తుపాను ఎఫెక్ట్.. మ‌రో రెండు రోజులు వ‌ర్షాలు..

ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు చ‌ల్ల‌బ‌డ్డాయి. వాన‌ల‌తో త‌డిసి ముద్ద‌య్యాయి. ఈ వాన‌లు మ‌రో రెండు రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. ఎక్క‌డో ప‌శ్చిమాన‌ గుజ‌రాత్ తీరంలో తుఫాను తీరం దాటితే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌పైనా ప్ర‌భావం క‌నిపిస్తోంది. 

తౌక్టే ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాతావరణం చల్లబడింది. వర్షాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయి. రెండ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.

మరోవైపు గుజరాత్‌ వద్ద తౌక్టే తుపాను  తీరాన్ని తాక్కింది. అరేబియా సముద్రంలో తౌక్టే అల్లకల్లోలం సృష్టించింది. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌‌లలో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబై తీరంలో  సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుపాను... పోర్‌బందర్‌-మహువాల దగ్గర తీరం దాటింది. వెరవల్‌-సోమనాథ్‌ తీరంలో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.