కాంగ్రెస్ ఇక కనుమరుగేనా?
posted on Nov 17, 2025 1:21PM
.webp)
అది కాంగ్రెస్ కాదు.. ఖాన్ గ్రెస్ అని సంఘ్ పరివార్ చేస్తున్న ప్రచార ప్రభావమో.. లేక రాహుల్ చేతగాని తనమో, ఖర్గే శక్తికి మించిన పనితనమో, మరో మన్మోహన్ సింగ్ దొరకని వైనమో.. తెలీదు కానీ ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ ఓటమి ఎదుర్కొంటూనే వస్తోంది. తాజాగా బీహార్ లోనూ బొక్క బోర్లా పడింది కాంగ్రెస్ నాయకత్వంలోని మహా ఘట్ బంధన్. విచిత్రమైన విషయమేంటంటే ఓట్ చోరీ అంటూ పెద్ద ఎత్తున ప్రెజంటేషన్లు ఇచ్చి, ఆపై పాదయాత్రలు చేసి అటు పిమ్మట సర్ అనే విధానమే తప్పుల తడక అంటూ టాంటాం చేస్తే లాస్ట్ కి కాంగ్రెస్ సారధ్యంలోని మహా ఘట్ బంధన్ కే రాం రాం చెప్పేశారు బీహారీ జనం. పైపెచ్చు తమను ఎప్పటి నుంచో సజావుగా పరిపాలిస్తున్న నితీష్ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే జై కొట్టారు.
ఇప్పుడు చూస్తే దక్షణాదిలో తెలంగాణ, కర్ణాటకలో తప్ప మరెక్కడా అజా పజా లేదు కాంగ్రెస్. ఊపూ రూపు షేపు లేదు హస్తం పార్టీకి. జనానికి తాము హ్యాండిద్దామని చూస్తుంటే వాళ్లే రివర్స్ లో వచ్చి హ్యాండ్ పార్టీ షేకయ్యేలా చేస్తున్నారు. అలాంటి ఘోర పరాజయాలు తరచూ ఎదురవుతున్నాయి హస్తం పార్టీకి. ఈ పార్టీ హస్తరేఖలు అంతగా తారుమారై పోయాయి. ఏ జ్యోతిష్కుడికి చూపించి వీటిని సరి చేసుకోవాలో తెలీక తికమక పడిపోతోంది కేడర్ మొత్తం.
ఇక్కడ తెలంగాణలో ఉప ఎన్నికతో సహా విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ అన్న వార్త వినడానికి కూడా మనసు రావడం లేదు.. రాహుల్ పరిస్థితి అయోమయం జగన్నాథంగా మారింది. ఇప్పట్లో ఆయన జాతకం పార్టీ భవితవ్యం మారేలా కనిపించడం లేదు. అంతగా డీలా పడిపోతోంది పార్టీ మొత్తం. మాములుగా ఎవరైనా కష్టపడితే ఫలితాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి. అదే రాహుల్ గాంధీ కష్టపడితే రావాల్సిన రిజల్ట్స్ కూడా రాకుండా వెనక్కు వెళ్లిపోతున్నాయ్. అంత ఘోరంగా రివర్స్ లో తిరుగుతోంది కాంగ్రెస్ అదృష్ట చక్రం.
మొన్నటి వరకూ రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నట్టు కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడు చూస్తే వాటిలోనూ గుండు సున్నా చుట్టేసి.. ఉత్తరాదిలో దాదాపు ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా పోయింది. శూన్య హస్తం మిగిలింది. ఒంటరిగా పోటీ చేస్తే గెటాన్ కాలేక పోతున్నాం.. కనీసం కూటమి కట్టి విజయాలను సాధిస్తామని భావిస్తే అక్కడా జీరో బ్యాలెన్సే చూపిస్తోంది పార్టీలోని సీట్ అకౌంట్. దీంతో ఏం చేయాల్రా కాంగ్రెస్ భగవంతుడా అని తల పట్టుకోవల్సి వస్తోంది రాహుల్ గాంధీ.
ఒకప్పుడు దేశంలోని రాష్ట్రాలన్నిటినీ హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ నేడు చూస్తే, ఆ చేతులను ఎవరో తీసేసినట్టు దారుణ పరాభవాలను మూటగట్టుకుంటూ వెళ్తోంది. పార్టీ ఫెయిల్యూర్స్ లోనే సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ వస్తోంది. ఈ పరాజయ పరంపర ఏ తీరాలకు చేరేను? అన్నట్టుగా మారింది పరిస్థితి. సమకాలీన రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమౌతోంది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలనే తపనతో మెజారిటీ వర్గాలకు దూరమవుతోంది. ముస్లిం, మైనార్టీలకు అండగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తోంది. ఒకప్పుడు యూపీ, బీహార్ లో ఠాకూర్ లు , రాజపుత్రులు కాంగ్రెస్ కు అండగా ఉండేవారు. ఇప్పుడు వారంతా బీజేపీ గూటికి చేరారు. మధ్యప్రదేశ్ లో రాజవంశాలు అన్నీ కాంగ్రెస్ కు దూరమయ్యాయి. రాజకీయాల్లో రాణించడానికి వ్యూహాలు బలంగా ఉండాలి. నేల విడిచి సాముచేస్తే విజయాలు రావు. పార్టీ లో సీనియర్లు అంతా ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. చివరకు పార్టీ కూడా కనుమరుగు అవుతుందా అన్నట్లుగా తయారైంది పరిస్థితి.ఫ్యూచర్లో కర్ణాటక, తెలంగాణలోనూ ప్రభుత్వాలు కనుమరుగైతే.. ఇక కాంగ్రెస్ జీరో స్టేజీకి చేరి కమ్యూనిస్టు పార్టీల సరసన కూర్చోడానికి పెద్దగా టైం పట్టేలా కనిపించడం లేదు.
చివరాఖరికి రాహుల్ గాంధీకి తమిళనాడు ఒక్కటే దిక్కుగా కనిపిస్తోంది. ఇక్కడ స్టాలిన్ పార్టీతో జతగట్టి అధికారంలోకి రావాలని తెగ ఉబలాట పడుతోంది. కానీ విజయ్ పార్టీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలీడం లేదు. దీంతో ఈ రాష్ట్రంపైనా ఆశలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఒక వేళ ఇక్కడ డీఎంకే గెలిచినా అది కాంగ్రెస్ కి అధికార యోగాన్నిచ్చేదేం కాదు. దీంతో రాహుల్ గాంధీ నాయకత్వంలోనికాంగ్రెస్ పరిస్థితికి నానాటికీ తీసికట్టు సామెతగా మారుతోంది.