మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు.. ష‌ర్మిల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఆమె మానాన ఆమె పాద‌యాత్ర చేసుకుంటున్నారు. తెలంగాణ కోడ‌లినంటూ రాజ‌న్న రాజ్యం కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి, రాజ‌న్న రాజ్యం సాధించాలంటే.. కేసీఆర్ పాల‌నపై తిర‌గ‌బ‌డాల్సిందేగా? అందుకే దొర‌ల పాల‌న‌పై ష‌ర్మిల ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేసీఆర్‌ది గుండె కాదు బండ అంటూ రాజ‌కీయ‌ బండ‌లేస్తున్నారు. ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో ఆరోప‌ణ‌ల డోసు మ‌రింత పెంచారు. 

ఆమెను అలానే వ‌దిలేస్తే.. మ‌రింత రెచ్చిపోతార‌నుకున్నారో.. లేక‌, త‌మ అధికారానికే దెబ్బ‌కొడ‌తార‌ని భ‌య‌ప‌డ్డారో ఏమో కానీ.. అధికార పార్టీ నుంచి గట్టి కౌంట‌ర్లే ప‌డుతున్నాయి. మొద‌ట్లో ష‌ర్మిల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని టీఆర్ఎస్ నేత‌లు.. ఇప్పుడు నోటికి ప‌ని చెబుతున్నారు. గ‌తంలో మ‌హిళ‌లు మంగ‌ళ‌వారం నోములు నోస్తుంటార‌ని మంత్రి కేటీఆర్ ష‌ర్మిల‌ను ఉద్దేశించి కామెంట్లు చేయ‌గా.. తాజాగా మ‌రో మంత్రి నిరంజ‌న్‌రెడ్డి వైఎస్సార్‌టీపీ అధినేత్రిపై మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్లు తీవ్ర కాంట్ర‌వ‌ర్సీగా ఉండ‌టం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. మంత్రి నిరంజ‌న్‌రెడ్డి మాట‌ల‌పై మ‌హిళ‌లంతా మండిప‌డుతున్నారు. ఇంత‌కీ.. ఆయ‌న ఏమ‌న్నారంటే....

‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ష‌ర్మిల పేరును నేరుగా ప్ర‌స్తావించ‌కున్నా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ష‌ర్మిలను ఉద్దేశించేన‌ని ఈజీగా తెలిసిపోతున్నాయి. 


వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్ర‌జా ప్ర‌స్థాన‌ పాదయాత్ర కొనసాగిస్తూనే.. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ష‌ర్మిల దీక్ష‌ల‌ను టార్గెట్ చేస్తూ.. మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు ఒకామె బ‌య‌లు దేరిందన్న మంత్రి మాట‌లు మంట‌లు రాజేస్తున్నాయి.

మంత్రి నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక.. 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని కూడా ఆరోపించారు. ఇలా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లపై ఇటు మ‌హిళ‌లు, అటు నిరుద్యోగులు మండిప‌డుతున్నారు. టీఆర్ఎస్ నేత‌లు మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా అని ప్ర‌శ్నిస్తున్నారు.