జగనన్న మాయాజాలం.. లెక్క తప్పింది..

పది వేల కోట్లు కాదు, జస్ట్ ఓ పది రూపాయలు జీతం పెంచుతామంటే వద్దనే పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటారా? మా జీతాలు పెంచితే ఒప్పుకోమని, పాత జీతాలే కావాలని పట్టు పట్టే అమాయక చక్రవర్తులు ఎక్కడైనా ఉంటారా? జీతాలు పెంచినందుకు యజమాన్యం మీద కోపగించి సమ్మెకు వెళ్ళే మూర్ఖులు ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా, ఏ మూలనైనా ఉంటారా? ఉండరు, అనుకుంటాం .. కానీ, ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ఉద్యోగులు అదే కోరు తున్నారు. అందుకే సమ్మెకు వెళుతున్నారు. నిజానికి ఇది వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది. కానీ, నిజం. అంతే కాదు, ఏపీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నపీఅర్సీ విషయంగా అదే నాణ్యాన్ని తిరగేస్తే మరో చిత్రం కనిపిస్తుంది. 

ఉద్యోగులు వద్దన్నా జీతాలు పెంచుతామనే యాజమాన్యం/ ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అందులోనూ కరోనా కష్ట కాలంలో, ఆదాయం లేక అప్పుల మీద అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఒకటి రెండు కాదు ఏకంగా పది వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని మోసేందుకు ముందు కొస్తుందా? అంత ‘గొప్ప’ మనసున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి  ఎక్కడైనా    ఉంటారా?  ఉండరు. కానీ, ఉన్నారు.  అది కూడా ఏపీలోనే ఉన్నారు. ఇలా జీతాలు పెంచద్దు, పాత జీతాలే ఇవ్వండి అనే ఉద్యోగులు, కాదు కాదు, పెంఛి తీరవలసిందే అని పట్టుపట్టే యాజమాన్యం ఎక్కడా ఉండవేమో కానీ, ఏపీలో మాత్రం అదే ‘చిత్రం’ నడుస్తోంది. ఉద్యోగులేమో పెంచిన జీతాలు వద్దు, పాత జీతాలే ముద్దు’ అవే ఇవ్వండని అంటున్నారు.

ప్రభుత్వమేమో, పీఆర్సీ ద్వారా పది వేల కోట్ల రూపాయల మేరకు ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని అంటోంది. పెంచిన జీతాలు పుచ్చుకోవలసిందే అంటోంది. ఆ పదివేల కోట్లు మీరే ఉంచుకోండి.. మా పాత జీతాలు మాకిచ్చేయండి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి, ఇలా ఉద్యోగులు పీఆర్సీ వద్దనడం, చరిత్రలో ఇదే మొదటి సారి  కావచ్చును. సహజంగా ప్రభుత్వం ఎంత ఉదారంగా పీఆర్సీ ఇచ్చినా, ఇంకా  కావాలని అడగడం ఆందోళన చేయడమే గానీ,ఇలా రివర్స్’లో  పీఆర్సీ వద్దని ఉద్యోగులు సమ్మెకు పోవడం మాత్రం కొంచెం చాలా చిత్రంగానే వుందని అంటున్నారు, ఉండవల్లి వంటి విశేష రాజకీయ అనుభవం ఉన్న విశ్లేషకులు. 

అయితే, ఒక్క అప్పులు చేయండలో మినహా అన్నిటా రివర్స్ గేర్’లోనే ప్రభుత్వ బండి నడుపుతున్న జగన్ రెడ్డి సర్కార్ విషయంలో మాత్రం ఇందులో ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చూపించి, వందల వేల కోట్ల రూపాయలు మేర అవినీతికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వనికి  ఇలాంటి మాయాజాలం పెద్ద పని కాదని అంటున్నారు. జగన్ సర్కార్ చేసిన ఈ  మాయజాలం కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.  

నిజానికి, ప్రభుత్వం చెపుతున్న లెక్కలు తప్పని చెప్పడానికి పెద్దగా లెక్కలు తెలియవలసిన అవసరం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం వలన, ప్రభుత్వంపై రూ.10,700 కోట్లమేర అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. మరోవంక ఉద్యోగులేమో పీఆర్సీ వద్దు, పెంచిన జీతాలు వద్దు పాత జీతాలు ఇవ్వండి చాలని అంటన్నారు. నిజంగా, ముఖ్యమంత్రి చెపుతున్న విధంగా పీఆర్సీ వలన ప్రభుత్వం ఫై రూ.10,700 కోట్లమేర అదనపు భారం పడుతున్నదే నిజం అయితే, ముఖ్యమంత్రి స్థానలో జగన్ రెడ్డే కాదు, ఇంకో రెడ్డే కాదు ఎడ్డి  ఎవరున్నా ఎగిరి గంతేసి, ఉద్యోగుల డిమాండ్ ఒప్పేసుకుంటారు.  ఆ రూ.10,700 కోట్ల రూపాయలతో మరో, ‘జగనన్న..బిచ్చ’ పథకాన్ని ప్రారంభించి ఓటు బ్యాంకును పెంచుకుంటారు. కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా ఎగర లేదు. గెంత లేదు. అంటే .. పాత జీతాలు ఇచ్చేదే లే’ అని ఫటా ఫట్ జీఓ ఇచ్చేశారు. అంటే  దాల్ మే కుచ్ కాలా.. హై.. అనుకోవడం తప్పు కాదు.