వైసీపీ వారికే వరద సాయం? కడప జిల్లాలో బాధితుల ఆందోళన..

జగనన్న పాలనలో అంతా రివర్సే. గత రెండున్నర ఏండ్లుగా ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలే అలా ఉంటున్నాయని అంటున్నారు. పార్టీలకతీతంగా అందించాల్సిన పథకాల అమలులో వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ సానుభూతి పరుల పెన్షన్లు కట్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా వాలంటీర్లుగా ఉండటంతో... గ్రామాల్లో అధికార పార్టీ నేతలు చెప్పినట్లే అంతా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వరద సాయంలోనూ రాజకీయ వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరదలతో నరకయాతన పడిన బాధితులకు సాయం అందించాల్సిన ప్రభుత్వం.. అందులోనూ టీడీపీ వాళ్లను టార్గెట్ చేసిందని తెలుస్తోంది. 

వరదలతో తీవ్ర నష్టం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.  రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెను వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజుల వరకు గ్రామస్తులు నీటిలోనే ఉన్నారు. అయితే ఆ గ్రామంలో వరద సాయం బాధితులందరికి ఇవ్వలేదు. ఆ గ్రామంలో వైసీపీ సర్పంచ్ లేకపోవడం వల్లే ప్రభుత్వం వివక్ష చూపిందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా గరుగుపల్లెలో  కొందరు బాధితులు ఆందోళనకు దిగారు. ఏకంగా ప్రభుత్వ చీఫ్ విప్ రాయచోటి శ్రీకాంత్ రెడ్డిని నిలదీశారు వరద బాధితులు. వరద సాయం వైసీపీ వర్గీయులకే పంపిణీ చేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించిన ఐదుగురు వరద బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

వివరాల్లోకి వెళితే ..ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గరుగుపల్లెలో వరద సాయం పంపిణీ చేపట్టారు. అర్హులందరికీ ఇవ్వలేదని, వైసీపీ వర్గీయులను మాత్రమే వలంటీర్‌ నమోదు చేశారని ఆరోపిస్తూ గ్రామస్థులు పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌ని పిలవకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ పంపిణీ చేయాలని అధికారులను శ్రీకాంత్‌రెడ్డి ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, అడ్డుకున్నవారిలో ఐదుగురిపై రాయచోటి అర్బన్‌ పోలీసులు సాయంత్రం కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకూ ఆటంకం కల్పించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 353, 341, 506 రెడ్‌ విత్‌ 34 కింద కేసు(క్రైం నంబరు 448/2021) నమోదు చేశారు. అర్హులందరికీ ఇవ్వాలని అడిగిన ప్రజలపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ తప్పుడు కేసులు పెట్టించడం దారుణమని టీడీపీ నాయకుడు మండిపల్లె రాం ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.