అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సైకిల్‌దే విజ‌యం.. ఉత్త‌రాది నేత‌ కీల‌క వ్యాఖ్య‌లు..

డౌటే లేదు. సైకిలే గెలుస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సైకిల్ రాజ్యం త‌ప్ప‌క వ‌స్తుంది. ప్ర‌భుత్వంపై ప్ర‌జావ్య‌తిరేక‌త అలా ఉంది మ‌రి. నిరుద్యోగులు స‌ర్కారుపై ర‌గిలిపోతున్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌లు క‌డుపుమంట‌తో ఉన్నారు. రైతుల ఆక్రంద‌నను పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. నేరాలు బాగా పెరిగాయి. ప్రజలకు ఆక్సిజన్‌, ఔషధాలు కూడా అందుబాటులో ఉంచకుండా వారి చావుకు వారిని వదిలేశారు. ఇలాంటి ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు. సైకిల్ గుర్తును భారీ మెజార్టీతో గెలిపిస్తారంటూ స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ అన్నారు. 

సోషలిస్టు నేత జ్ఞానేశ్వర్‌ మిశ్రా జయంతి సందర్భంగా యూపీలో సైకిల్‌ ర్యాలీ నిర్వ‌హించారు ఎస్పీ అధినేత‌ అఖిలేష్‌. యూపీ వ్యాప్తంగా చేపట్టిన సైకిల్ ర్యాలీలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు చట్టాలు, నేరాల రేటు పెరుగుదల.. తదితర అంశాలను లేవనెత్తారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స‌మాజ్‌వాదీ పార్టీ 400 స్థానాలు గెలుచుకుంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు అఖిలేష్ యాద‌వ్‌. ‘‘ వచ్చే ఎన్నికల్లో 350 స్థానాలు గెలుస్తామని గతంలో చెప్పా.. కానీ బీజేపీ పాలనపై ప్రజల ఆగ్రహం చూస్తుంటే 400 సీట్లలో విజయం ఖాయమని చెప్పగలను’ అని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. 

కరోనా కట్టడిలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు అఖిలేష్‌.  కొవిడ్‌ సెకండ్‌వేవ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదని విమ‌ర్శించారు. ప్రజలకు ఆక్సిజన్‌, మెడిసిన్‌ కూడా అందుబాటులో ఉంచకుండా వారి చావుకు వారిని వదిలేసిందని త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ 2017 ఎన్నికల మేనిఫెస్టోను చదవకుండా.. మనీ-ఫెస్టోపై దృష్టి పెట్టిదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీలో వర్క్‌ కల్చర్ లేదన్న అఖిలేశ్‌.. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చడం మిన‌హా.. ఈ నాలుగేళ్లలో బీజేపీ స‌ర్కారు చేసిందేమీ లేదన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, కస్డడీ మరణాలు, గంగా నదిలో మృతదేహాలను పారవేసే వ్యవహారంలో యూపీని యోగి ప్రభుత్వం మొద‌టి స్థానంలో నిలిపిందంటూ మండిప‌డ్డారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాద‌వ్. స‌మాజ్‌వాదీ పార్టీ ఎన్నిక‌ల చిహ్నం సైకిల్‌.