కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలోకి మాజీ మంత్రి..

ఎన్నికల వేళ, ఉత్తర ప్రదేశ్’లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడున్నర దశాబ్దాలకు పైగా  కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేసిన, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, సింగ్ పేరును స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చిన కొద్ది గంటల్లోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్ లేదని, ముందున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కాంగ్రెస్’కు పొంతనే లేదని అందుకే కాంగ్రెస్ పార్టీని వదిలినట్లు చెప్పారు. ఆయన తమ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు  సోనియాగాంధీకి పంపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ తన రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తీసుకుందని, ఇక్కడి నుంచి కొత్త ప్రస్థానం సాగుతుందని  సింగ్ ట్విట్ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అదలా ఉంటే, మరో పక్షం రోజులో ఫిబ్రవరి 10 న తొలి విడత పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థులను ప్రకటించి.. పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరో వంక ఫిరాయింపులూ కొనసాగుతున్నాయి. ప్రధాన పోటీ, బీజేపీ, ఎస్పీల మధ్యనే అయినా, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నాయి. కింగ్ కాకున్నా కింగ్ మేకర్ కావాలని ఆశ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత, యూపీ ఎన్నికల సారధి ప్రియాంకా వాద్రా ఎన్నికల తర్వాత అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ,  ఎస్పీకి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. 

ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని, ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆర్పీఎన్ సింగ్ చెప్పారు. యూపీ ప్రజలు తనను ఎప్పటి నుంచో బీజేపీలో చేరాలని కోరుతున్నారని.. ఇప్పటికి సాధ్యపడిందని పేర్కొన్నారు. ఆర్పీఎన్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ ప్రతినిధి శశివాలియా, పార్టీ కార్యదర్శి రాజేంద్ర ఆహ్వాన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సింగ్ చేరిక‌ను కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్వాగ‌తించారు. బీజేపీలో సింగ్ చేరికతో యూపీలో పార్టీ మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు. నిజానికి యూపీలో కాంగ్రెస్ పోటీలోఉన్నా లేనట్లేననే అభిప్రాయం ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది. ఆర్పీ సింగ్ రాజీనామాతో మరో సారి రుజువిందని పరిశీలకులు భావిస్తున్నారు.