కరుగుతున్న కాంగ్రెస్ కొండ.. జారుకుంటున్న కీలక నేతలు

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో  హస్తం పార్టీకి ఐదింట ఒక్క వేలూ చిక్కకుండా చేసేందుకు, బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓ వంక ‘జీ’ 23 పేరిట పార్టీ సీనియర్ నాయకులు పెట్టిన వేరు కుంపటితో వేగలేక పార్టీ అధిష్టానం తల పట్టుకుంటే, మరో వంక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీ 23 కీలక నేత గులాం నబీ ఆజాద్’కు పద్మభూషణ్ ప్రకటించి, కాంగ్రెస్ పార్టీలో మరో కుంపటి రాజేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువడి నాలుగు రోజులు అయినా ఇంతవరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదా పార్టీ ‘అగ్ర’ నేతలు రాహుల గాంధీ, ప్రియాంక వాద్రా కానీ ..ఊ.. అనలేదు ..ఊహూ అనలేదు. పెదవి విప్పి  స్పందించ లేదు.కానీ,పార్టీ నాయకులు ఆజాద్ పద్మ పురస్కారానికి అటూ ఇటుగా చీలిపోయారు. నిజమే కావచ్చు బీజేపీ కాంగ్రెస్’లో చిచ్చుపెట్టేందుకే, ఆజాద్’కు పద్మభూషణ్ ప్రకటించి ఉండవచ్చును. అయినా, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆజాద్’ ను అభినందిస్తూ ఒక ప్రకటన చేస్తే, రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేస్తే, కమల దళం వ్యూహం కొట్టుకు పోయేది. కానీ, కాంగ్రెస్ నాయకత్వం ఎందుకనో .. ఆమాత్రం విజ్ఞత చూపలేక పోయింది. పార్టీలో ఓపెన్ వార్’కు అధిష్టానమే అవకాశం కల్పిచింది. ఈ ఓపెన్ వార్ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై ఉంటుందని అంటున్నారు.
అదలా ఉంటే, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో  పోలింగ్ తేదీలు దగ్గరవుతున్నకొద్దీ, సీనియర్ నాయకులు పార్టీని వదిలి పోతున్నారు.ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి.. సీనియర్లు హ్యాండివ్వడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అది కూడా గాంధీ కుటుంబానికి విధేయులు అనుకున్నవారు వరస పెట్టివెళ్లిపోతుంటే అధినాయకత్వం కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి, కాంగ్రెస్ శ్రేణులను కలవర పాటుకు గురిచేస్తోంది. 
ఎప్పుడోనే పార్టీ వదిలి పోయిన మాధవ రావు సింధియా.. జితిన్ ప్రసాద..ఇత్యాదులు పక్కన పెట్టి తాజా ఫిరాయింపులను చూసినా, యూపీలో కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్, 35 ఏళ్ల పార్టీ అనుబంధాన్ని తెంచుకుని, చేయి వదిలి కమలం గూటిని చేరారు. అంతకు ముందే, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదం, ‘లడ్‌కీ హూ.. లడ్ సక్‌తీ హూ (నేను బాలికను.. పోరాడగలను) అంటూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ జనం దృష్టిని ఆకర్షించిన  పోస్టర్ గర్ల్ ప్రియాంక మౌర్య కాంగ్రెస్’కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
గోవాలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణే పోటీ నుంచి తప్పుకున్నారు. వరసగా 11 సార్లు ఆయన విజయ కేతనం ఎగరేసిన పోరియేం నియోజక వర్గం నుంచి ఆయన కోడలు దివ్య విశ్వజిత్ రాణే  బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగడంతో ఆయన పోటీ నుంచి తప్పు కున్నారు. కాంగ్రెస్ ఖాతాలో ఖాయం ఆనుకున్న సీటు కమలం ఖాతాలోకి చేరిపోయింది.  నిజానికి ఆయన కుమారుడు విశ్వజిత్ రాణే 2017 ఎన్న్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీజేపే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.  ఈ ఎన్నికల్లో ఆయన వాల్పోయీ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 
ఉత్తరాఖండ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్’ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన బీజేపీలో చేరారు. ఇక పంజాబ్ విషయం చెప్పనే అక్కరలేదు, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో తేల్చమంటూ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ, రాహుల్ గాంధీని బహిరంగంగా నిల దీశారు. జలంధర్‌లో వర్చువల్‌ ఎన్నికల ర్యాలీలో సిద్దూ ... రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాలను అమలు చేసే,’చెహారా’  (మిఖం)ఏదో చెప్పాలని, లేదంటే ఎన్నికలలో గెలవడం కష్టమని అన్నారు. 
ఈ విధంగా 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్స్’గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అర్థం కాకుండా ఉందని పరిశీలకులు అంటున్నారు.