వరంగల్ డిక్లరేషన్ తో కాంగి ‘రేసు’

వరంగల్ డిక్లరేషన్ తో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్, బీజేపీలపై ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నది. కాంగ్రెస్ కు సహజ రుగ్మతలుగా చెప్పుకునే అంతర్గత విభేదాలను దాటి జనంలోకి దూకుడుగా వెళ్లేలా వరంగల్ డిక్లరేషన్ తో స్కెచ్ వేసుకుంది. టీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా ప్రారంభించిన థరణి పోర్టల్ కుప్పుస్వామి మేడ్ డిఫికల్టీలా తయారైందన్న విమర్శలతో రైతులకు చేరువయ్యే వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ధరణి పోర్టల్ వల్ల రైతుల ఇబ్బందులు రెట్టింపయ్యాయన్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కల్పించింది.  ధరణి పోర్టల్ కు ముందు పరిస్థితే మేలని రైతులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు ధరణి పోర్టల్ వల్ల నష్టం తప్పేటట్లు లేదని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితినే కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహ రచన చేసి దూసుకుపోతున్నది.  ధరణి వల్ల రైతుల ఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని హామీ ఇస్తున్నది. అదే సమయంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ ధరణిపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంలో వెనుక బడింది. రాహుల్ గాంధీ వరంగల్ సభలో టీఎస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధరణిపై చేసిన  ప్రకటనకు    రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను తీసేస్తామన్న తమ హామీని మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతు కష్టాలను అడ్రస్ చేయడంలో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగ్గా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.

వరంగల్ డిక్లరేషన్ తో రైతులలో విశ్వాసాన్ని పొందామని భావిస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు అనివార్యమని భావిస్తున్న నేపథ్యంలో రైతు సమస్యలపై కాంగ్రెస్ సీరియస్ గా పని చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే రచ్చ బండ కార్యక్రమంలో ధరణి పోర్టల్ వల్ల రైతుల ఇబ్బందులపై ప్రముఖంగా ప్రస్తావించాలని నిర్ణయించుకుంది.  వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు కౌలు రైతులకు పంట రుణమాఫీ అమలు హామీలపై రైతులలో కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తమౌతున్నదన్న పరిశీలకుల విశ్లేషణలతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది.

కొనుగోలు కేంద్రాల పేరుతో తెలంగాణ సర్కార్ రైతులను దగా చేసిందనీ, కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో అకాల వర్షాలకు రైతుల తీసుకు వచ్చిన ధాన్యం తడిసి ముద్దై నష్టాలలో కూరుకుపోయారనీ కాంగ్రెస్ విమర్శిస్తున్నది. అన్నిటికీ మించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రం పరస్పర విమర్శలతో విలువైన కాలాన్ని వృధా చేసి రైతులతో అయోమయం నెలకొల్పారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో రైతులు ధాన్యం కల్లాల వద్ద మరణిస్తుంటే..వారి వైపు కన్నెత్తి చూడని  సీఎం కేసీఆర్   పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్లడాన్ని ప్రశ్నిస్తోంది.  

సరిగ్గా ఆ అంశంలోనే రాష్ట్రంలో రైతులు కూడా కేసీఆర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలలోనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలంటూ సీఎం చేస్తున్న ప్రసంగాల పట్ల జనంలో పెద్దగా స్పందన రావడంలేదనీ, పైపెచ్చు ఆయన జాతీయ అంశాలు ప్రస్తావించే  ప్రతి సారీ జనం రాష్ట్ర సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నారనీ పరిశీలకులు ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.

సరిగ్గా ఈ అంశాన్నే కాంగ్రెస్ అందిపుచ్చుకుని జాతీయ పార్టీగా తాము ప్రాంతీయ అంశాలపై పోరాడుతున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది.  కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందనీ, కేసీఆర్ రాష్ట్ర సమస్యలను విస్మరించి దేశం పట్టుకు తిరుగుతున్నారన్న విమర్శలతో దూకుడుగా ప్రజలలోకి వెళుతోంది.  కాంగ్రెస్ లో ఈ జోష్.. ప్రజలను ఆ పార్టీకి చేరువ చేస్తుందా.. లేక పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య భేదాభిప్రాయాలతో మర మారు ప్రజల ముందు పలుచన అవుతుందా వేచి చూడాలి.