మమత వాటికన్ టూర్‌పై ర‌చ్చ‌.. బీజేపీ అడ్డుపుల్ల‌.. స్వామి స‌పోర్ట్‌.. ఇదేం డ్రామా?

పశ్చిమ బెెంగాల్ రాజకీయ కక్షలు ప్రపంచ వేదికల మీద కూడా ప్రతిఫలిస్తాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తప్పదేమో అనిపిస్తుంది. వాటికన్ సిటీలో జరిగే సర్వమత సమ్మేళనానికి మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం అందిందట. అక్టోబర్ 4వ తేదీన ఈ సమ్మేళనం జర‌గ‌నుంది. దానికి మమత వెళ్లాల్సి ఉంది. అందుకోసం ఆమె ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మోకాలడ్డుతోంది. మమత వాటికన్ వెళ్లడానికి అనుమతించేది లేదంటోంది. అది సర్వమత సమ్మేళనం కాబట్టి పొలిటికల్ లీడర్స్ ఆ సమావేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని ఎం.హెచ్.ఎ స్పష్టం చేస్తోంది. అయితే మమత మాత్రం వెళ్లి తీరతాను.. ఎవరాపుతారో చూస్తాను అంటూ చెలరేగిపోతోంది. 

మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకోవాలంటే భవానీపూర్ లో తప్పకుండా గెలిచితీరాలి. ఇటీవల విడుదలైన ఈసీ షెడ్యూల్ ప్రకారం ఈనెల 30న భవానీపూర్ బైె-ఎలక్షన్ జరుగుతుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ లో మమత భవితవ్యం తేలిపోతుంది. ఆ తెల్లవారే వాటికన్ సిటీలో సర్వమత సమ్మేళనం జరగబోతోంది. కాబట్టి ఆ పంచాయతీకి ఈ లోగానే శుభం కార్డు పడితే తాను తప్పక గెలుస్తానన్న ఓ కాన్ఫిడెన్స్ మమతలో బిల్డప్ అవుతుంది. సర్వమత సమ్మేళనంలో సెక్యులర్ లీడర్ గా ప్రొజెక్ట్ కావడం అనేది మమతకు తప్పనిసరి అంశం. లేకపోతే ఆమె మోరల్ గా పతనమై భవానీపూర్ లో బీజేపీకి తలొగ్గి ఆ తరువాత సీఎం కుర్చీ నుంచి అత్యంత పరాభవంతో నిష్క్రమించాల్సి వస్తుంది. అది జరగకూడదు కాబట్టే తనను ఎవరాపుతాారో చూస్తానంటూ మమత బీజేపీ నేతల మీద సవాళ్లు విసురుతోంది. 

ఇటీవల బెంగాల్ కు జరిగిన హోరోహోరీ ఎన్నికల్లో మమత సీఎం స్థానాన్ని నిలబెట్టుకున్నా తను పోటీ చేసిన సీటు మాత్రం ఓడిపోయారు. అటు బీజేపీ 4 స్థానాల నుంచి 77 స్థానాలకు ఎగబాకింది. బెంగాల్ పోలింగ్ సమయంలోనే ప్రధాని మోడీ బంగ్లాదేశ్ రాష్ట్ర అవతరణ దినాన్ని పురస్కరించుకొని ఢాకాలో పర్యటించారు. అక్కడ మోడీ చేసిన ప్రసంగం, కాళికాదేవి టెంపుల్ ను మోడీ సందర్శించడం బాగా హైలైట్ అయ్యాయి. మరోవైపు బెంగాల్లో మాత్రం మత ఘర్షణలు చెలరేగాయి. బీజేపీ కార్యకర్తలు, నాయకుల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. రోహింగ్యాలు, స్థానిక ముస్లిం శక్తులు సంఘ పరివార్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. చాలా బీజేపీ కుటుంబాల ఆస్తులు లూటీ అయ్యి రోడ్డుమీద కూడా పడ్డాయి. మరోవైపు రాష్ట్ర హెచ్చార్సీ, జాతీయ హెచ్చార్సీ, హైకోర్టు వంటి ఉన్నత సంస్థలు సైతం మమత పరిపాలనను, వైఖరిని తప్పుపట్టేలా కామెంట్లు చేశాయి. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన సీటును తప్పకుండా నిలబెట్టుకోవాలంటే ఆనాడు మోడీ అనుసరించిన సూత్రాన్నే తాను కూడా అనుసరించాలని మమత భావిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. 

బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్ల మద్దతు పొందేందుకు వాటికన్ సమావేశాన్ని  ఉపయోగించుకోవాలని మమత నిర్ణయించుకున్నారు. అందుకే ఐరాస ఆధ్వర్యంలో నవంబర్ లో జరగబోయే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కు ముందస్తుగా జరుగుతున్న వాటికన్ సమావేశంలో పాల్గొనాలని డిసైడయ్యారు. వాటికన్లో సమావేశాన్ని బ్రిటన్, ఇటలీ కలిసి నిర్వహిస్తుండగా నవంబర్ లో జరిగే సమావేశానికి బ్రిటన్ హోస్ట్ చేస్తోంది. వాటికన్ మీట్ లో ప్రపంచంలోని పలు దేశాల నుంచి సుమారు 40 మంది వివిధ మతాల ప్రవక్తలు, మరో 10 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. ఈ 50 మంది ప్రపంచ దేశాధినేతలకు సంయుక్తంగా ఓ అప్పీల్ చేస్తారు. వివిధ దేశాల్లో పతనమవుతున్న శాంతిభద్రతలు, మానవీయ విలువలు నిలబెట్టడానికి, పర్యావరణాన్ని మెరుగు పరచడానికి ఏం చేయాలో సూచిస్తారు. 

అలాంటి సమావేశానికి మమత వెళ్లాల్సిన అవసరం ఏంటని, తన పాలనలో హిందువులకు రక్షణ కల్పించలేకపోయిన మమత.. ఏ విధంగా శాంతి వచనాలు వల్లిస్తుందని, ఎవరికి వల్లిస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే అది ప్రజాస్వామిక హక్కు అని మమత మద్దతుదారులు, బీజేపీ వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు వారు గోద్రా అల్లర్లను ఉటంకిస్తున్నారు. అయితే బీజేపీకి బలమైన మద్దతుదారుగా ఉన్న సుబ్రమణ్యస్వామి కూడా మమతకు సపోర్టుగా రావడం ఆసక్తికరంగా మారింది. పౌరుడికి ఎక్కడికైనా ప్రయాణించే స్వేచ్ఛను ఆర్టికల్ 19 ద్వారా రాజ్యాంగం కల్పించిందని, దాని గురించి ఎంతసేపైనా తాను వివరించగలనని స్వామి ఘాటుగానే వ్యాఖ్యానించారు. 

అయితే ప్రయాణించే స్వేచ్ఛ మీద అవసరానికి తగినట్టు కొన్ని ఆంక్షలున్నాయని, ఆ ఆంక్షలను కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని, కానీ ఒక సీఎం ట్రావెల్ చేయడాన్ని అడ్డుకునే ఆంక్షలు ఎక్కడా లేవంటూ కేంద్ర సర్కారు మీద అస్త్రాలు సంధించారు. అయితే స్వామిది రెండు నాల్కల ధోరణి అంటూ బీజేపీ సోషల్ మీడియా టీమ్ విరుచుకుపడుతుండగా.. మమత సపోర్టర్లు మాత్రం స్వామిని సమర్థిస్తున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్న స్వామి.. ఫక్తు మోడీ వ్యతిరేకిగా మమతకు మద్దతివ్వడంలో చాణక్యం ఏంటన్న అంచనాలు, అభిప్రాయాలు జోరుగా సాగుతున్నాయి.