరుచుకుపడటానికి ఆయన పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకపోవడం ఏమిటి.. ఆసలు ఆయన పొడే గిట్టదన్నట్లుగా పార్టీని వీడిపోతున్నారు. సోషల్ మీడియాలో రోత పోస్టులతో  ఇష్టారీతిగా రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చెప్పేసి తాను చాలా మంచి వాడిననీ, జగనే తనను బెదరించి, ఒత్తిడి చేసి అటువంటి అసభ్య పోస్టులు పెట్టించారనీ, ఆయన ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేయించారనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  దీంతో ఇక తాను చెప్పినట్లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసే వారెవరూ పార్టీలో లేకుండా పోయారు. ఉన్న రోజా, కొడాలి నాని వంటి వారు మైకులను తప్పించుకుని తిరుగుతున్నారు.  దీంతో వేరే గత్యంతరం లేక జగనే స్వయంగా రంగంలోకి దిగిపోయారా?  బూతుల పంచాంగం తెరిచేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ క్రమంలో మేము ఎవ‌ర్ని ఏమ‌న్నా త‌ప్పులేదు.. మీరు అంటే మాత్రం త‌ప్పు..! క్ష‌మించ‌రాని నేరంకూడా అన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి. నిజానికి మొద‌టి నుంచి వైసీపీ నేత‌ల తీరు ఇదే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ఆ పార్టీ నేత‌లు ఎవ‌రినైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టొచ్చు.   అధికారంలో ఉన్నంత కాలం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన జగన్, ఆయన పార్టీ నేతలూ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్న వారు కూడా అధికార మదంతో తెలుగుదేశం కూటమి చట్టాలను ఉల్లంఘించి వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామనీ అప్పుడు ఇంతకింతా అనుభవించేలా చేస్తామనీ హెచ్చరికలు చేస్తున్నారు.  విజయవాడ జిల్లా జైలు బయట జగన్ మీడియాతో  మాట్లాడుతూ ఇలాంటి హెచ్చరికలే చేశారు.   తెలుగుదేశం ఎల్లకాలం అధికారంలో ఉండదన్న జగన్.. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది వైసీపీయే అని జోస్యం చెప్పారు. అలా చెప్పి ఊరుకోకుండా.. పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. తెలుగుదేశం నేతలకు సెల్యూట్ చేస్తూ, వారి కోసం పని చేసే పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలనూ వదిలిపెట్టేది లేదన్నారు.  ఏడు సముద్రాల అవతలదాగినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. అటువంటి పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలను బట్టలూడదీసి నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. బట్టలూడదీసి నిలబెడతా అన్న వ్యాఖ్యలు జగన్ ను కచ్చితంగా ఇరుకున పెడతాయి. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైనా ఆశ్చర్యం ఉండదు.   
Publish Date: Feb 18, 2025 1:16PM

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. బీఆర్ఎస్ పరువు గంగలో కలిసిందిగా?

రాజకీయాలలో ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టడమే కాదు, పకడ్బందీగా ప్రతి వ్యూహాలనూ అమలు చేయాల్సి ఉంటుంది. ఎత్తులు, పై ఎత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నంత కాలం... ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ప్రత్యర్థుల అంచ నాలకు మించి ఉండేవి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన పొలిటికల్ గా ఒకింత ఇన్ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు యాక్టివ్ అవుతానంటున్నారు అది వేరే సంగతి. కానీ ఈ లోగానే బీఆర్ఎస్ వ్యూహరచనలో, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టడంలో, వారి ఎత్తుగడలను అంచనా వేయడంలో విఫలమై పరువుపోగొట్టుకుంది.  ఇంతకీ విషయం ఏమిటంటే.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి జరిగే ఎన్నికలలో సంప్రదాయానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పోటీలో నిలవాలని నిర్ణయించుకుంది. ఇద్దరు అభ్యర్థుల చేత నామినేషన్ కూడా వేయించింది. బీజీపీ మద్దతుతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టాలని భావించింది. అందుకోసం బీజేపీతో చర్చలు కూడా జరిపింది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలపాలన్న ఒప్పందానికి కూడా వచ్చాయి.  జీహెచ్ఎంసీ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్ల కార్పొరేటర్ల నుంచి ఏటా స్టాండింగ్ కమిటీ లేదా స్టాండింగ్ కౌన్సిల్ కు 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగానే జరిగాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికలకు సిద్ధపడ్డాయి. వాటి ధైర్యం ఏమిటంటే 150 మంది  కార్పొరేటర్లలో బీఆర్ఎస్ కు 56 మంది, బీజేపీకి 48 మంది ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది ఉన్నారు.  కాంగ్రెస్ కు ఇద్దరు కార్పొరేటర్ల బలం మాత్రమే ఉండేది. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడంతో  కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ బలం 24కు పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం  42కు, బీజేపీ బలం 40కి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపి కాంగ్రెస్ ను దెబ్బతీయాలని భావించాయి. ఎన్నికలకు సిద్ధమయ్యాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో నామినేషన్ల దాఖలుకు సోమవారం (ఫిబ్రవరి 17) చివరి తేదీ. సరిగ్గా చివరి నిముషంలో బీజేపీ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి పోటీ నుంచి వైదొలగింది. ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒక్క కార్పొరేటర్ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.  దీంతో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహ రించుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. వారు ఉపసంహరిం చుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. బీఆర్ఎస్ పరువు గంగలో కలుస్తుంది. అలా కాకుండా పోటీలో కొనసాగినా గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఎందుకంటే ఎంఐఎం, కాంగ్రెస్ చేతులు కలిపి పోటీలోకి దిగాయి. దీంతో ఎంఐఎం, కాంగ్రెస్ లకు కలిపి బలం 65కు పెరిగింది. అంతే కాకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు 42 మంది ఇన్ టాక్ట్ గా ఉంటారన్న నమ్మకం బీఆర్ఎస్ లోనే లేదు.  దీంతో బీజేపీని నమ్మకుని బీఆర్ఎస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు రెడీ అయ్యి పరువుపోగొట్టుకుంది. 
Publish Date: Feb 18, 2025 12:53PM

నాయకుడిగా కేటీఆర్ వైఫల్యం ఫిక్సైపోయినట్లేనా?.. సీఎం కల చెదిరిపోయినట్లేనా?

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బుధవారం (ఫిబ్రవరి 19) ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షడి హోదాలో కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. 2023 ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత కేసీఆర్ దాదాపు రాజకీయ అజ్ణాత వాసం చేశారు. పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. మధ్యలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం చేసినా అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు. మొత్తం మీద ఒక దశలో ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అడపాదడపా తనను కలవడానికి వచ్చిన పార్టీ నేతలతో ఫామ్ హౌస్ లో రాజకీయాలపై, పార్టీ విషయాలపై మాట్లాడినా అదంతా ఆఫ్ ది రికార్డ్ అన్నట్లుగానే ఉండేది. అయితే ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ అజ్ణాత వాసం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. అది పార్టీ నేతల్లో, క్యాడర్ లో నూతనోత్సాహాన్నినింపవచ్చు కానీ అదే సమయంలో మరో విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తోంది. అదేమిటంటే పార్టీని ముందుండి నడిపించడంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వైఫల్యం. ఔను కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కేసీఆర్ ఎప్పుడో అవసరమైన రూట్ క్లియర్ చేశారు. బీఆర్ఎస్ రెండో సారి విజయం సాధించగానే కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి.. తన తరువాత సీఎం కేటీఆరేనన్న సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే కేటీఆర్ ప్రభుత్వంలో డిఫాక్టో సీఎంగానే వ్యవహరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా ఆయనే ప్రకటించే వారు. ఒక దశలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి దూకేస్తున్నారనీ, అంతకు ముందే కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టేస్తారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ  కేటీఆర్ పట్టాభిషేకం వాయిదా పడుతూ వచ్చింది.   వాస్తవానికి 2018లో ముఖ్యమంత్రి కేసీఅర్ ముందస్తు ఆసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినప్పటి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకం వార్తల్లో నలుగుతూనే ఉంది. అందుకోసమే ముందస్తుకు వెళ్ళారని అప్పట్లోనే  గట్టిగా వినిపించింది. ఇక 2019 లోక్ సభ ఎన్నికల ముందు అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం ఖాయమని  అన్నారు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్’ ఏర్పడిపోయినట్లే ప్రచారం జరిగిపోయింది. అదే సమయంలో కేటీఆర్’ సైతం పట్టాభిషేకానికి రెడీ అయిపోయారు. అయితే, అప్పట్లో కారు సారు   పదహారు నినాదం బూమరాంగ్ అయ్యింది. దీంతో కేసీఆర్ ఢిల్లీ కలే కాదు.. కేటీఆర్ సీఎం కల కూడా ... కరిగిపోయింది.   సరే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ రాజకీయ అజ్ణాత వాసంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ దూకుడును కేటీఆర్ నిలువరించడంలో విఫలమయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ అజ్ణాతం వీడి బయటకు రావడానికి రెడీ అయ్యారు. అంతకంటే ముందు.. కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనీ, కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపడతారని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా కేటీఆర్ తన వైఫల్యాన్ని స్వయంగా అంగీకరించడమే కాకుండా సీఎం రేసులో లేననీ, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే ఉన్నారని స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఇహ ఇప్పట్లో కేటీఆర్  సీఎం అనే మాట వినిపించే అవకాశమే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Feb 18, 2025 9:49AM