మూడు వారాల్లో క‌రోనా ఖ‌తం!.. ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్‌..

క‌రోనా కేసులు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. మ‌న‌ చుట్టుప‌క్క‌ల చాలా మందికి కొవిడ్ సోకుతోంది. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, త‌ల‌నొప్పి, ఒంటినొప్పుల‌తో కొంద‌రు.. ఎలాంటి సింప్ట‌మ్స్ లేకుండా పాజిటివ్ వ‌స్తున్న వారు ఇంకొంద‌రు. అయితే, మూడు నుంచి ఐదు రోజుల్లోనే త‌గ్గిపోతోంది. కేసులు భారీగా పెరుగుతున్నా.. ప్రాణాపాయం త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కాసింత ఊర‌ట‌. 

భారత్‌లో ప్రస్తుతం కరోనా మూడోవేవ్‌ నడుస్తోంది. రోజుకు 3 లక్షలపైనే కొత్త కేసులు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో ప్రభుత్వ వర్గాల నుంచి మ‌రో పాజిటివ్ న్యూస్ వ‌చ్చింది. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపాయి. వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమం.. థ‌ర్డ్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని చెప్పింది. 

‘ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం, స్థిరంగా ఉండటం ప్రారంభమైంది’ అని అధికారిక స‌మాచారం వెల్ల‌డించింది. కేంద్రం తెలిపిన గణాంకాల ప్రకారం.. జనవరి 24, సోమ‌వారం 3,06,064 కరోనా కేసులు వ‌చ్చాయి. జనవరి 23న 3.33 లక్షలు, జనవరి 22న 3.37 లక్షలు, జనవరి 21న 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే, గ‌డిచిన‌ మూడు రోజులుగా కేసుల సంఖ్య‌లో కాస్త‌ తగ్గుదల కనిపిస్తోంది. అయితే, ప్రధాన నగరాల్లో కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త కేసుల్లో ఆకస్మిక పెరుగుదల లేన‌ప్ప‌టికీ.. ఏ మాత్రం అజాగ్రత్తవద్దని సూచిస్తున్నారు.

జనవరి ప్రారంభంలో కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రానే తాజా వేవ్‌కు మెయిన్ రీజ‌న్‌. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ సమూహ వ్యాప్తి స్థాయికి చేరిందని, కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని గ‌తంలోనే నిపుణులు హెచ్చరించారు. వాళ్లు చెప్పిన‌ట్టే జ‌రుగుతోంది. బ‌హుషా.. ఫిబ్ర‌వ‌రి 15క‌ల్లా ఈ పాండ‌మిక్ క్లైమాక్స్‌కు చేరవ‌చ్చేమో.