కొబ్బరికాయ దెబ్బకు పగిలిన రోడ్డు.. కాంట్రాక్టర్ కు దండం పెట్టాల్సిందే!

కొత్తగా రోడ్డు నిర్మించారు ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించారు. తమ గ్రామానికి కొత్త రోడ్డు రావడంతో గ్రామస్తులంతా ఆ కార్యక్రమానికి ఉత్సాహంగా వచ్చారు. ఎమ్మెల్యే రోడ్డును ప్రారంభించగానే.. దానిపై రయ్ మని దూసుకుపోవాలని ఆశగా ఎదురుచూశారు. కాని అంతా సీన్ రివర్సైంది. ఎమ్మెల్యే వచ్చారు. రోడ్డును ప్రారంభించారు. పూజ సందర్భంగా కొబ్బరి కాయ కొట్టారు. అంతే అక్కడ జరిగింది చూసి అంతా అవాక్కయ్యారు. 

గ్రీజ్ లేదు కానీ.. మూడు రాజధానులా?

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూరులో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామానికి నిర్మించిన  కొత్త రోడ్డును బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఓ కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఆమె కొబ్బరికాయ పగలాలనుకున్నారు.. కానీ దానికి బదులుగా ఆ రోడ్డులోని కంకరరాళ్ళు బయటకు వచ్చాయి. దీంతో ఆమెకు చాలా కోపం వచ్చింది.  అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడికక్కడే ధర్నా చేశారు. ఇంత నాసిరకంగా రోడ్డును నిర్మిస్తారా? అంటూ నిలదీశారు. 

బిజ్నూరు జిల్లాలోని ఖేద గ్రామం వద్ద నిర్మించిన ఈ రోడ్డు కోసం రూ.1.16 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీని పొడవు దాదాపు 7 కిలోమీటర్లు. సుచి చౌదరి కొబ్బరికాయ కొట్టగానే గ్రావెల్ బయటకు రావడంతో అక్కడే ఉన్న ఆమె భర్త మౌసమ్ ఓ పార తీసుకొచ్చి, చదును చేశారు. ఈ రోడ్డు నమూనాను పరీక్షల కోసం పంపించామని సాగునీటి పారుదల విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వికాస్ అగర్వాల్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్ కు దండం పెట్టాలంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.